Prajwal Revanna : లైంగిక ఆరోపణలతో చిక్కుల్లో జేడీఎస్ ఎంపీ.. సస్పెండ్ చేసినా ఆగని రచ్చ!

డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం అత్యవసరంగా పార్టీ మీటింగ్‌ పెట్టిన JDS అగ్రనేత కుమారస్వామి.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Prajwal Revanna : కర్నాటక JDS ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వీడియోల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. జేడీఎస్, బీజేపీ టార్గెట్‌గా కాంగ్రెస్‌ విమర్శల దాడి పెంచింది. అసలే ఎన్నికల సమయం.. పైగా ప్రతిపక్షాల రచ్చ..మీడియాలో వరుస కథనాలతో అలర్ట్ అయింది జేడీఎస్‌ పార్టీ.

Read Also : Tdp Janasena Manifesto : మోదీ ఫొటో ఎందుకు లేదో తెలుసా..?

డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసం అత్యవసరంగా పార్టీ మీటింగ్‌ పెట్టిన JDS అగ్రనేత కుమారస్వామి.. ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. లైంగిక వీడియోల ఇష్యూ బయటికి వచ్చిన తర్వాత ప్రజ్వల్‌ రేవణ్ణ.. భారత్‌ వదిలి జర్మనీ వెళ్ళినట్లు తెలుస్తోంది. మరోవైపు అతనితో పాటు అతని తండ్రి HD రేవణ్ణపై మహిళలు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని HD దేవగౌడ పెద్ద కొడుకు రేవణ్ణ కుమారుడే ఈ ప్రజ్వల్ రేవణ్ణ.

ఈ వివాదం వెనక కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ హస్తం ఉందని ఆరోపించారు JDS అగ్రనేత కుమారస్వామి. సిట్‌ దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్‌డ్రైవ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి.? ఎవరు వెనకుండి నడిపంచారో త్వరలో బయటపడుతుందన్నారు కుమారస్వామి.

బీజేపీ, జేడీఎస్ కూటమికి తలనొప్పిగా ప్రజ్వల్ ఇష్యూ :
ఈ ఇష్యూపై బీజేపీ స్పందించింది. తమది ఎప్పుడూ మహిళల పక్షమే అని తెలిపారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో ఉపేక్షించేది లేదన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉందన్న అమిత్ షా.. దర్యాప్తు చేసి ప్రజ్వల్‌ రేవణ్ణపై చర్యలు తీసుకోవచ్చన్నారు.

ఇక.. ప్రజ్వల్‌కు చెందినవిగా చెబుతున్న అసభ్యకర వీడియోలపై దర్యాప్తు జరుగుతోంది. కర్నాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసి..ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకునేందుకు విచారణను స్పీడప్ చేసింది. జాతీయ మహిళా కమిషన్ కూడా ప్రజ్వల్ రేవణ్ణ ఇష్యూపై స్పందించింది. దేశం విడిచి వెళ్లిన రేవణ్ణను పట్టుకునేందుకు తీసుకున్న చర్యలపై మూడ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని కర్నాటక పోలీసులను ఆదేశించింది నేషనల్ ఉమెన్ కమిషన్.

వీడియోల వ్యవహారంతో ప్రజ్వల్‌ రేవణ్ణ రాజకీయ భవిష్యత్‌ ఆందోళనకరంగా మారింది. పరిస్థితులను చూస్తే ప్రజ్వల్ రేవణ్ణ పెద్ద చిక్కుల్లో పడినట్లే కనిపిస్తోంది. ఇక సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రజ్వల్‌ ఈసారి కూడా హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఒకవేళ ప్రజ్వల్ రేవణ్ణ గెలిస్తే పరిస్థితి ఏంటి.? అంటూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ప్రజ్వల్ రేవణ్ణ పదవికి రాజీనామా చేస్తారా.? లేదా.? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ అంశం ఇప్పుడు జాతీయస్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే అంశంపై కాంగ్రెస్ నేతలు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల వేళ బీజేపీ, జేడీఎస్ కూటమికి ఈ ఇష్యూ తలనొప్పిగా మారింది. ఆచితూచి వ్యవహరించిన JDS..రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడేక్కడంతో..ప్రజ్వల్‌పై వేటు వేసింది.

Read Also : Pm Modi : జాగ్రత్త.. ఆ పార్టీ గెలిస్తే మీపై వారసత్వ పన్ను విధిస్తారు- ప్రధాని మోదీ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు