Israel Palastine war: గాజాపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. 28 మంది మృతి.. వందలాది మందికి గాయాలు

ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ శనివారం అర్థరాత్రి సమయంలో బాంబుల వర్షం కురిపింది.

Israel Palastine war: ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. శుక్రవారం నుంచి గాజాపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ శనివారం అర్థరాత్రి సమయంలో బాంబుల వర్షం కురిపింది. గాజా సిటీతో పాటు వివిధ నగరాలపై పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ (పీఐజె) ఉగ్రవాదులు లక్ష్యంగా యుద్ధ విమానాలు బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నాయి.

గాజాలో వైమానిక దాడులతో మృతుల సంఖ్య పెరుగుతోంది. భవనాలు నేల కూలుతున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల కారణంగా 28 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. పలువురు పీఐజే కీలక నాయకులు ఖలీద్ మన్సూర్, తైసీర్ జబారీ ఉన్నట్లు తెలిసింది.

ఇజ్రాయెల్ మాత్రం ఆత్మరక్షణ కోసమే తాము ఈ భీకర దాడులు చేయాల్సి వస్తుందని తెలిపింది. తొలుత తమ ప్రాంతాలపై సుమారు పాలస్తీనా 400 రాకెట్లు, మోర్టార్లు ప్రయోగించారని, పీఐజే నుంచి ఊహించని విధంగా దాడులు జరగడంతో తాము గాజాలోని పీఐజే గ్రూపును లక్ష్యంగా చేసుకోని దాడులు చేయాల్సి వస్తుందని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు.

శనివారం ఇజ్రాయెల్ క్షిపణి ఓ కారును ఢీకొట్టడంతో 75ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆరుగురు గాయపడ్డారు. మరోవైపు పీఐజే సభ్యుడు నివాసం ఉంటున్న రెండంతస్తుల భవనాన్ని యుద్ధ విమానాలు ధ్వంసం చేశాయి.

ఇదిలాఉంటే గాజాను పాలించే పెద్ద మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాని ప్రతిదాడిని కొనసాగించడం లేదని తెలుస్తోంది. ఇజ్రాయెల్, పీఐజే మధ్య జరుగుతున్న పోరులో హమాస్ సైలెంట్ గా ఉన్నట్లు సమాచారం. ఇజ్రాయెల్, హమాస్ గ్రూపుకు కేవలం ఒక సంవత్సరం క్రితం యుద్ధం జరిగింది. గత 15 సంవత్సరాలలో నాలుగు పెద్ద ఘర్షణలు, అనేక చిన్న యుద్ధాలలో జరిగాయి. అయితే గాజాపై రాకెట్ కాల్పులు కొనసాగుతున్నప్పటికీ హమాస్ గ్రూపు తమ పోరాటాన్ని ప్రారంభించేందుకు వెనుకాడుతోంది.

ట్రెండింగ్ వార్తలు