Revanth Reddy : ఆ ప్రభుత్వం వచ్చాక దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడింది, అందుకే ఇండియా పేరు మారుస్తాం అంటున్నారు- రేవంత్ రెడ్డి

విభజించు పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర బీజేపీ చేస్తోంది. Revanth Reddy - PM Modi

Revanth Reddy - PM Modi (Photo : Facebook, Google)

Revanth Reddy – PM Modi : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందన్నారు. దేశంలో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ మాట తప్పారని మండిపడ్డారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. దేశానికి ఏమీ చేయలేని మోదీ దేశం పేరు మారుస్తామంటున్నారు అని విమర్శించారు.

మోదీ తిరుగుతున్న ఎయిర్ పోర్ట్ కాంగ్రెస్ కట్టిందే..
”మేకిన్ ఇండియా అన్న మోదీ ఇండియా పేరు మారుస్తానంటున్నారు. ఇండియా కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే పేరు మారుస్తామంటున్నారు. మోదీకి చేతనైతే ఇండియా కూటమిని ఎదుర్కోవాలి. పెరిగిన ధరలు, మణిపూర్ అంశాలపై మోదీ పార్లమెంటులో చర్చించడం లేదు. కేవలం కాంగ్రెస్ ను తిట్టడానికే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. కాంగ్రెస్ ఏం చేసిందన్న మోదీ.. గుజరాత్ లో మోదీ తిరుగుతున్న ఎయిర్ పోర్ట్ కాంగ్రెస్ నిర్మించిందని గుర్తు తెచ్చుకోవాలి.

Also Read.. Telangana Politics: తెలంగాణ ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు.. సిద్ధాంతాలు, భావోద్వేగాలు మాటలకే పరిమితా?

తెలంగాణకు స్వాతంత్య్రం కల్పించింది కాంగ్రెస్ కాదా?
నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించింది కాంగ్రెస్ కాదా? తెలంగాణకు స్వాతంత్య్రం కల్పించింది కాంగ్రెస్ కాదా? మా పార్టీ అధ్యక్షుడు వల్లభభాయ్ పటేల్ కాదా? పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారత్ అభివృద్ధిని లెక్క కడదామా? విభజించు పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్చిన్నం చేసే కుట్ర బీజేపీ చేస్తోంది. దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారు.

కారు కమలంగా మారుతోంది..
కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల దాకా తరమాలి. కారు ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతోంది. లక్ష కోట్లు దోచిన కేసీఆర్ కు మద్దతు తెలపడంలో మీ ఆంతర్యం ఏంటి అసద్ భాయ్? ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించినందుకా కాంగ్రెస్ ను ఓడించాలంటున్నావ్? CWC సమావేశం కోసం పరేడ్ గ్రౌండ్ బుక్ చేసుకుంటే అధికారం ఉందని బీజేపీ గ్రౌండ్ గుంజుకుంది. హోంమంత్రి అమిత్ షా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ సభ జరగకుండా బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి.

Also Read..Telangana : కాంగ్రెస్‌లో భారీ చేరికల ప్లాన్.. ఇంతకీ చేరుతున్నది ఎవరెవరు? ముహూర్తం ఎప్పుడు?

ఉప్పెనలా తరలి రండి..
కాంగ్రెస్ కార్యకర్తలారా కదలండి. 16, 17, 18వ తేదీలలో జరిగే సీడబ్ల్యూసీ సమావేశాలను విజయవంతం చేసుకుందాం. ఉప్పెనలా తరలివచ్చి హైదరాబాద్ నగరాన్ని కప్పేద్దాం. Cwc సమావేశాలకు భద్రత కోసం పోలీసులను అపాయింట్ మెంట్ అడిగితే స్పందించడం లేదు. మోదీ, కేసీఆర్ అధికారం అడ్డు పెట్టుకుని అధికారులను భయపెడుతున్నారు” అని నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.

ట్రెండింగ్ వార్తలు