Kotia Villages : ఏపీలోనే ఉంటాం.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాల ప్రజలు

తాము ఆంధ్రులమేనని.. ఏపీలోనే ఉంటామంటూ.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజలు ఏపీ సర్కార్‌ను ఆశ్రయించారు.

Andhra-Odisha border : తాము ఆంధ్రులమేనని.. ఏపీలోనే ఉంటామంటూ.. ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లోని వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజలు ఏపీ సర్కార్‌ను ఆశ్రయించారు. ఏపీ ప్రభుత్వం దయవల్ల ఆనందంగా జీవించగలుగుతున్నామని.. తమను ఆంధ్రప్రదేశ్‌ వాసులుగానే పరిగణించాలని.. విజయనగరం జిల్లా కలెక్టర్‌ను ఆదివాసీలు కలిశారు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ఎన్నో పథకాలు తాము అందుకుంటున్నామని చెప్పుకొచ్చారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో వివాదాస్పదంగా మారిన 21 కొటియా గ్రామాల నుంచి 50 మంది విజయనగరం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్‌ను కలిసి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు. తాము ఆంధ్రులమని, తమది ఆంధ్రప్రదేశ్‌ కాబట్టి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విన్నవించారు.

Supreme Court : లఖింపూర్‌ ఖేరీ ఘటనపై మరోసారి విచారణ

21 కొటియా గ్రామాలను ఆక్రమించేందుకే ఒడిశా ప్రభుత్వం హుటాహుటిన భవనాల నిర్మాణం చేస్తోందని అధికారుల ఎదుట వాపోయారు. ఇటీవల కాలంలో కోరాపుట్‌ ఎమ్మెల్యే, పోలీసులు తమపై రౌడీయిజం చేస్తున్నారని ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేశారు. పూర్వం నుంచి తాము ఆంధ్రులమేనని, అందుకు సంబంధించిన భూమిశిస్తు తామ్రపత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.

దీనిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని కొటియా ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం సమావేశ మందిరంలో కొటియా గ్రామప్రజలను కలెక్టర్‌ సత్కరించారు. వారితో కలిసి భోజనం చేశారు.

ట్రెండింగ్ వార్తలు