Bribe ICU Beds : దిగజారిన డాక్టర్.. ఐసీయూలో రెండు బెడ్ల కోసం రూ.3లక్షలు లంచం డిమాండ్

కరోనా రోగులకు అండగా నిలివాల్సిన ఈ సమయంలో కొందరు డాక్టర్లు నీచానికి ఒడిగట్టారు. పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. భారత్ ను కరోనా కబళిస్తున్న వేళ..

Doctor Takes Bribe For ICU Beds : కరోనా విపత్కర పరిస్థితుల్లో మనుషుల్లో మానవత్వం మంటకలిసిపోతోంది. కాసుల కక్కుర్తితో దిగజారిపోతున్నారు. మానవత్వంతో వ్యవహరించాల్సిన డాక్టర్లు కూడా దిగజారిపోతున్నారు. కరోనా రోగులకు అండగా నిలివాల్సిన ఈ సమయంలో కొందరు డాక్టర్లు నీచానికి ఒడిగట్టారు. పవిత్రమైన వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. భారత్ ను కరోనా కబళిస్తున్న వేళ.. ప‌లు ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త‌తో పాటు బెడ్ల కొర‌త కూడా ఏర్ప‌డింది. దీన్ని ఆస‌రాగా చేసుకున్న కొంద‌రు వైద్యులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. బెడ్లు కేటాయించాలంటే లంచం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కరోనా సునామీతో అల్లాడిపోతున్న మహారాష్ట్రలో ఈ దారుణం చోటు చేసుకుంది.

థానే మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప‌రిధిలోని ఓ ఆస్ప‌త్రికి ఇద్ద‌రు క‌రోనా రోగులు కోవిడ్ ఆసుపత్రికి వ‌చ్చారు. ఐసీయూలో బెడ్లు అడిగారు. అయితే, బెడ్లు కావాలంటే ఒక్కొక్క‌రు రూ. 1.5 ల‌క్ష‌ల చొప్పున లంచం ఇవ్వాల‌ని డాక్ట‌ర్ ప‌ర్వేజ్ అజిజ్ షేక్(42) డిమాండ్ చేశాడు. అత్యవసరం పరిస్థితి కావడంతో కరోనా రోగులు డాక్టర్ అడిగిన లంచం డబ్బులు ఇచ్చారు.

ఆ తర్వాత వారు ఈ విష‌యాన్ని ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్ అనిరుధ్ దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న ఆయన ద‌ర్యాప్తు చేయించారు. డాక్ట‌ర్ ప‌ర్వేజ్ రోగుల నుంచి డ‌బ్బులు తీసుకుంది నిజ‌మేన‌ని తేలింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డాక్ట‌ర్ ప‌ర్వేజ్‌ తో పాటు మ‌రో న‌లుగురిపై కేసు న‌మోదు చేశారు.

ఐదుగురినీ అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో డాక్టర్ నజ్ నీన్, మహమ్మద్ అబిద్ ఖాన్, తాజ్ షేక్, అబ్దుల్ గఫార్ ఖాన్ ఉన్నారు. రోగులను అడ్మిట్ చేసుకునే ప్రొసీజర్ ను ఆ డాక్టర్లు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. ఐసీయూలో బెడ్ల కోసం రోగుల నుంచి డాక్టర్లు లంచం తీసుకోవడం స్థానికంగా సంచలనం రేపింది. ఆ డాక్టర్ల తీరుని అంతా తప్పుపడుతున్నారు. మరీ ఇంత నీచమా అని తిట్టిపోస్తున్నారు. డబ్బు కోసం ఇంతలా దిగజారిపోవడం దారుణం అంటున్నారు. ఆ డాక్టర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు