ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర..! అందరికీ న్యాయం చేసేలా చంద్రబాబు సూపర్ ఫార్ములా..!

ఇప్పటికే పదవులపై ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు... కూటమి మధ్య సయోధ్య కుదిరిందనే సమాచారంతో ఎగిరి గంతేస్తున్నారు.

Gossip Garage : ఫార్ములా కుదిరింది.. పదవుల పంపకమే మిగిలింది.. ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది.. ఇక ఎవరికి ఏ పదవి అన్న సస్పెన్సే ఉత్కంఠ రేపుతోంది. నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్‌ పదవులపై క్లారిటీ ఇచ్చిన కూటమి నేతలు.. రాష్ట్ర స్థాయిలో ఏ ఫార్ములాను అమలు చేస్తారు అన్న సస్పెన్స్‌ను అలాగే వదిలేశారు. కూటమిలో కసరత్తు కొలిక్కి రావడంతో ఇక నామినేటెడ్‌ పదవుల జాతరకు తెరలేచినట్లేనా? ఏ పార్టీకి ఎన్ని పదవులు…? ముఖ్యమైన పదవులు ఎవరికి? మూడు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ఏంటి?

మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపై ఫార్ములా..
ఏపీలో నామినేటెడ్‌ పదవుల భర్తీపై కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 45 రోజులు కావస్తున్నా… ఇప్పటివరకు నామినేటెడ్‌ పోస్టులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో నియమితులైన కొందరు ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారు. రెండు రోజుల క్రితమే టీటీడీ బోర్డును రద్దు చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్‌ పోస్టులు, ఆలయాలు, ట్రస్టు బోర్డు పాలకవర్గాలపై దృష్టి పెట్టింది. మరోవైపు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులపైనా ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే మూడు పార్టీల మధ్య పదవుల పంపకంపైనా ఓ ఫార్ములా తయారు చేసింది.

అందరికీ న్యాయం జరిగేలా ఫార్ములా తయారీ..
ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు… నామినేటెడ్‌ పదవులపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో జనసేన, బీజేపీ నేతలు నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్నారు. కూటమి గెలుపుతో మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేయడంతో అందరికీ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. అందరికీ న్యాయం జరిగేలా ఓ ఫార్ములాను తయారు చేశారు. దీనిప్రకారం కూటమికి 164 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నియోజకవర్గాన్ని ఓ యూనిట్‌గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల 60 శాతం పదవులు పసుపు దళానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారట… మిగిలిన 40 శాతంలో జనసేన నేతలకు 30 శాతం… బీజేపీకి 10 శాతం పదవులు కట్టబెడతారని అంటున్నారు.

అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60 శాతం జనసేన, 30 శాతం టీడీపీ, 10 శాతం బీజేపీ నేతలకు పదవులివ్వాలని నిర్ణయించారని సమాచారం. ఇదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 50 శాతం.. మిగిలిన 50 శాతం పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరిసగం పంచుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మూడు పార్టీలకు అవకాశం ఉండేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబుకు విన్నపం..
నియోజకవర్గ స్థాయిలో పదవుల పంపకంపై క్లారిటీ రావడంతో నేతలు, కార్యకర్తల్లో సందడి మొదలైంది. రాష్ట్రస్థాయిలో కుదిరిన ఫార్ములాతో మూడు పార్టీల్లో కార్యకర్తలు అందరికీ సమ ప్రాధాన్యం దక్కినట్లేనన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందే జనసేన నేత, రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్‌ నామినేటెడ్‌ పదవుల్లో మూడు పార్టీలకు అవకాశం ఉండేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. మనోహర్‌ విజ్ఞప్తి మేరకు స్పందించిన సీఎం చంద్రబాబు… అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే… పదవుల పంపకంపై క్లారిటీ ఇచ్చేశారు.

పదేళ్లుగా అధికారం రుచిచూడని జనసేన కార్యకర్తలు..
అసెంబ్లీ ముగియగానే జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల భర్తీపై నిర్ణయం తీసుకోవచ్చనంటున్నారు. ఇప్పటికే పదవులపై ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు… కూటమి మధ్య సయోధ్య కుదిరిందనే సమాచారంతో ఎగిరి గంతేస్తున్నారు. ఇక జనసేనలోనూ జోష్‌ కనిపిస్తోంది. పార్టీ ఏర్పాటై పదేళ్లు అయినా… ఇప్పటివరకు అధికారం రుచిచూడలేదు జనసేన. ఇప్పుడు కూటమిలో కీలక భాగస్వామిగా ఉండటం… రాష్ట్రవ్యాప్తంగా పదవుల్లో వాటా దక్కుతుండటంతో ఆ పార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా పది శాతం వాటాతో బీజేపీలో హ్యాపీ!
మరోవైపు బీజేపీ శ్రేణులు కూటమి ఫార్ములాను స్వాగతిస్తున్నాయి. తమ ఎమ్మెల్యేలు ఉన్నచోట సగం పోస్టులు లభించినా… రాష్ట్రవ్యాప్తంగా పది శాతం పదవులు లభిస్తుండటం కమలం పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. ఇక అసెంబ్లీ ముగియగానే మూడు పార్టీల్లో కీలకంగా పని చేసిన నేతలు అందరికీ ఏదో పదవి వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాష్ట్రస్థాయిలోనూ కొన్ని నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ముగియగానే రాష్ట్రస్థాయిలో 25 నామినేటెడ్‌ పదవులను భర్తీ చేస్తారంటున్నారు. ఈ పోస్టులు ఎవరికి దక్కుతాయనే ఉత్కంఠ మూడు పార్టీల్లో కనిపిస్తోంది.

ఆలయాలకు పాలకవర్గాలు.. ఏ ప్రాతిపదికన భర్తీ చేస్తారు?
ఈ పోస్టులతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన టీటీడీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాలకు పాలకవర్గాలను నియమించాల్సి వుంది. ఈ పదవులను ఏ ప్రాతిపదికన భర్తీ చేస్తారు? టీడీపీతోపాటు జనసేన, బీజేపీ నేతలకు ఏ మేర అవకాశం కల్పిస్తారనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఏదైనాసరే ఈ నెలఖరులోగా కొన్ని పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉందనే సమాచారం కార్యకర్తలు, నేతల్లో జోష్‌ పెంచుతోంది.

Also Read : షర్మిలతో రాజీపడతారా, బీజేపీని ఎదిరించి ఇండియా కూటమితో జతకడతారా.. వైఎస్ జగన్ దారెటు?

ట్రెండింగ్ వార్తలు