Pulivendula Municipality : హైకోర్టులో వైసీపీకి బిగ్ షాక్.. పులివెందుల కౌంటింగ్‌కు లైన్ క్లియర్
Pulivendula Municipality : వైసీపీ నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పులివెందుల మున్సిపాలిటీలో కౌంటింగ్ ప్రక్రియకు లైన్ క్లియర్ అయింది.
Pulivendula Municipality
Pulivendula Elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నియోజకవర్గం అయిన పులివెందుల మున్సిపాలిటీలో నాలుగు వార్డుల్లోనే కాకుండా.. అన్ని వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని కోరుతూ, అప్పటి వరకు కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి వైఎస్ ప్రమీళ, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిలు హైకోర్టులో వేరువేరు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, సోమవారం ఈ పిటీషన్లపై వాదనలు ముగియగా.. ఇవాళ ఉదయం 7.30 గంటలకు దీనిపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. కిరణ్మయి తీర్పును వెల్లడించారు. వైసీపీ నేతలు వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పులివెందుల మున్సిపాలిటీలో కౌంటింగ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో భాగంగానే ప్రస్తుతం పులివెందులలోనూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.
పులివెందుల మున్సిపాలిటీలో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అదనపు పోలీసు భద్రత కల్పించాలని, అన్ని వార్డుల్లో రీ పోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సోమవారం జరిగిన విచారణలో వారి తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. అధికార పార్టీ వారు పోలింగ్ బూత్ లను ఆక్రమించి రిగ్గింగ్ కు పాల్పడ్డారని, సీసీటీవీ పుటేజ్, తదితర ఆధారాలను పరిగణలోకి తీసుకొని పులివెందుల మున్సిపాలిటీలో మిగిలిన వార్డుల్లోనూ రీపోలింగ్ కు ఆదేశించాలని కోరారు. అంతేకాక మంగళవారం నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను పులివెందులలో నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
మరోవైపు.. ఎస్ఈసీ తరపున న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు. పోలింగ్ ముగిశాక కలెక్టర్, ఎస్పీల నుంచి ఎస్ఈసీ నివేదిక తెప్పించుకుంది. అభ్యర్థుల ఫిర్యాదులనూ పరిశీలించడం జరిగింది.. అన్నింటినీ పరిగణలోకి తీసుకొని పులివెందులలో నాలుగు వార్డులకు రీ పోలింగ్ నిర్వహించింది. ఈ నేపథ్యంలో అన్నిచోట్లా రీపోలింగ్ నిర్వహించడం, ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిలిపివేయడం వంటి చర్యలు అవసరం లేదని కోర్టుకు విన్నవించారు. ఇరువాదనలు విన్న కోర్టు మంగళవారం ఉదయంకు తీర్పును వాయిదా వేసింది. అయితే, ఇవాళ ఉదయం హైకోర్టు తీర్పును ప్రకటించింది. వైసీపీ నేతల పిటిషన్లను కొట్టివేస్తూ.. పులివెందులలో అన్ని వార్డుల్లో రీ కౌంటింగ్ అవసరం లేదని, కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించవచ్చునని హైకోర్టు స్పష్టం చేసింది.
