Ys Jagan: సూపర్ హిట్ కాదు సూపర్ ప్లాప్ సినిమా.. బడ్జెట్లో అన్నీ అబద్దాలు, తప్పుడు లెక్కలే- జగన్
మ్యానిఫెస్టో పదానికి నిజమైన అర్థం వైసీపీ హయాంలో చూపించాం. చంద్రబాబు దృష్టిలో మాత్రం మ్యానిఫెస్టో అనేది చిత్తు కాగితమే అని రుజువు చేశారు.
Chandrababu Naidu Ys Jagan Representative Image (Image Credit To Original Source)
- అప్పులు చెయ్యడంలో చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నారు
- అప్పులు చెయ్యడం జేబుల్లోకి వేసేసుకోవడం ఇదే జరుగుతోంది
- మోసానికి షర్ట్ ప్యాంట్ వేస్తే చంద్రబాబు అవుతారు
Ys Jagan: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాజీ సీఎం జగన్ తీవ్రంగా స్పందించారు. బడ్జెట్ లో చూపించినవన్నీ తప్పుడు లెక్కలు, మోసాలు అని ధ్వజమెత్తారు. ఇప్పటివరకు మూడు బడ్జెట్ లు ప్రవేశపెట్టినా ప్రజలకు చేసిన మంచి ఏదీ లేదన్నారు. అంతా మోసమే కనిపిస్తుందన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో హామీలను బడ్జెట్ లో గాలికొదిలేశారని జగన్ మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది అని విరుచుకుపడ్డారు.
సూపర్ సిక్స్ అమలు కాకపోయినా సూపర్ హిట్ అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు జగన్. మోసానికి షర్ట్ ప్యాంట్ వేస్తే చంద్రబాబు అవుతారు, అపార్థాలకు రెక్కలు కడితే అవి ఆయన మాటలు అవుతాయి అని జగన్ అభివర్శించారు. బడ్జెట్ మొత్తం అంకెల గారడీ అని విమర్శించారు.
”రాష్ట్ర అప్పులపై బడ్జెట్ లో తప్పుడు లెక్కలు చెబుతున్నారు. రాష్ట్ర విభజన నాటికి 1.47 లక్షల కోట్ల అప్పు ఉంది. 2014-19 చంద్రబాబు హయాంలో 2.49 లక్షల కోట్లు అప్పులు చేశారు. 2019-24 వైసీపీ హయాంలో 3.31 లక్షల కోట్లు అప్పులు చేశాం. మా హయాంలో 9 లక్షల కోట్లు అప్పులు చేశామని పచ్చి అబద్దాలు చెబుతున్నారు. చంద్రబాబు ఈ రెండేళ్లలోనే 3.17 లక్షల కోట్లు అప్పులు చేశారు. చేస్తున్న అధిక అప్పులు చాలవన్నట్టు పబ్లిక్ అకౌంట్స్ లోని డబ్బులు కూడా వాడేస్తున్నారు.
అప్పులు చెయ్యడంలో చంద్రబాబు ఆల్ టైమ్ రికార్డ్స్ బద్దలు కొడుతున్నారు. చేసిన అప్పులతో ఎక్కడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చెయ్యడం లేదు. రెండేళ్లుగా అప్పులు చెయ్యడం జేబుల్లోకి వేసేసుకోవడం ఇదే జరుగుతోంది. మ్యానిఫెస్టో పదానికి నిజమైన అర్థం వైసీపీ హయాంలో చూపించాం. చంద్రబాబు దృష్టిలో మాత్రం మ్యానిఫెస్టో అనేది చిత్తు కాగితమే అని రుజువు చేశారు.
చంద్రబాబు, పవన్ లు బాండ్ లు ఇచ్చి హామీలు అమలు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. మరి రెండేళ్లవుతోంది హామీలు ఎక్కడ అమలు చేశారు..? ఇచ్చిన ప్రధాన హామీలకు బడ్జెట్ లో అతీగతి లేదు. బడ్జెట్ లో నిరుద్యోగ భృతి పథకం ప్రస్తావన లేదు. స్త్రీశక్తి అని అమ్మవారి పేరు పెట్టి మహిళలను మోసం చేశారు. ఆడబిడ్డ నిధి ప్రస్తావన లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 50 ఏళ్లకే పింఛన్ ఊసే లేదు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ సూపర్ ప్లాప్ సినిమా చూపిస్తున్నారు” అని విరుచుకుపడ్డారు జగన్.
క్రికెట్ అభిమానం ఉంటే టీవీలో చూస్తే సరిపోదా..? లోకేశ్ పై జగన్ విమర్శలు
”కాగ్ లెక్కల ప్రకారం సొంత ఆదాయ వృద్ధి రేటులో ఏపీ 22వ స్థానంలో ఉంది. చంద్రబాబు అసమర్థత కారణంగా రాష్ట్రం ఈ స్థాయికి దిగజారిపోయింది. వాస్తవాలు ఇలా ఉంటే బడ్జెట్ లెక్కల్లో మాత్రం వృద్ధి రేటులో దూసుకుపోతున్నామని చెబుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు, రాష్ట్ర ఖజానాకు వెళ్లడం లేదు. చంద్రబాబు అండ్ కో జేబుల్లోకి వెళ్తున్నాయి. రాష్ట్రంలో వనరులను దోచేస్తున్నారు, అందుకే రాష్ట్రానికి ఆదాయం రావడం లేదు.
ఒక పక్క రాష్ట్రంలో ఆదాయం లేదు. మరోపక్క చంద్రబాబు పవన్ లోకేశ్ దుబారా ఖర్చులు చేస్తున్నారు. ముగ్గురికి మూడు విమానాలు, మూడు హెలికాప్టర్లు. నిత్యం గాల్లోనే తిరుగుతున్నారు. ఉదయం ఒక రాష్ట్రం, మధ్యాహ్నం ఒక రాష్ట్రం, సాయంత్రం వేరొక దేశంలో కనిపిస్తున్నారు. కొలంబోలో క్రికెట్ ఆడుతుంటే లోకేశ్ కి ఏం పని..? బాధ్యత గల పదవుల్లో ఉన్న వ్యక్తులు జల్సాలకు దేశాలు పట్టి తిరగడమేంటి..? క్రికెట్ అభిమానం ఉంటే టీవీలో చూస్తే సరిపోదా..? నేను మొన్నటి మ్యాచ్ ను టీవీలోనే చూశా” అని జగన్ విమర్శించారు.
Also Read: ఏపీలోని నిరుద్యోగులకు ఎగిరిగంతేసే న్యూస్.. మరో డీఎస్సీకి సిద్ధమైన సర్కార్.. ఈసారి ఎన్ని పోస్టులంటే?
