ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీ సైక్లింగ్‌కు చర్యలు చేపడుతున్నాం: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తెలిపారు.

pawan kalyan comments on electronic waste management in andhra pradesh

Pawan Kalyan in Legislative Council: ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సమర్థంగా తొలగించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ- వ్యర్థాల తొలగింపునకు తీసుకున్న చర్యల గురించి గురువారం శాసనమండలిలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ”దేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అధికంగా ఉత్పత్తి చేసే మొదటి 3 రాష్ట్రాల్లో ఏపీ లేదు. ఈ- వ్యర్థాలను సమర్థంగా తొలగింపునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ- వ్యర్థాలను సేకరించి రీ సైక్లింగ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలో పలు చోట్ల రీ సైకిల్ యూనిట్లు నెలకొల్పడం జరిగింది. ప్రైవేటు భాగస్వామ్యంతో రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ ఈ వ్యర్థాల రీ సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామ”ని పవన్ కల్యాణ్ తెలిపారు.

10 రోజుల్లో బకాయిలు చెల్లిస్తాం: మంత్రి మనోహర్
ధాన్యం సేకరణ బకాయిలు 10 రోజుల్లో రైతులకు చెల్లిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరణ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. ”గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించి రూ. 2763 కోట్లు బాకాయిలు పెట్టింది. ధాన్యం సేకరణ పేరిట సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వం రూ.39,550 కోట్ల అప్పులు చేసింది. రుణాలు తెచ్చిన జగన్ ప్రభుత్వం రైతుల బాకాయిలు మాత్రం చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులకు 2 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాం. ధాన్యం సేకరణకు సంబంధించి మిగిలిన 674 కోట్ల బాకాయిలు పదిరోజుల్లో రైతులకు చెల్లిస్తాం. రైతుల బాకాయిలు తీర్చడాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకున్నామ”ని చెప్పారు.

ధరల పెరుగుదల భారం పడకుండా..
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతు బజార్ల ద్వారా నాణ్యమైన కందిపప్పు, బియ్యాన్ని రాయితీపై ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. చౌక దుకాణాల ద్వారా నాణ్యమైన సరకులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 251 స్టాక్ పాయింట్లను తనిఖీలు చేసి నాణ్యత కల్గిన వస్తువులనే ఇవ్వాలని ఆదేశించామని.. నాణ్యత లేకుండా వస్తువులను పంపిణీ చేసిన 19 సంస్థలపై చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

Also Read : నవ్యాంధ్ర క్యాపిటల్ అమరావతి పనులు రయ్ రయ్.. రాజధాని నిర్మాణానికి ఎన్ని రోజులు పడుతుంది?

ఫ్రీ బస్సు పథకంపై అధ్యయనం: మంత్రి మండిపల్లి
మహిళల కు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై అధ్యయనం జరుగుతోందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. ”మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తోన్న పొరుగు రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం హామీని తప్పకుండా అమలు చేస్తాం. ఆర్టీసీని గత వైకాపా సర్కారు నిర్వీర్యం చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీలో 1450 కొత్త బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే ఆర్టీసీలో 350 కొత్త బస్సులను రోడ్డెక్కించాం. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామ”ని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు