బెల్ 212 హెలికాప్టర్.. ఇందులో భద్రత కరువేనా? ఇప్పటివరకు ఎన్ని ప్రమాదాలు జరిగాయి?

గతంలో ఇరాన్ రక్షణ, రవాణ శాఖ మంత్రులతో పాటు పలువురు కమాండర్లు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ఘటనలు చాలానే ఉన్నాయి.

Bell 212 Helicopter : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రాణాలు కోల్పోయింది బెల్ 212 హెలికాప్టర్ లోనే. దీన్ని అమెరికాకు చెందిన బెల్ టెక్స్ ట్రాన్ కంపెనీ తయారు చేసింది. టెక్సాస్ లోని ఫోర్ట్ వర్త్ కేంద్రంగా ఈ కంపెనీ పని చేస్తోంది. బెల్ 212లో సిబ్బంది సహా 15మంది ప్రయాణించవచ్చు. ఈ హెలికాప్టర్ ను పౌర, వాణిజ్య, సైనిక అవసరాలకు వినియోగించుకునేలా రూపొందించారు. దీన్ని బెల్ 205కు కొనసాగింపుగా 1960లో ప్రవేశపెట్టారు. బెల్ టెక్స్ ట్రాన్ తయారు చేసే కీలక మోడల్స్ లో బెల్ 212 ఒకటి. ఈ హెలికాప్టర్లు ఘోర ప్రమాదాలకు గురైన సందర్భాలూ ఉన్నాయి.

లూసియానా, కెనడాలో కుప్పకూలిన బెల్ 212..
1997లో పెట్రోలియం హెలికాప్టర్ కు చెందిన బెల్ 212 లూసియానా తీరంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8మంది చనిపోయారు. సాధారణ, ఆఫ్ షోర్ రవాణ కార్యక్రమాలు చేపడుతూ ఉండగా.. మెకానికల్ సమస్యలు తలెత్తి ప్రమాదం జరిగింది. ఇక 2009లో కెనడాలోని న్యూ ఫార్మ్ ల్యాండ్ లో జరిగిన ప్రమాదంలో 17 మంది చనిపోయారు. ఇంజిన్ లో ఆయిల్ ప్రెజర్ కోల్పోయిన కారణంగా ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. కెనడా చరిత్రలో అతిపెద్ద హెలికాప్టర్ ప్రమాదంగా నిలిచిపోయింది. ఆధునిక హెలికాప్టర్లలో అనేక భద్రతా ఫీచర్లు వస్తున్నాయి. వాటన్నింటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రయాణికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ మెకానికల్ లోపాలు, ప్రతికూల వాతావరణం, మానవ తప్పిదాల కారణంగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి శత్రువుల దాడిలోనూ కుప్పకూలుతూ ఉంటాయి.

ప్రమాదాలకు అమెరికా ఆంక్షలు కూడా కారణమే..
ఇలా.. హెలికాప్టర్ ప్రమాదాలు కారణాలు అనేకం ఉంటాయి. ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ఇరాన్ వాయు రవాణ భద్రత చరిత్ర చాలా పేలవంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. దీనికి అమెరికా ఆంక్షలు కొంతవరకు కారణం అని నిపుణులు చెబుతున్నారు. రైసీ ప్రయాణించిన తాజా హెలికాప్టర్ ను 1979లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తర్వాత ఇరాన్ కు అమెరికా విక్రయాలు నిలిపివేసినట్లు తెలుస్తోంది.

స్పేర్ పార్ట్స్ దొరకవు..
గతంలో ఇరాన్ రక్షణ, రవాణ శాఖ మంత్రులతో పాటు పలువురు కమాండర్లు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ఘటనలు చాలానే ఉన్నాయి. షా పాలన సమయంలో ఇరాన్ లో బెల్ 212 హెలికాప్టర్లు ప్రవేశపెట్టారు. 1976లో దీన్ని కమర్షియల్ వాడకం కోసం తీసుకున్నారు. అమెరికా మిలటరీలోనూ ఈ హెలికాప్టర్ వాడినట్లు తెలుస్తోంది. 1960 నుంచి వాడకంలో ఉన్న ఆ హెలికాప్టర్ కు ప్రస్తుతం స్పేర్ పార్ట్స్ దొరకవని మిలిటరీ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read : ఎవరు పెద్దన్న.. ప్రపంచంపై అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించడమే రష్యా, చైనా ఉమ్మడి లక్ష్యం!

ట్రెండింగ్ వార్తలు