Batsman Forgets Pads: క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్న సమయంలో అనేక ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి గాల్లోకి ఎగిరిన సమయంలో క్యాచ్ పట్టేందుకు ఇద్దరు ఫీల్డర్లు వచ్చి అలా నిలబడిపోతుంటారు. మరోసారి సెంచరీ కొట్టిన బ్యాట్స్‌మెన్, వరుస వికెట్లు తీసిన సమయంలో బౌలర్ చేసే విచిత్ర విన్యాసాలు వీక్షకులకు నవ్వులు తెప్పిస్తుంటాయి. తాజాగా ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాట్స్‌మెన్ కాళ్లకు ప్యాడ్లు లేకుండానే మైదానంలోకి వచ్చి బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. తోటి క్రికెటర్లు, అంపైర్ గుర్తుచేయడంతో అయ్యయ్యో.. ప్యాడ్లు మర్చిపోయానా అనుకుంటూ మళ్లీ పెవిలియన్ బాటపట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇంగ్లాండ్ లో విలేజ్ క్రికెట్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో.. ఓ బ్యాట్స్‌మెన్ ఔటయ్యాడు. వెంటనే సౌత్హెండ్ సివిక్ క్రికెట్ క్లబ్‌కు చెందిన మార్టిన్ హ్యూస్ క్రిజ్ లోకి వచ్చాడు. అయితే అతను కాళ్లకు ప్యాడ్లు కట్టుకోకుండా బ్యాటింగ్ చేసేందుకు రావటం వీడియోలో కనిపిస్తుంది. కాళ్లకు ఎలాంటి రక్షణ కవచాలు ధరించకుండానే మార్టిన్ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. దీంతో కీపర్.. నువ్వు ఫ్యాడ్లు ఎందుకు కట్టుకోలేదని గుర్తు చేయడంతో.. నువ్వు నన్ను తప్పుదారి పట్టించలేవు అని అనడం వినిపిస్తుంది. హే.. నేను సీరియస్ గా చెబుతున్నా అని కీపర్ చెప్పడంతో .. తన కాళ్లవంక చూసుకున్న బ్యాట్స్ మెన్.. అయ్యయ్యో ప్యాడ్లు మర్చిపోయానా అనుకుంటూ మళ్లీ డ్రసింగ్ రూం వైపు పరుగు పెట్టడం వీడియోలో కనిపిస్తుంది.
— That’s so Village (@ThatsSoVillage) July 20, 2022
ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసి అనేకమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ మాత్రం.. “నేను బౌలర్‌ని అయితే, ఎవరైనా అతనితో ప్రస్తావించినట్లయితే నేను కోపంగా ఉండేవాడిని.. మొదటి బంతి ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు” అంటూ కామెంట్ చేశారు. పలువురు నెటిజన్లు.. క్రికెట్ ఆడే క్రమంలో తమ అనుభవాలను గుర్తుచేసుకుంటూ కామెంట్లు చేశారు.