Rs 500 Notes In Kurkure : ఇదేందయ్యా ఇది.. కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు..! కొనేందుకు ఎగబడ్డ జనాలు

Rs 500 Notes In Kurkure : కుర్ కురే, లేస్ అంటే పిల్లలకు ఎంతిష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అవి వాళ్ల ఫేవరెట్ స్నాక్. ఏదైనా షాప్ కనిపిస్తే చాలు అవి కొనిచ్చే వరకు పిల్లలు వదిలిపెట్టరు. అయితే కుర్ కురే, లేస్ ఆరోగ్యానికి మంచివి కాదని, పిల్లలకు అవి కొనివ్వడానికి ఇష్టపడరు తల్లిదండ్రులు. కానీ, అక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. కుర్ కురే కొనేందుకు పిల్లలే కాదు తల్లిదండ్రులు సైతం షాపుల ముందు బారులు తీరారు. దెబ్బకు దుకాణాలన్నీ ఖాళీ అయిపోయాయి.

జనాలు ఎందుకిలా కుర్ కురే ప్యాకెట్లు కొనేందుకు ఎగబడ్డారో తెలిస్తే.. మీరు కూడా వాటిని కొనేందుకు షాపుకి పరిగెడతారేమో. మ్యాటర్ ఏంటంటే.. కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు కనిపించాయట. ఏంటి.. షాక్ అయ్యారా? కానీ ఇది నిజం.

వివిధ కంపెనీలకు చెందిన కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు కనిపించాయి. 5 రూపాయలు, 2 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఒక్కో కుర్‌కురే ప్యాకెట్‌లో 5 నుంచి 6 వరకు కరెన్సీ నోట్లు దొరికాయి. కొందరికి 2, 3 నోట్లు కూడా వచ్చాయి. ఇలా వివిధ ప్యాకెట్లలో సుమారు 35 వేల రూపాయల వరకు డబ్బు దొరికింది. కర్నాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా లింగసుగూర్ తాలూక హునూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.

గత నాలుగైదు రోజులుగా హూనూరు గ్రామంలోని కొన్ని దుకాణాల్లో కొనుగోలు చేసిన కుర్ కుర్ ప్యాకెట్లలో డబ్బులు దొరుకుతున్నాయనే విషయం ఆ చుట్టు పక్కల గ్రామాలకు వ్యాపించింది. అంతే.. కుర్‌కురే కొనుగోళ్లకు అంతా క్యూ కట్టారు. దీంతో దుకాణాలన్నీ ఖాళీ అయిపోయాయి. అయితే దొరికిన నోట్లు నకిలీ నోట్లా? అసలైన నోట్లా? అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒక్కరోజే బస్తాల కొద్దీ కుర్‌కురే ప్యాకెట్లు అయిపోవటంతో ఆ వెంటనే దుకాణదారులు కొత్త స్టాక్ తెచ్చారు. కానీ, వాటిలో మాత్రం ఎలాంటి కరెన్సీ నోట్లు కనిపించలేదట. కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు దొరికాయనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రెండింగ్ వార్తలు