కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు.. ఢిల్లీలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం

కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో డబుల్ షాక్ తగిలింది. పార్లమెంట్ స్థానాలకు పరిశీలకులుగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు.

Delhi Congress Leaders : లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఢిల్లీలోని రెండు లోక్‌సభ స్థానాలకు పరిశీలకులుగా ఉన్న ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నీరజ్‌ బసోయా, నసీబ్‌ సింగ్‌ బుధవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ ఆప్ కూటమి కారణంగానే తాము పార్టీని వీడుతున్నట్టు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన వేర్వేరు లేఖల్లో వారు పేర్కొన్నారు. ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా చేసిన నాలుగు రోజులకే వీరిద్దరూ కాంగ్రెస్‌ను వీడడం హాట్ టాపిక్‌గా మారింది.

మాజీ ఎమ్మెల్యే నీరజ్ బసోయా పశ్చిమ ఢిల్లీ పార్లమెంటరీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ పరిశీలకుడిగా ఉన్నారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తును ఆయన మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో అలయెన్స్ కారణంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిరోజు అవమానాలు, ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారని ఖర్గేకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆత్మగౌరవం ఉన్న నాయకుడిగా తాను ఇక కాంగ్రెస్‌లో కొనసాగలేనని.. పార్టీ పదవులకు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనలాంటి సామాన్యుడికి 30 ఏళ్ల పాటు పార్టీలో అవకాశం కల్పించిన సోనియా గాంధీకి ధన్యవాదాలు చెప్పారు.

Also Read: ఢిల్లీలో 100కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం.. పోలీసుల తనిఖీలు

ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్‌గా దేవిందర్ యాదవ్ నియామకాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేస్తున్నట్టు వాయువ్య ఢిల్లీ పార్టీ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే నసీబ్ సింగ్ ప్రకటించారు. దేవిందర్ యాదవ్ ఒంటెత్తు పోకడలు పోతున్నారని విమర్శించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో అరవింద్ కేజ్రీవాల్ ను విమర్శిస్తూ.. ఢిల్లీలో మాత్రం ప్రశంసిస్తున్నారని తెలిపారు. కాగా, ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Also Read: జాగ్రత్త.. ఆ పార్టీ గెలిస్తే మీపై వారసత్వ పన్ను విధిస్తారు- ప్రధాని మోదీ వార్నింగ్

ట్రెండింగ్ వార్తలు