India Covid Situation: దేశంలో కరోనా కల్లోలం.. సైన్యాన్ని దించండి..

భారత్‌లో కోవిడ్‌ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు.

Situation very desperate in India : భారత్‌లో కోవిడ్‌ తీవ్రత చాలా ఆందోళనకర స్థాయిలో ఉందని అమెరికా ఉన్నతస్థాయి ఆరోగ్య నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫౌచీ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు సర్వశక్తులూ వినియోగించు కోవాలనీ, తక్షణమే తాత్కాలిక కోవిడ్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వానికి ఆయన సూచించారు.

గత ఏడాది కోవిడ్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో చైనా ఇదే చేసిందని ఆయన చెప్పారు. అవసరమైతే సైన్యాన్ని కూడా రంగంలోకి దించాలన్నారు. కోవిడ్‌ వ్యాప్తి తీవ్రతతో భారత్‌ చాలా ఒత్తిడికి గురవుతోందని… అమెరికా మాదిరిగానే మిగతా దేశాలు కూడా భారత్‌కు సాయం అందించేందుకు ముందుకు రావాలని ఫౌచీ కోరారు. భారత్‌లో కోవిడ్‌ చికిత్సలో ఉపయోగించే వైద్య సామాగ్రి కొరత ఉన్న దృష్ట్యా ప్రపంచ దేశాలు అవసరమైన ఆ సామాగ్రిని అందజేయాలన్నారు.

దీంతోపాటు వైద్య సిబ్బందిని కూడా పంపించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో, వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం పౌరులందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలని, భారత్‌లో అభివృద్ధి పరిచిన రెండు టీకాలతోపాటు, అమెరికా, రష్యాతో పాటు ఇందుకోసం ముందుకు వచ్చే మరే ఇతర దేశాలకు చెందిన సంస్థల నుంచైనా సరే టీకాలను సేకరించి సాధ్యమైనంత మందికి ఇవ్వడం తక్షణం ప్రారంభించాలన్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వైరస్‌ వ్యాప్తిని నిలువరించేందుకు భారత్‌లో కొన్ని వారాలపాటైనా లాక్‌డౌన్‌ విధించడం మేలన్నారు ఆంథోనీ ఫౌచీ.

ట్రెండింగ్ వార్తలు