Bangalore Hotels to Shut Down : సంచలన ప్రకటన.. ఈ సిటీలో హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేత.. మార్చి 10 నుంచే.. కారణమిదే..!
Bangalore Hotels to Shut Down : బెంగళూరులోని హోటల్స్, రెస్టారెంట్స్ సంఘం కీలక ప్రకటన చేసింది. మార్చి 10 నుంచి నగరంలోని హోటళ్లను మూసి వేస్తామని ప్రకటించింది.
Bangalore hotel body warns hotels may shutdown from March 10 due to LPG shortage
Bangalore Hotels to Shut Down : పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం మన దేశం మీద కూడా పడింది. దేశంలో చమురు, ఎల్పీజీ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అలానే సిలిండర్ లాక్-ఇన్ పీరియడ్‌ను 15 నుంచి 25 రోజులకు పెంచారు. ఇక కమర్షియల్ గ్యాస్ ధర పైపైకి పోతుందే తప్ప దిగి రావడం లేదు. పైగా ధర పెరిగినా సరైన సరఫరా లేక హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్ని కంపెనీలు అయితే గ్యాస్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ క్రమంలో బెంగళూరు హోటల్ యాజమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్యాస్ సరఫరాను పునరుద్ధరించే వరకు హోటళ్లు, రెస్టారెంట్లు మూసివేస్తామని ప్రకటించారు.
బెంగళూరులోని వందలాది హోటళ్లు, రెస్టారెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బెంగళూరు హోటల్స్ అసోసియేషన్.. మార్చి 9న ఒక ప్రకటన విడుదల చేసింది. కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల సరఫరా దెబ్బతినడంతో మార్చి 10 నుంచి హోటళ్లలో కిచెన్ కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఈ పరిస్థితి వల్ల వేలాది మంది రోజువారీ కూలీలు, విద్యార్థులు, వృద్ధులు, ఆసుపత్రుల్లో ఉన్న రోగులు వంటి వారు తక్కువ ధరకు దొరికే భోజనం లభించక తీవ్రంగా ఇబ్బంది పడతారని హెచ్చరించింది.
దాదాపు 70 రోజుల పాటు దేశంలో గ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని చమురు కంపెనీలు తమకు హామీ ఇచ్చాయని.. కానీ అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ సరఫరా ఆగిపోవడం వల్ల హోటల్ పరిశ్రమ దారుణంగా దెబ్బతింటుందని ఈ అసోసియేషన్ చెప్పుకొచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేస్తే చాలా మంది భోజనానికి ఇబ్బంది పడతారని ప్రకటించింది.
గ్యాస్ సరఫరా వెంటనే పునరుద్ధరించకపోతే బెంగళూరులోని హోటళ్లు, రెస్టారెంట్లు మార్చి 10 నుంచి తమ కిచెన్లు మూసివేయాల్సి వస్తుందని సంఘం హెచ్చరించింది. అలా జరిగితే సాధారణ ప్రజలకే కాకుండా ఆసుపత్రి క్యాంటీన్లు, విద్యార్థి హాస్టళ్లు, కార్పొరేట్ క్యాఫెటీరియాలు నగరాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకూ భోజన సదుపాయం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు.
1936లో స్థాపించబడిన బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సంఘం నగరంలోని 3,000కు పైగా రెస్టారెంట్లు, హాస్పిటాలిటీ సంస్థల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కమర్షియల్ గ్యాస్ సరఫరాను వెంటనే పునరుద్ధరించేందుకు కేంద్ర మంత్రులు జోక్యం చేసుకోవాలని ఈ సంఘం కోరింది. దేశీయ ఎల్పీజీ సరఫరాలో సుమారు 40 శాతం వరకు ఐఓసీ (IOC), భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ వంటి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. అయితే ముంబై, చెన్నై, విశాఖలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నగరాల్లో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ సరఫరా పడిపోవడంతో హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
