యధేచ్చగా దందాలు, వసూళ్లు, సెటిల్‌మెంట్లు..! పోలీస్ అధికారి తీరుపై తీవ్ర విమర్శలు

ఆయనతో వేగలేమంటూ దిగువస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు లిఖిత పూర్తక ఫిర్యాదులు చేస్తున్నారంటే.... ఆయన ఎంతలా సతాయిస్తున్నారో అర్థమవుతోందంటున్నారు.

Gossip Garage : ఆయనో పోలీస్‌ ఉన్నతాధికారి… కీలక జోన్‌లో పోస్టింగ్‌.. గతంలో అక్కడే పనిచేసిన అనుభవం.. ఇక నన్ను ఆపేదెవరు? అంతా నా ఇష్టం అన్నట్లే ఉంటుంది ఆ అధికారి తీరు. డిపార్ట్‌మెంట్‌లో ఆయనే సుప్రీం అన్న రేంజ్‌లో చక్రం తిప్పుతున్నారు. కలెక్షన్‌ కింగ్‌ అవతారమెత్తారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారి… సెక్షన్లు పక్కన పెట్టి సెటిల్‌మెంట్‌ దందా నడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దిగువస్థాయి సిబ్బందిని వేధిస్తూ… బాధితులను నిర్లక్ష్యం చేస్తూ.. ప్రభుత్వం అంటే లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్న ఆ అధికారి తీరు చర్చనీయాంశంగా మారింది…

ఆయనతో వేగలేమంటూ దిగువస్థాయి సిబ్బంది ఫిర్యాదులు..
హైదరాబాద్‌ సిటీ పోలీస్‌శాఖలో కొందరు అధికారుల తీరు విమర్శలకు దారితీస్తోంది. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన పోలీసు అధికారులే… అక్రమార్కులకు… చీకటి వ్యవహారాలకు సహకరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమకు సంబంధం లేని విషయాల్లో తలదూరుస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో జంట నగరాల్లో పలువురు పోలీసు అధికారుల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ కీలక జోన్‌లో ఉన్నతాధికారి వ్యవహరశైలి డిపార్ట్‌మెంట్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఆయనతో వేగలేమంటూ దిగువస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు లిఖిత పూర్తక ఫిర్యాదులు చేస్తున్నారంటే…. ఆయన ఎంతలా సతాయిస్తున్నారో అర్థమవుతోందంటున్నారు.

న్యాయం కావాలంటూ వచ్చేవారికి అన్యాయమే ఎదురవుతోంది..
ఆ ఉన్నతాధికారి తీరుతో న్యాయం కావాలంటూ వచ్చేవారికి అన్యాయమే ఎదురవుతోందంటున్నారు. సదరు అధికారి పనిచేస్తున్న కీలక జోన్‌లో భూముల విలువ ఎక్కువ. నిత్యం ఏదో ప్రాంతంలో ల్యాండ్‌ కబ్జా తగాదాలు చెలరేగుతూనే ఉంటాయి. ఇలాంటి కేసుల్లో బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారి… సెటిల్‌మెంట్లను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. బాధితులు, కబ్జాదారుల మధ్య పంచాయితీ చేస్తూ అందినంత దోచుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇక ఫ్యామిలీ గొడవలను కూడా ఆ అధికారి వదలడం లేదట… భార్యభర్తల తగాదాల్లోనూ డబ్బులే చూస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు.

షాపుల నుంచి మూమూళ్లు వసూలు..
ఇక ఇటీవల నగరంలో హత్యలు, దోపిడీలు వంటి నేరాలు పెరిగిపోయాయి. లా ఆర్డర్‌ అదుపు చేయడానికి నగరంలో రాత్రి పది గంటలు అయ్యేసరికి హోటల్స్‌, రెస్టారెంట్లు క్లోజ్‌ చేయాలని సిటీ పోలీసు శాఖ ఆదేశాలిచ్చింది. కానీ, ఆ అధికారి పర్యవేక్షణలో ఉన్న జోన్‌లో ఈ అదేశాలు అమలు కావడం లేదు. అర్ధరాత్రుల వరకు హోటల్స్‌, రెస్టారెంట్లు తెరచుకుంటూనే ఉన్నాయి. పలు వివాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. ఆయా షాపుల నుంచి ఆ అధికారి మామూళ్లు వసూలు చేస్తుండటం వల్ల ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారంటున్నారు.

అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు..
ఇక ఎవరైనా దిగువస్థాయి అధికారులు షాపులు, రెస్టారెంట్లు మూయించాలని చూస్తే… వాటి జోలికి వెళ్లొద్దంటూ సదరు అధికారి నేరుగా హుకుం జారీ చేస్తున్నారంటున్నారు. అంతేకాకుండా రౌడీ మూకలకు వత్తాసు పలకడం, ఎవరైనా కింద స్థాయి సిబ్బంది తన మాట వినకపోతే… టార్గెట్‌ చేసి వేధించడంతో ఆ జోన్‌లో పని చేయడమంటేనే దిగువస్థాయి సిబ్బంది హడలిపోతున్నారంటున్నారు. ఇటీవల కాలంలో ఆ జోన్‌లో వరుస హత్యలు చోటు చేసుకుంటున్నా.. ఆ అధికారి అస్సలు పట్టించుకోవడం లేదంటున్నారు. ఇన్ని ఆరోపణలు ఉన్న ఆ అధికారికి స్థానికంగా అధికార పార్టీ నేతలతో సత్సంబంధాలు ఉండటం వల్ల ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారంటున్నారు. మొత్తానికి ఆ అధికారి వల్ల సిటీ పోలీసులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Also Read : ఒకే ఒరలో మూడు కత్తులు..! పటాన్‌చెరులో కాంగ్రెస్‌కు కొత్త చిక్కులు

ట్రెండింగ్ వార్తలు