గుడ్‌న్యూస్ : పాదచారులు, సైకిలిస్టుల కోసం స్పెషల్ కారిడార్

  • Publish Date - September 5, 2019 / 10:52 AM IST

ఢిల్లీలో పాదచారులు, సైకిలిస్టు భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. వారి సేఫ్టీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంది. పాదచారులకు  ఎటునుంచి ఏ వెహికల్ వచ్చి గుద్దేస్తుందనే భయం లేకుండా ఉండేందుకు ప్రత్యేక కారిడార్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కారిడార్ ఢిల్లీకి నలువైపులా ఒక రింగు రోడ్డు మాదిరిగా ఏర్పడనుంది. ఈ కారిడార్ గుండా పచ్చదనంతో నిండిన ఆహ్లాదకర వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయనున్నారు.

ఈ కారిడార్ తో మెట్రో స్టేషన్లు, బస్ స్టేషన్లు, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్, గవర్నమెంట్ ఆఫీసులు,సినిమా ధియేటర్లు అనుసంధానం కానున్నాయి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీతో ‘ది ఢిల్లీ సైకిల్ వాక్’ పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దీనికి  సంబంధించిన పలు అంశాలను  చర్చించారు. 

ఈ పథకం మొదటి దశలో సుమారు 33 కిలోమీటర్ల పొడవైన కారిడార్ నిర్మించాలని నిర్ణయించారు. తుగ్లకాబాద్, గ్రేటర్ కైలాష్, నెహ్రూ ప్లేస్, ఢిల్లీ సచివాలయం తదితర ప్రాంతాలను కలుపుతూ ఈ కారిడార్ నిర్మితం కానుంది. దీనివలన ట్రాఫిక్ నియంత్రణ కూడా జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని వివరాలతో కూడిన బ్లూప్రింట్‌ కూడా రెడీ అయ్యింది.

‘ది ఢిల్లీ సైకిల్ వాక్’ పథకంపై సమీక్షలో డీడీఏ ఉపాధ్యక్షుడు తరుణ్ కపూర్‌, పబ్లిక్ వర్క్స్ విభాగం ఇంజనీర్-ఇన్-చీఫ్ తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ట్రెండింగ్ వార్తలు