Raghu Rama Krishna Raju: టీడీపీ కంచుకోటలో తమ్ముళ్ల ధిక్కారం.. ఉండిలో అసలేం జరుగుతోంది? రాజుగారిపై ఆరోపణల్లో నిజమెంత?
ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామ కృష్ణరాజుకు సొంత నియోజకవర్గంలో లీడర్ల నుంచి అసంతృప్తి సెగ తగలడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో ప్రముఖ నేతగా ఉన్న ఆయనపై సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగరవేయడం కలకలం రేపుతోంది.
Raghu Rama Krishna Raju Representative Image (Image Credit To Original Source)
- రఘురామ కృష్ణరాజు తీరుపై టీడీపీ నేతల విమర్శలు
- టీడీపీ సీనియర్ లీడర్లను రఘురామ పట్టించుకోవట్లేదా?
- ఉండి టీడీపీలో పరిణామాలపై పార్టీ అధిష్టానం ఆరా?
Raghu Rama Krishna Raju: అది టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. గత ఎన్నికలకు ముందు టీడీపీ టికెట్ కేటాయింపు రచ్చతో.. ఆ సెగ్మెంట్ టూ తెలుగు స్టేట్స్లో హాట్ టాపిక్ అయ్యింది. ఎట్టకేలకు గత ఎన్నికల్లో అక్కడి నుంచి టికెట్ దక్కించుకుని రాజుగారు గెలిచారు. శాసనసభ ఉపసభాపతి కూడా అయ్యారు. కట్ చేస్తే ఇప్పుడాయనపై తెలుగు తమ్ముళ్లు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఆయన ఒంటెద్దు పోకడలు భరించలేమంటూ అసంతృప్తి రాగం వినిపిస్తున్నారు. అసలు ఉండి టీడీపీలో ఏం జరుగుతోంది? రాజుగారితో లోకల్ లీడర్లకు ఎందుకు పొసగడం లేదు?
ఏపీలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్, వైసీపీ గాలిలోనూ గెలిచిన సీట్లు ఉన్నాయి. అలాంటి నియోజకవర్గాల్లో ఉండి కూడా ఒకటి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోకవర్గంలో టీడీపీ వరుస విజయాలు దక్కించుకోవడమే కాదు. 2004లో తప్ప..ఎప్పుడూ అక్కడ పార్టీ ఓడింది లేదు. క్షత్రియులకు బలమైన సెగ్మెంట్‌గా ఉన్న ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ సైకిల్‌దే హవా. పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ పాగా వేసేందుకు వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. గత ఎన్నికల్లో అభ్యర్థిని మార్చి లాస్ట్ మూమెంట్లో వైసీపీ నుంచి వచ్చిన రఘురామ కృష్ణరాజుకు టీడీపీ సీటు ఇచ్చినా..ప్రజలు సైకిల్ పార్టీకే పట్టం కట్టారు.
అలాంటి నియోజకవర్గంలో టీడీపీ నేతల ధిక్కార స్వరం చర్చనీయాంశంగా మారింది. ఏకంగా రఘురామ కృష్ణరాజు తీరుపై విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఎమ్మెల్యే కమ్..ఉప సభాపతిగా ఉన్న రఘురామ కృష్ణరాజు వైఖరిని తప్పుబడుతూ..ఒకరిద్దరు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ఆయన ఒంటెత్తు పోకడలకు పోతున్నారని..రఘురామ తీరుతో పార్టీలో ఐక్యత దెబ్బతింటోందని కొందరు లీడర్లు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూ చర్చకు దారితీశారు.
రఘురామ ముందు నుంచి టీడీపీలో పనిచేసిన నేత కాకపోవడంతో ఇక్కడ తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి రాగం ఎత్తుకున్నట్లు చర్చ జరుగుతోంది. వాస్తవానికి గతంలో ఎప్పుడూ టీడీపీలో పని చేయలేదు రఘురామ కృష్ణరాజు. బిజినెస్‌మెన్‌గా వెరీ పాపులర్. ఆ తర్వాత వైసీపీలో, బీజేపీలో తిరిగి వైసీపీలో పనిచేసి 2019లో ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కొన్నాళ్లకే వైసీపీ అధిష్టానంతో గిట్టక అసంతృప్తి రాగం వినిపిస్తూ వచ్చారు. జగన్ సర్కార్ హయాంలో ఆయన కేసులు కూడా ఫేస్ చేశారు. ఆ తర్వాత టీడీపీకి దగ్గరవుతూ వచ్చారు. ఫైనల్‌గా 2024కు ముందు రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరారు. నరసాపురం ఎంపీ టిక్కెట్ ఆశించినా కూటమి పొత్తులో అది బీజేపీకి ఇచ్చారు. దీంతో ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని..టీడీపీ రఘురామ కృష్ణరాజుకు టికెట్ ఇచ్చింది.
వైసీపీలో పని చేసిన నేతలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు..
అయితే వైసీపీ నుంచి వచ్చిన రఘురామ కృష్ణ తన అనుచరులను..గతంలో వైసీపీలో పనిచేసిన నేతలను ప్రోత్సహిస్తూ వారికే పదవులు కట్టబెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి నామినేటెడ్ పదవులు కట్టబెడుతూ, పార్టీ కమిటీల్లోనూ ఇతర పార్టీల నేతలకు అవకాశాలు ఇస్తున్నారని..సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదని..టీడీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పొత్తూరి వెంకటేశ్వరరాజు అలిగేషన్స్ చేస్తున్నారు. రఘురామను వ్యతిరేకిస్తే భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కొడుకు రాజకీయ అరంగేట్రం కోసం రఘురామ కృష్ణరాజు ఇప్పటినుంచే తన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారని కూడా చెప్తున్నారు. దీంతో ఉండి టీడీపీలో పరిణామాలపై అధిష్టానం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
అయితే ఏ పార్టీలో అయినా ఏ నియోజకవర్గంలో అయినా కొత్త, పాత లొల్లి కామన్. పార్టీ అన్నాక సమస్యలు..పదవుల దగ్గర పేచీ కూడా ఉండనే ఉంటుంది. సీనియర్ లీడర్ల అసంతృప్తి కూడా ఉండనే ఉంటుంది. వాటిన్నింటిని సామరస్యంగా పరిష్కరించుకుంటే నో ప్రాబ్లమ్. పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను సాల్వ్ చేసుకోవచ్చు. కానీ కొందరు నేతలు..బహిరంగ విమర్శలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇలా తెలుగు తమ్ముళ్లు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తే ప్రత్యర్థులకు అస్త్రాలు అందించినట్లు అవుతుందని అంటున్నారు.
పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు, నాయకులకు అన్యాయం?
అయితే అటు ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామ కృష్ణరాజుకు సొంత నియోజకవర్గంలో లీడర్ల నుంచి అసంతృప్తి సెగ తగలడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో ప్రముఖ నేతగా ఉన్న ఆయనపై సొంత పార్టీ నేతలే తిరుగుబావుటా ఎగరవేయడం కలకలం రేపుతోంది. రఘురామ తీరుతో టీడీపీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు, నాయకులు ఆగమైపోతున్నారని, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ కలగజేసుకోవాలని కోరుతున్నారు స్థానిక నేతలు.
అయితే ఉండి నియోజకవర్గంలో ఎప్పుడూ లేనట్లుగా విభేదాలు రచ్చకెక్కడం..తొలిసారి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి? రఘురామ ఒంటెద్దు పోకడలకు పోతున్నారా? లేక ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చిన రఘురామకు టీడీపీ క్యాడర్, లీడర్లతో సరైన సంబంధాలు లేవా? లేక టీడీపీ నేతలకే రఘురామ అంటే గిట్టట్లేదా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఉండి నియోజకవర్గంలో పరిస్థితులపై పార్టీ హైకమాండ్ కూడా ఆరా తీసిందన్న వార్తలు కూడా ఆసక్తికరంగా మారాయి. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఎంపీగా ఉంటూ నిత్యం అసమ్మతి రాగం వినిపించిన రఘురామ ఇప్పుడు అదే పరిస్థితిని ఫేస్ చేస్తుండటం ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది.
Also Read: సూపర్ హిట్ కాదు సూపర్ ప్లాప్.. బడ్జెట్ లో అన్నీ అబద్దాలు, మోసాలే..!- జగన్
