Record Prices : వామ్మో.. సిలిండర్‌ ధర రూ.2వేల 657, కిలో పాలు రూ. 1,195.. భారీగా పెరిగిన ధరలు

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2వేల 657. కేజీ పాల ధర రూ.1,195. ఏంటి షాక్ అయ్యారా? గుండెల్లో వణుకు పుట్టిందా? అవును, నిజమే.. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.

Record Prices : వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.2వేల 657. కేజీ పాల ధర రూ.1,195. ఏంటి షాక్ అయ్యారా? గుండెల్లో వణుకు పుట్టిందా? అవును, నిజమే.. నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. మన పొరుగున ఉన్న ద్వీప దేశం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులివి. శ్రీలంకలో పరిస్థితులు దారుణయంగా తయారయ్యాయి. ద్వీప దేశం ఆహార, ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతోంది. దీంతో లంకలో నిత్యావసరాల ధరలు ఒక్కసారిగా పెరిగాయి.

ప్రస్తుతం అక్కడ వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఏకంగా 90శాతం పెరిగి రూ.2,657కు చేరింది. ఇక కేజీ పాల ధర 5 రెట్లు పెరిగి రూ.1,195గా ఉంది. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఏం కొనాలి? ఏం తినాలి? ఎలా బతకాలి? అని వాపోతున్నారు. కాగా, నిత్యావసర ఆహార పదార్థాలపై ధరల నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేయడమే ధరల పెరుగుదలకు కారణం.

Tenth Exams : 11 కాదు 6.. పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ధరల పెరుగుదలకు కారణం..
ఏడాదిగా శ్రీలంకను ఆహార, ఆర్థిక సంక్షోభం కుదిపేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో ఆ దేశ విదేశీ మారక ద్రవ్యం భారీగా పతనమైంది. మరోవైపు కరోనా మహమ్మారి దెబ్బకు ఎగుమతులు దెబ్బతిన్నాయి. మరీ ముఖ్యంగా టూరిజం రంగంపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో ఉన్న కాస్త విదేశీ మారక నిల్వలను ఆదా చేసుకునే క్రమంలో దిగుమతులపై నిషేధం విధించింది. అయితే నిత్యావసర వస్తువులైన పప్పులు, పంచదార, గోధుమపిండి, కూరగాయాలు వంటి వస్తువులకు కూడా శ్రీలంక దిగుమతులపైనే ఆధారపడాలి. ప్రభుత్వ నిషేధంతో ఆ వస్తువుల డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లంక ప్రభుత్వం ధరలపై నియంత్రణ విధిస్తూ అత్యవసర నిబంధనలు తీసుకొచ్చింది.

ఏపీలో కరెంట్ కోతలు తప్పవ్.. ఎంత తక్కువ వాడితే అంత మంచిది

బెడిసికొట్టిన వ్యూహం…
ధరలపై నియంత్రణ తీసుకురావడంతో అక్రమ నిల్వలు పెరిగి మార్కెట్ లో సరఫరా తగ్గింది. దీంతో ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో గత గురువారం అధ్యక్షుడు గొటబయ రాజపక్స అధ్యక్షత సమావేశమైన కేబినెట్.. ధరలపై నియంత్రణ ఎత్తివేయాలని నిర్ణయించింది. దీని వల్ల అక్రమ నిల్వలను బయటకు తీసుకురావొచ్చని, తద్వారా సరఫరా పెంచాలని ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే నిత్యావసరాలపై ధరల నియంత్రణను తొలగిస్తున్నట్లు గత శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రభుత్వం ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయతో అక్రమ నిల్వలు బయటకు రావడం మాటేమో కానీ, ఒక్కసారిగా నిత్యావసర ధరలు పెరిగాయి. గత శుక్రవారం రూ.1400 ఉన్న 12.5కేజీల వంట గ్యాస్‌ సిలిండర్ ధర.. ఇప్పుడు రూ.2,657కు చేరింది. అంటే రెండు రోజుల వ్యవధిలోనే సిలిండర్ ధర రూ.1,257 పెరిగింది. ఇక కేజీ పాల ధర రూ.250 నుంచి రూ.1195కు చేరింది. ఇవే కాదు.. గోధుమ పిండి, పంచదార, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులు, సిమెంట్‌ సహా దాదాపు అన్నింటి ధరలు చుక్కలను తాకాయి. దీంతో లంక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వెంటనే ధరలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు