ముగిసిన రిషి కపూర్ అంత్యక్రియలు.. తన మరణం గురించి ఆయన చెప్పిన మాటలు అక్షరసత్యం అయ్యాయి..

  • Publish Date - April 30, 2020 / 11:54 AM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషి కపూర్ గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముంబైలోని చందన్‌వాడి స్మశానంలో ముగిశాయి. అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులు, కొంతమంది ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. రిషి భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణధీర్ కపూర్, కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్, అనిల్ అంబానీ, అయాన్ ముఖర్జీ, అలియా భట్, అభిషేక్ బచ్చన్ తదితరులు అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన కుమార్తె రిద్ధిమా కపూర్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. 

ఈ నేపథ్యంలో 2017లో రిషికపూర్ చేసిన రెండు ట్వీట్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2017 ఏప్రిల్‌ 27న ప్రముఖ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా మృతి చెందారు. ఆయన అంత్యక్రియలకు బాలీవుడ్‌ నుంచి సెలబ్రిటీలు ఎక్కువశాతం మంది హాజరుకాలేదు. ఈ ఘటనపై రిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత గొప్ప నటుడు మృతి చెందితే.. కనీసం ఆయనకు నివాళి అర్పించేందుకు కూడా ఎవరూ రాకపోవడం సిగ్గుచేటు, ఆయనతో కలిసి పని చేసిన వాళ్లు కూడా ఆయన అంత్యక్రియలకు హాజరుకాలేదు. పెద్దలను గౌరవించడం నేర్చుకోండి.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

‘‘ఇది ఇంతటితో ఆగదు. నా విషయంలోనే.. వేరే వాళ్ల విషయంలోనూ ఇదే జరుగుతుంది. నేను చనిపోయినప్పుడు. నన్ను మోసేందుకు ఎవరూ ఉండరు. అందుకు సిద్ధంగా ఉండాలి. ఈరోజు స్టార్స్ అని చెప్పుకొనే వాళ్లని చూస్తే.. చాలా చాలా కోపం వస్తుంది’’ అని ఆయన మరో ట్వీట్ చేశారు. 
అయితే రిషికపూర్ చేసిన రెండో ట్వీట్ అక్షర సత్యమైంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన కారణంగా ఆయన అంత్యక్రియలకు ఎవరూ హాజరుకాలేని పరిస్థితి నెలకొంది. అంత్యక్రియలకు కేవలం 20 మంది మాత్రమే హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఈ సందర్భంగా రిషి ట్వీట్స్ గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమవుతున్నారు అభిమానులు..  

ట్రెండింగ్ వార్తలు