సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు జైలు శిక్ష, భారీ జరిమానా విధించిన ఢిల్లీ కోర్టు

23 ఏళ్ల నాటి పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు 5 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది.

Activist Medha Patkar: నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి, ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు 5 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వేసిన 23 ఏళ్ల నాటి పరువునష్టం కేసులో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ ఈ మేరకు తీర్పు వెలువరించారు. జైలు శిక్షతో పాటు పాట్కర్‌కు 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించారు. అయితే, ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసుకోవడానికి వీలుగా జైలు శిక్షను ఒక నెల పాటు నిలిపివేసేందుకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అంగీకరించారు.

మేధా పాట్కర్‌ వయసు, అనారోగ్యాన్ని గమనంలోకి తీసుకుని తక్కువ శిక్ష విధించినట్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ పేర్కొన్నారు. పరువునష్టం కేసులో రెండేళ్ల వరకు సాధారణ జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించబడతాయి. కాగా, ఈ కేసులో వాదనలు మే 30న పూర్తయ్యాయి. జూన్ 7న తీర్పు రిజర్వ్ చేసి.. తాజాగా వెల్లడించారు.

2001లో మేధా పాట్కర్‌పై వినయ్ కుమార్ సక్సేనా పరువునష్టం దావా వేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ అనే ఎన్జీవోకు నేతృత్వం వహించిన ఆయనకు వ్యతిరేకంగా అప్పట్లో మేధా పాట్కర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. చట్టవిరుద్ధంగా హవాలా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీంతో టీవీ ఛానెల్‌లో తనపై అవమానకరమైన వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కలిగించే పత్రికా ప్రకటన జారీ చేసినందుకు పాట్కర్‌పై సక్సేనా రెండు కేసులు పెట్టారు.

Also Read: కళ్ల ముందే ఘోరం జరిగిపోయింది.. వరద నీటిలో కొట్టుకుపోయిన కుటుంబం, ఒళ్లు గగుర్పొడిచే వీడియో

ట్రెండింగ్ వార్తలు