No Confidence Motion : లోక్‌సభ స్పీకర్‌పై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం.. 10 గంటల పాటు జరగనున్న చర్చ
No Confidence Motion : పార్లమెంట్ రెడో విడత సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్.. స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది.
Opposition moves no confidence motion against lok sabha speaker Om Birla in parliament budget session
No Confidence Motion : పార్లమెంట్ రెండో దశ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో విడత సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే పొలిటికల్ హీట్ రాజుకుంది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ విపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానంపై సభలో నేడు (మార్చి 10) చర్చ జరుగుతోంది. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు ఏకంగా పది గంటల సమయాన్ని కేటాయించారు. అనంతరం ఓటింగ్ నిర్వహిస్తారు. కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావిద్ స్పీకర్ బిర్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. బడ్జెట్ సెషన్ మొదటి దశలోనే ప్రతిపక్షం స్పీకర్‌కు వ్యతిరేకంగా తీర్మానం దాఖలు చేయగా.. దీనిపై 118 మంది సభ్యులు సంతకం చేశారు.
బిర్లాపై ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానంలో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు:
- స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని.. సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని అవిశ్వాస తీర్మానంలో చెప్పుకొచ్చారు.
- అలాగే 8 మంది కాంగ్రెస్ ఎంపీలను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు.
- విపక్ష మహిళా ఎంపీలపై అనుచిత ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
స్పీకర్ తొలగింపు తీర్మానంపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సభకు అధ్యక్షత వహించిన జగదాంబికా పాల్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై సంతకాలు సరైన రీతిలో లేకపోయినా.. స్పీకర్ ఓం బిర్లా దానిపై చర్చకు అనుమతించి ఆయన ఉదారతను చాటుకున్నారని ప్రశంసించారు. అయితే జగదాంబికా పాల్ చేసిన ఈ వ్యాఖ్యలను విపక్ష సభ్యులు ఖండించారు.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రభుత్వం తరఫున ఈ తీర్మానంపై చర్చను ప్రారంభించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తేందుకు ప్రయత్నించిన విపక్ష ఎంపీల విజ్ఞప్తిని తిరస్కరించడంతో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాలు ఇచ్చిన అన్ని నోటీసులను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన ఛైర్మన్.. సభా కార్యక్రమాలను కొనసాగించారు.
స్పీకర్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించాలంటే సాధారణ మెజారిటీ సరిపోతుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే.. మొత్తం 272 మంది సభ్యుల మద్దతు అవసరం (సభలో హాజరై ఓటు వేసే సభ్యులలో మెజారిటీ). ప్రస్తుతం సభలో మొత్తం 543 మంది సభ్యులు ఉండగా.. వీరిలో ఎన్డీఏ (NDA) బలం 293 కాగా, ఇండియా (INDIA) కూటమి బలం 234 గా ఉంది. ఓం బిర్లా కూడా సభలో ఒక సభ్యుడిగా ఓటు వేసే అవకాశం ఉంది. అయితే ఓటింగ్ సమానమైనప్పుడు మాత్రమే స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి తన నిర్ణయాత్మక ఓటును వేసేందుకు అవకాశం ఉంది. కానీ అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్నప్పుడు ఆయనకు ఓటు వేసే హక్కు ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో అది చెల్లకుండా పోయే అవకాశం ఉంటుంది.
