తెలంగాణలో పోటీకి టీడీపీ, జనసేన దూరం.. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి పిలుపు

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

TDP, Janasena, BJP Alliance: లోక్‌స‌భ‌ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నాయి. పొత్తులు, అభ్యర్థుల ఖరారు కోసం తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు.. సీట్ల సర్దుబాటు ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ ఆఫర్ చేసిన దానికంటే అధిక సీట్లు కావాలని బీజేపీ పట్టుబడుతోంది. దీంతో టీడీపీ, జనసేన అధినేతలు ఢిల్లీలో బీజేపీ అధినాయకత్వంతో చర్చలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకు వచ్చింది.

లోక్‌స‌భ‌ ఎన్నికల్లో తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ, జనసేన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఈ రెండు పార్టీలు ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో ఈ మూడు పార్టీల మధ్య పొత్తు నేపథ్యంలో ఈ దిశగా టీడీపీ, జనసేన ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ పోటీ చేయలేదు. జనసేన మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేసింది.

Also Read: పవన్ కల్యాణ్ మాటలు నమ్మకండి.. మోసపోతారు: పోసాని కృష్ణమురళి

కిషన్ రెడ్డికి అధిష్టానం పిలుపు
మరోవైపు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఈ రోజు సాయంత్రం వరకు ఢిల్లీలో అందుబాటులో ఉండాలని బీజేపీ హైకమాండ్ ఆయనకు సూచించినట్టు సమాచారం. అభ్యర్థులను ఖరారు చేయడానికి ఆయనను ఢిల్లీకి పిలిచినట్టు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు