Ktr : హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే కుట్ర..!- కేటీఆర్ సంచలన ఆరోపణలు

12 ఎంపీ సీట్లు గెలిపిస్తే అన్నీ సర్దుకుంటాయ్. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుంది.

Ktr : మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. జూన్ 2 తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తారనే అనుమానం ఉందన్నారు. అలాగే గోదావరి నీళ్లను తరలించే కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీల కుట్రలను అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ ను గెలిపించడమే ఏకైక మార్గం అన్నారు కేటీఆర్. కరీంనగర్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు.

”హైదరాబాద్ ని జూన్ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ చూస్తున్నాయి. అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం చేయకుండా అడ్డుకుంటాం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాకుండా, రాజ్యాంగం మార్చకుండా అడ్డుకునే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉంది. ఈ ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు వస్తే ఏడాదిలోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. తుంటి విరిగినా, కూతురు జైలు పాలైనా, నమ్మిన వారు మోసం చేసి పార్టీ మారినా కేసీఆర్ బెదరలేదు.

మేము అధికారంలో ఉంటే ఈ 4 నెలల్లో కరీంనగర్ అంతర్జాతీయ స్థాయి నగరాలతో పోటీ పడేది. కొంతమంది పోలీసులు తోక ఆడిస్తున్నారు. కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు. 12 ఎంపీ సీట్లు గెలిపిస్తే అన్నీ సర్దుకుంటాయ్. కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుంది. కాంగ్రెస్ కేసులు పెట్టాలని ఒత్తిడి తెచ్చినా, బండి సంజయ్ లొల్లి చేసినా ఏమీ కాదు. తోక ఆడించిన వారు జాగ్రత్త పడతారు. కార్ ఓవర్ లోడ్ అయింది. నాయకులు, కార్యకర్తల మధ్య పోరు వల్ల ఈ పరిస్థితి వచ్చింది.

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఓ మేధావిని నిలబెట్టారు. ఆయనకు ఓటేస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతారని అంటారు ఆ మేధావి. కరీంనగర్ చౌరస్తాలో నిలబడితే ఎవరైనా గుర్తుపడతారా? కాంగ్రెస్ ఓ అనామకుడిని అభ్యర్థిగా పెట్టి బీజేపీతో ఫిక్సింగ్ చేసుకుంది. మాకు బీజేపీతో ఫిక్సింగ్ ఉంటే కవితను జైల్లో వేస్తారా..? ఇష్టం లేని చోటకు జీవన్ రెడ్డిని పంపి కరీంనగర్ లో డమ్మీ, మల్కాజిగిరిలో డమ్మీ, చేవెళ్లలో డమ్మీ అభ్యర్థులను నిలిపి.. ఇలా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్. రాహుల్ గాంధీ లిక్కర్ స్కామ్ ఫేక్ అంటే.. రేవంత్ రెడ్డి ఏమో లిక్కర్ స్కామ్ జరిగిందని అంటారు. టీవీ చర్చల్లో బీజేపీకి ఓటేయాలని రేవంత్ అన్నారు.

నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను దోచుకునే కుట్రలు చేస్తున్నారు. బీజేపీ.. 400 సీట్లు అంటున్నది రిజర్వేషన్లని ఎత్తేసేందుకే. బండి సంజయ్ కి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. ఆయనకు తెల్సింది ఒక్కటే జై శ్రీరామ్. రాముడు అందరి వాడు.. రాముడు ఆదర్శ పాలకుడు.. అందరం జై శ్రీరామ్ అందాం.. బీజేపీ ఓడితే ఏ దేవుళ్ళకు ఏమీ కాదు” అని కేటీఆర్ అన్నారు.

Also Read : రిజర్వేషన్ల వివాదంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు

 

ట్రెండింగ్ వార్తలు