YCP: విజయసాయిరెడ్డి మాయాజాలంపైనే ఒంగోలు వైసీపీ భవిష్యత్.. ఏం చేస్తారో?

ఒక్క ఒంగోలు మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీలో ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయకర్తగా నియమితులైన విజయసాయిరెడ్డికి కత్తిమీద సాములా తయారైంది పరిస్థితి.

YCP- Prakasam District: అధికార వైసీపీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారాయి. గత ఎన్నికల్లో ఒక్క కొండపి (Kondapi) తప్పి మిగిలిన అన్నిసీట్లలో జైకేతనం ఎగురవేసిన వైసీపీకి ప్రస్తుత పరిస్థితులు ప్రతికూలంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలు (Ongole) పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఆరు చోట్ల అంతర్గత విభేదాలు క్యాడర్‌ను కలవరానికి గురిచేస్తున్నాయి. సీఎం జగన్ (CM Jagan) దగ్గర బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy) జిల్లా బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ట్రబుల్‌షూటర్, ఎంపీ విజయసాయిరెడ్డికి అప్పగించారు. రాజకీయ వ్యూహ చతురతలో తిరుగులేని ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) యాక్షన్‌ ప్లాన్ ఏంటి? ప్రకాశం రాజకీయాన్ని చక్కదిద్దగలరా?

ఒంగోలు పార్లమెంట్ పరిధిలో అధికార వైసీపీకే బలం ఎక్కువ. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం పరిధిలో ఆరు అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంది వైసీపీ.. ఐతే ఇప్పుడు ఈ ఆరు నియోజకవర్గాలతోపాటు ప్రతిపక్షం గెలిచిన కొండపిలో సైతం నేతల మధ్య కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా గిద్దలూరు, కనిగిరి, సంతనూతలపాడు, కొండపి, దర్శి నియోజకవర్గాల్లో నేతలు ఎప్పటికప్పుడు రోడ్డెక్కుతుండటంతో పార్టీ పరువు బజారున పడుతోందని ఆవేదన చెందుతున్నారు కార్యకర్తలు. ఇక మార్కాపురం, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లోనూ పరిస్థితులు అంత సవ్యంగా లేనట్లు ప్రచారం జరుగుతోంది.

మాజీ మంత్రి బాలినేని పూర్తిగా ఒంగోలు నియోజకవర్గానికే పరిమితం కావడంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గిద్దలూరులో ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి సీనియర్ నేత కారుమూరి వెంకట రమణారెడ్డి పక్కలో బల్లెంలా తయారయ్యారు. కనిగిరిలో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌‌పై రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణరెడ్డికు విభేదాలు ఉన్నాయి. ఈసారి బుర్రాకు సీటిస్తే ఓడిస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు సత్యనారాయణరెడ్డి. మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జునరెడ్డిపై మరో నేత పెద్దిరెడ్డి సూర్య ప్రకాశరెడ్డి అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.

Also Read: వాడుకుని వదిలెయ్యడంలో చంద్రబాబు దిట్ట.. ఆ నాలుగు పార్టీలను వాడుకుని వదిలేశాడు : పేర్ని నాని

దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌‌రెడ్డి, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్వర్గాలుగా పార్టీ విడిపోయింది. ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొండపిలోనూ ఇదే పరిస్థితి. మాజీ ఇన్‌చార్జి డాక్టరు మాదాసి వెంకయ్య, ఇన్‌చార్జి వరికూటి అశోక్ గ్రూపులుగా పార్టీ నడుస్తోంది. గడప గడపకూ కార్యక్రమంలో ఇన్‌చార్జి తమ ఇంటికి రావొద్దనే పోస్టర్లు వేసేదాకా వెళ్లింది అక్కడి పరిస్థితి. సంతనూతలపాడులో ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. యర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలపు సురేశ్‌కూ పార్టీలో విభేదాలు చికాకు పుట్టిస్తున్నాయి.

Also Read: కంటికి ఎవరు కనపడ్డా ఆయన పచ్చ కండువా కప్పేస్తున్నారు: మంత్రి అంబటి

ఒక్క ఒంగోలు మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీలో ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయకర్తగా నియమితులైన విజయసాయిరెడ్డికి కత్తిమీద సాములా తయారైంది పరిస్థితి. మరో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు జరగనున్నందున నేతలందరినీ సమన్వయం పరచి ఏకం చేయడం కుదురుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ క్యాడర్ మాత్రం ఎంపీ విజయసాయిరెడ్డిపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ట్రబుల్‌షూటర్‌గా గుర్తింపు పొందిన విజయసాయిరెడ్డి మాయాజాలంపైనే ఒంగోలు వైసీపీ భవిష్యత్ ఆధారపడివుంది.

ట్రెండింగ్ వార్తలు