మాస్క్ అడిగితే డాక్టర్‌ను చంపేశారు, షర్మిలపైనా కేసులు పెట్టారు- జగన్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రముఖ నేతలందరిపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. షర్మిలపైనా కేసులు పెట్టారు. మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ ను చంపారు.

Cm Chandrababu : గత ప్రభుత్వం ఏపీలో ప్రముఖ నేతలపై పెట్టిన కేసుల వివరాలను సభలో ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు. మొత్తం కేసులు, ఎన్ని రోజులు జైల్లో ఉన్నారనే వివరాలతో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టాప్-3లో జేసీ ప్రభాకర్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, పులివర్తి నాని నిలిచారు. సభలో ఉన్న వారిలో కేసులు ఉన్న వాళ్లు నిల్చొవాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ సహా మెజార్టీ ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. కేసులు ఎవరి మీద లేవో వాళ్లూ ఓసారి నిల్చొవాలని చంద్రబాబు కోరారు.

”తోట చంద్రయ్య అనే కార్యకర్తను దారుణంగా చంపేశారు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తున్న మాజీ సీఎం జగన్.. తన హయాంలో శాంతి భద్రతల మీద ఒక్క రోజైనా సమీక్షించారా..? ప్రముఖ నేతలందరిపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టారు. షర్మిలపైనా కేసులు పెట్టారు. మాస్క్ అడిగితే డాక్టర్ సుధాకర్ ను చంపారు. 4 వేల మంది సీపీఎస్ ఉద్యోగులపై కేసులు పెట్టారు. సీపీఎస్ ఉద్యోగులపై ఉన్న కేసుల ఎత్తివేత మీద సమీక్ష జరుపుతాం. చదువులు చెప్పే టీచర్లపైనా కేసులు పెట్టారు. న్యాయమూర్తుల మీద అసభ్యకర పోస్టులు పెట్టారు. జడ్జిల మీద పోస్టింగ్ లు పెడితే పోలీసులూ నిమ్మకుండిపోయారు. సీబీఐ కేసు టేకప్ చేయాల్సి వచ్చింది. మీడియా మీద, మీడియా యాజమాన్యాల మీద కూడా కేసులు పెట్టారు” అని సీఎం చంద్రబాబు అన్నారు.

”నాకు జరిగిన అవమానం నన్ను వెంటాడుతోంది. నా జీవితంలో తొలిసారిగా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఒక్కటే ఒకటి ఉంది. అది అసెంబ్లీలో నాకు జరిగిన అన్యాయం. నా జీవితం గుర్తుకు ఉంటుంది. నన్ను చంపుతారని తెలిసినా, బ్లాస్ట్ జరిగినా బాధ్యతతో ప్రవర్తించాను తప్ప అధైర్య పడలేదు. నా కళ్లలో ఒక్క చుక్క కన్నీళ్లు రాలేదు” అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read : నవ్యాంధ్ర క్యాపిటల్ అమరావతి పనులు రయ్ రయ్.. రాజధాని నిర్మాణానికి ఎన్ని రోజులు పడుతుంది?

ట్రెండింగ్ వార్తలు