Andhra University Corona : ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం : రెండురోజుల్లో 109 మందికి పాజిటివ్

విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. రెండు రోజుల్లో 109 మంది కరోనా భారినపడడంతో.. మిగతా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Corona positive for 109 students in Andhra University : విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. కొత్తగా 38 మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులకు పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. రెండు రోజుల్లో 109 మంది కరోనా భారినపడడంతో.. మిగతా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరో 400 మంది టెస్ట్‌ రిపోర్ట్‌లు ఇంకా రావాల్సి ఉంది.

కోవిడ్‌ వ్యాప్తితో ఏయూలోనిం ఇంజనీరింగ్‌ హాస్టళ్ల ప్రాంగణాన్ని ఐసొలేషన్‌ సెంటర్‌గా మార్చారు. కరోనా సెకండ్‌ వేవ్‌లో…విశాఖలో తొలి కంటైన్‌మెంట్‌ జోన్‌ ఇదే. వైరస్‌ విజృంభణతో ఏయూ పరిధిలో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ పరీక్షలు వాయిదా పడ్డాయి. మరోవైపు ఏపీ సెట్‌ సెకండ్‌ ఫేజ్‌ కౌన్సిలింగ్‌ వాయిదా పడింది. ఈ నెల 30 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరగాల్సి ఉంది. అయితే వైరస్ ఎఫెక్ట్‌తో అధికారులు కౌన్సిలింగ్‌ను వాయిదా వేశారు.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ క్యాంపస్‌లోని హాస్టల్‌లో ఆరు బ్లాకులను కరోనా వార్డులుగా మార్చారు. కోవిడ్‌ బాధితులను కాంటాక్ట్‌లను గుర్తించి వారికి టెస్ట్‌లు చేస్తున్నారు వైద్యసిబ్బంది. ఏయూలో కరోనా వ్యాప్తితో విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అయితే ఎవ్వరూ ఆందోళన చెందవద్దని యూనివర్సిటీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

మరోవైపు విశాఖ జిల్లావ్యాప్తంగానూ కోవిడ్‌ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాలో కొత్తగా 156 మందికి పాజిటివ్‌ నిర్థారణ అయ్యింది. ప్రస్తుతం జిల్లాలో 766 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు