Pawan kalyan : రాళ్లదాడి చేస్తారంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.. నోటీసులిచ్చిన కృష్ణాజిల్లా పోలీసులు, ఎస్పీ ఏమన్నారంటే..?

పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడన వారాహి యాత్ర సభలో తనపై రాళ్లదాడి జరుగుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Police Issued Notice to Pawan Kalyan

Notice to Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడన వారాహి యాత్ర సభలో తనపై రాళ్లదాడి జరుగుతుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. పెడనలో వారాహి యాత్రలో వైసీపీ నేతలు రాళ్ల దాడికి ప్లాన్ చేస్తారని తనకు సమాచారం అందింది అంటూ మంగళవారం పవన్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ చేశారు. పవన్ చేసిన ఈ ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే చూపించాలి అంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

దీనిపై కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా మాట్లాడుతూ.. పెడన పోలీసు స్టేషను పరిధిలో తోటమూల సెంటరులో బహిరంగ సభకు అనుమతి కోసం పవన్ కళ్యాణ్ దరఖాస్తు చేసారని.. తన సభలో దాడులు జరుగుతాయని పవన్ కల్యాణ్ ఆరోపించారని తెలిపారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తాము పూర్తి విచారణ చేశామని ఆ ప్రాంతాన్ని పరిశీలించామని.. పవన్ తన కేడర్ కు ఇచ్చిన సందేశం పైనా పూర్తి పరిశీలన చేసామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా..? ఉంటే తమ దృషికి తీసుకురావలని తెలియజేస్తూ ఆయనకు నోటీసు ఇచ్చామని తెలిపారు. అలాంటి అసాంఘిక శక్తులు ఉంటే చర్యలు కచ్చితంగా తీసుకుంటామని తెలిపారు. పవన్ పై దాడి జరుగుతుందని ఆయనకు ఎలా తెలిసింది..? ఎటువంటి సమాచారంతో ఆయన అలాంటి వ్యాఖ్యలు చేసారో తెలిపాలని నోటీసుల్లో పేర్కొన్నామని తెలిపారు. కానీ తమ నోటీసుకు పవన్ నుంచీ రిప్లై రాలేదని వెల్లడించారు.

Also Read : పెడనలో నాపై రాళ్లదాడి చేస్తారని సమాచారం, నాకేం జరిగినా వాళ్లదే బాధ్యత : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ వ్యాఖ్యల్లో నిజం ఉంటే తమకు చెప్పాలని తాము యాక్షన్ తీసుకుంటామని అన్నారు. నోటీసులకు రిప్లై లేదంటే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మేం అనుకోవాలా..? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సభకు పూర్తిస్ధాయి బందోబస్తు ఏర్పాటు చేశామని.. ఇటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు సరైన ఆధారాలు లేకుండా చేయకూడదని సూచించారు. బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయని హెచ్చరించారు. మా సమాచార వ్యవస్ధ మాకుంది.. పవన్ చేసిన వ్యాఖ్యలపై తమకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. నాలుగు రోజులుగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులతో జల్లెడ పడుతున్నామని కానీ అటువంటి అనుమానాస్పద విషయాలేమీ తమ దృష్టికి రాలేదని తెలిపారు. రెచ్చగొట్టే భాష, సైగలు, లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించే అంశాలుగా వాడడం మానుకోవాలని సూచించారు. ప్రముఖ వ్యక్తులు, పోలీసు శాఖ, ఉన్నతాధికారుల మీద వ్యాఖ్యలు చేస్తే మేం రికార్డు చేసి పరిశీలిస్తామని.. ఇలాంటి ఆరోపణలు రాజకీయ పార్టీలు చేయద్దని మనవి చేస్తున్నామని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు