ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మ? 175 సీట్లు కన్‌ఫర్మ్- మంత్రి బొత్స

ఎన్నో ఎన్నికలు చూశాను. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. మేం చాలా క్లారిటీగా ఉన్నాం.. 175 సీట్లు వస్తాయి.

Botcha Satyanarayana : ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ పై ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు మంత్రి బొత్స. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చెప్పడానికి ప్రశాంత్ కిశోర్ ఏమైనా బ్రహ్మ? అని మంత్రి బొత్స ప్రశ్నించారు. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అని విమర్శించారు.

”ప్రశాంత్ కిషోర్ గిమ్మిక్కులు చేస్తారు. వన్ టైం వ్యవహరం అనుకున్నాం. తర్వాత వదిలేశాం. ప్రస్తుతానికి ఐ-ప్యాక్ నిర్మాణాత్మకంగానే ఉందని అనుకుంటున్నాం. ప్రశాంత్ కిషోర్ అయినా, ఐ-ప్యాక్ అయినా తాత్కాలికం. వైసీపీ శాశ్వతం. కో-ఆర్డినేషన్ కోసం ఐ-ప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నాం. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయి. నిర్ణయం తీసుకోవాల్సింది మేమే. ఐ-ప్యాక్ చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవం. ఐ-ప్యాక్ ఓ జాబితా ఇస్తుంది. అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుంది” అని మంత్రి బొత్స తెలిపారు.

”మేం చాలా క్లారిటీగా ఉన్నాం.. 175 సీట్లు వస్తాయి. మేం మేలు చేస్తేనే ఓటేయండని అడిగిన జగన్.. దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించారు. జగన్ అడిగిన విధంగా మోడీ కూడా ధైర్యంగా ఓట్లడగలేకపోతున్నారు. నా పరిపాలన చూసి ఓటేయండని ప్రధాని కూడా అడగలేకపోయారు. దేశానికి మేలు చేశానని.. ఓటేయ్యండి అని మోడీ కూడా అడగడం లేదు. రామాలయ నిర్మాణం, సీతమ్మ భూమి, ముస్లిం రిజర్వేషన్లు వంటి వాటిని ప్రస్తావిస్తూ ప్రధాని ఓట్లు అడుగుతున్నారు.

ఎన్నికలయ్యాయి.. ఫలితాలు రావాల్సి ఉంది. ఎవరి ధీమా వారికుంది. మేం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. ప్రతిపక్షంలో కూడా వారు చెప్పాల్సింది చెబుతున్నారు. ఎన్నో ఎన్నికలు చూశాను. కానీ, ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడ లేదు. ఇప్పుడు ప్రధాన రాజకీయ నేతలంతా విదేశాల్లో ఉన్నారు. జగన్ విదేశీ పర్యటన మీద రకరకాల విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ కూడా విదేశాలకు వెళ్లిపోయారు. ముఖ్య నేతలు విదేశాల్లో ఉన్నారు. ఇంకొందరు ప్రయాణాల్లో ఉన్నారు. ఇక్కడున్న వారు ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారు..? కొంత గ్యాప్ ఇవ్వండి. ఇప్పుడెందుకు హర్రీ అండ్ వర్రీ?

చంద్రబాబు ఎక్కడికెళ్లారో ఎందుకు చెప్పడం లేదు..? చెప్పాల్సిన అవసరం లేదంటే ఓకే. అటువంటప్పుడు జగన్ పర్యటనల మీద ఎందుకింత చర్చ..? విద్య వైద్యంలో మాపై ఇంకా ఆరోపణలు చేస్తున్నారు. కూటమి మేనిఫెస్టోలో విద్యా రంగంపై హామీలు ఎందుకివ్వలేదు..? ఇప్పుడు 1-10 తరగతుల్లో 39,61,198 మంది విద్యార్థులున్నారు. వైసీపీ హయాంలో విద్యా విధానం దేదీప్యమానంగా వెలిగింది. విద్యార్థుల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా విధానం మెరుగయ్యేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు” అని విమర్శించారు మంత్రి బొత్స.

Also Read : చంద్రబాబు ఎక్కడికి వెళ్లారు? ఏమైపోయారు? రాష్ట్ర ప్రజలకు తెలియాలి- మంత్రి జోగి రమేశ్

ట్రెండింగ్ వార్తలు