Maruti Stockyard Flooded: ఓ మై గాడ్.. నీట మునిగిన 300 కార్లు.. హర్యానాలో వరదల బీభత్సం.. వీడియో చూస్తే..

వరదలు హర్యానాని కుదిపేస్తున్నాయి. అక్కడ పరిస్థితులు అత్యంత దారుణంగా మారాయి. ఈ దృశ్యం అందుకు నిదర్శనంగా నిలుస్తుంది..

Maruti Stockyard Flooded: ఓ మై గాడ్.. నీట మునిగిన 300 కార్లు.. హర్యానాలో వరదల బీభత్సం.. వీడియో చూస్తే..

Updated On : September 7, 2025 / 6:12 PM IST

Maruti Stockyard Flooded: హర్యానాలో వరదలు బీభత్సం సృష్టించాయి. భారీగా కురిసిన వర్షాలతో జన జీవనం స్థంభించింది. వరద పోటెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల పైనే కాదు.. ఓ కార్ల కంపెనీపైనా వరదల ప్రభావం పడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 కార్లు వరద నీటిలో మునిగాయి. అవన్నీ కూడా దాదాపుగా డ్యామేజ్ అయ్యాయి. వరద నీటిలో తేలియాడుతున్నట్లుగా కార్లు ఉన్నాయి.

మారుతి స్టాక్ యార్డ్ ని ముంచెత్తిన వరద..

హర్యానాలోని బహదుర్గా దగ్గర ఉన్న మారుతి స్టాక్ యార్డ్ ని వరద ముంచెత్తింది. దీంతో స్టాక్ యార్డ్ లోని కార్లు నీట మునిగాయి. స్టాక్ యార్డ్ లో పార్కింగ్ చేసిన కార్లు పూర్తిగా వరద నీటిలో మునిగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు మారుతి స్టాక్ యార్డ్ పక్కనే ఉన్న కాలనీల్లోకి సైతం భారీగా వరద నీరు చేరింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఉత్తరాదిలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్ అంతటా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హర్యానాలతో పరిస్థితి దారుణంగా ఉంది. వరదలు పోటెత్తాయి. పార్కింగ్ యార్డ్ లో ఉన్న కార్లు వరద నీటిలో మునిగాయి. యమునా నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీంతో ముంపు ప్రాంతాలన్నీ ఇంకా భయం గుప్పిటలోనే ఉన్నాయి. హర్యానాలో కురుస్తున్న కుండపోత వానలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి.

కార్లను బయటకు తీయడం కష్టం..

మారుతి స్టాక్‌యార్డ్‌లో నిలిపి ఉంచిన దాదాపు 300 వాహనాలు వరద నీటిలో మునిగిపోయాయి. వాటిని బయటకు తీయడం కష్టతరంగా మారింది. ఏడు రోజులుగా వాహనాలు నీటిలో నానుతున్నాయి.

ఆల్టో, వ్యాగన్ ఆర్, విటారా, బెజ్జా, ఇన్విక్టో వరకు మారుతి స్టాక్‌ యార్డ్‌లో నిలిపి ఉంచాయి. చాలా వాహనాల ఎయిర్‌ బ్యాగ్‌లు తెరిచి ఉన్నాయి. అనేక వాహనాల డ్రైవర్ సైడ్ విండో గ్లాస్ కూడా తొలగించబడింది. బానెట్ వరకు నీరు నిండి ఉంది. ఈ వాహనాలు స్థానిక షోరూమ్ యజమానులకు చెందినవి. రాత్రి పూట సడెన్ గా నీరు ముంచెత్తింది. క్షణాల్లోనే వరద ముంచెత్తింది. చూస్తుండగానే కార్లన్నీ నీటిలో మునిగిపోయాయి.

అటు వరదల కారణంగా పారిశ్రామిక ప్రాంతంలోని కర్మాగారాల్లో పనులు ఆగిపోయాయి. అనేక కర్మాగారాలు నాలుగు నుండి ఐదు అడుగుల నీటితో నిండిపోయాయి.

 

Also Read: ఆ ఉద్యోగులకు ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌.. రూ.1.6 కోట్ల వరకు ఇన్సురెన్స్