Telangana Congress : పార్టీ మార్పుపై త్వరలో చెబుతా.. గౌరవం ఇవ్వని చోట ఉండలేను

గౌరవం ఇవ్వని చోట ఉండలేనని.. ఎవరి కింద పడితే వారి కింద పని చేయనన్నారు. తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానంటూ... పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానన్నారు....

Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్‌ పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎపిసోడ్‌ కొనసాగుతోంది. పార్టీలో కొందరు ముఖ్య నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన పార్టీ మార్పుపై త్వరలోనే స్పష్టత ఇస్తానని చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గౌరవం ఇవ్వని చోట ఉండలేనని.. ఎవరి కింద పడితే వారి కింద పని చేయనన్నారు. తగిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాడుతానంటూ… పార్టీ మార్పుపై త్వరలోనే ఓ స్పష్టత ఇస్తానన్నారు. తనను నమ్మినవారు తన వెంట రావొచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటన రాజగోపాల్‌ రెడ్డి అసంతృప్తికి కారణమైంది. ప్రాజెక్టుల రీడిజైన్‌ పేరిట రూ.లక్షల కోట్లు అప్పులు చేసి సీమాంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెట్టారంటూ టీఆర్ఎస్ సర్కారుపై రాజగోపాల్‌ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆరోపణలు చేశారు.

Read More : Telangana Cong : టీడీపీ వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..ఇంతే మరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

దీనిపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, రాజగోపాల్‌ రెడ్డి మధ్య సభలో మాటల యుద్ధానికి దారితీసింది. ఈ విషయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తనకు మద్దతుగా నిలవలేదని కోమటిరెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పుపై ఊహాగానాలకు మరోసారి తెరలేచింది. గతంలో కూడా ఆయన పార్టీ మారతాననే సంకేతాలిచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అయితే, తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలని చూస్తున్న భాజపా నేతలు గట్టి పట్టున్న నేతలను భాజపాలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కోమటిరెడ్డి ఎపిసోడ్‌ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ట్రెండింగ్ వార్తలు