World Cup 2023 PAK vs NED: ప్రపంచ కప్-2023లో బోణీ కొట్టిన పాకిస్థాన్

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరిగిన రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై పాక్ 81 పరుగుల తేడాతో గెలుపొందింది.

81 పరుగుల తేడాతో ఘన విజయం

ప్రపంచ కప్-2023లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ రాణించలేకపోయింది. నెదర్లాండ్స్ బ్యాటర్లలో విక్రమ్ జిత్ సింగ్ 52, బాస్ డి లీడే 67 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు ఎవరూ అంతగా రాణించలేకపోయారు. పాక్ బౌలర్లలో హారీస్ రౌఫ్ మూడు, హాసన్ అలీ రెండు, షాహిన్ అఫ్రిదీ, ఇఫ్తికర్ అహ్మద్, నవాజ్, షాదాబ్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

విక్రమ్‌జిత్ సింగ్ హాఫ్ సెంచరీ
నెదర్లాండ్స్ ఓపెనర్ హాఫ్ సెంచరీ సాధించాడు. 65 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ తో అర్ధశతకం పూర్తిచేశాడు. తర్వాత రెండు పరుగులు మాత్రమే జోడించి 3వ వికెట్ గా అవుటయ్యాడు. నెదర్లాండ్స్ 24 ఓవర్లలో 120/3 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

నెదర్లాండ్స్ 13 ఓవర్లలో 54/2
50 పరుగుల వద్ద నెదర్లాండ్స్ రెండో వికెట్ కోల్పోయింది. కోలిన్ అకెర్‌మాన్ 17 పరుగులు చేసి అవుటయ్యాడు. నెదర్లాండ్స్ 13 ఓవర్లలో 54/2 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

తొలి వికెట్ కోల్పోయిన నెదర్లాండ్స్
287 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 28 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. మాక్స్ ఓడౌడ్ 5 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్ లో అవుటయ్యాడు.

పాకిస్థాన్ ఆలౌట్.. సత్తా చాటిన నెదర్లాండ్స్ బౌలర్లు
నెదర్లాండ్స్ ముందు పాకిస్థాన్ 287 పరుగుల టార్గెట్ ఉంచింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 49 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటయింది. సౌద్ షకీల్ (68), మహ్మద్ రిజ్వాన్(68) హాఫ్ సెంచరీలతో రాణించారు. మహ్మద్ నవాజ్ (39), షాదాబ్ ఖాన్ (32) ఫర్వాలేదనిపించారు. కెప్టెన్ బాబర్ ఆజం(5) నిరాశపరిచాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డి లీడే 4, కోలిన్ అకెర్‌మాన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆర్యన్ దత్, లోగాన్ వాన్ బీక్, పాల్ వాన్ మీకెరెన్ తలో వికెట్ దక్కించుకున్నారు.

8 వికెట్లు డౌన్.. హసన్ అలీ డకౌట్
252 పరుగుల వద్ద పాకిస్థాన్ 8వ వికెట్ కోల్పోయింది. హసన్ అలీ డకౌటయ్యాడు. షాదాబ్ ఖాన్ (32) ఏడో వికెట్ గా అవుటయ్యాడు.

ఇఫ్తికర్ అహ్మద్ అవుట్.. 6వ వికెట్ డౌన్
188 పరుగుల వద్ద పాకిస్థాన్ 6వ వికెట్ కోల్పోయింది. ఇఫ్తికర్ అహ్మద్(9) అవుటయ్యాడు. 38 ఓవర్లలో 210/6 స్కోరుతో పాక్ ఆట కొనసాగిస్తోంది.

సౌద్ షకీల్ 68, రిజ్వాన్ 68
182 పరుగుల వద్ద పాకిస్థాన్ 5వ వికెట్ నష్టపోయింది. మహ్మద్ రిజ్వాన్ 75 బంతుల్లో 8 ఫోర్లతో 68 పరుగులు చేసి అవుటయ్యాడు. సౌద్ షకీల్ కూడా 68 పరుగులే అవుట్ కావడం విశేషం.

సౌద్ షకీల్ అవుట్.. 4వ వికెట్ డౌన్
పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. హాఫ్ సెంచరీ చేసిన సౌద్ షకీల్ 4వ వికెట్ గా అవుటయ్యాడు. షకీల్ 52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 68 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్(63), ఇఫ్తికర్ అహ్మద్(2) క్రీజ్ లో ఉన్నారు. 30 ఓవర్లలో స్కోరు పాకిస్థాన్ 170/4.

సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీలు
38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్ కోలుకుంది. సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ హాఫ్ సెంచరీలతో ఆదుకున్నారు. సౌద్ షకీల్ 32 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ తో హాఫ్ సెంచరీ బాదాడు. రిజ్వాన్ 58 బంతుల్లో 6 ఫోర్లతో అర్ధ శతకం పూర్తిచేశాడు. 26 ఓవర్లలో 148/3 స్కోరుతో పాక్ ఆట కొనసాగిస్తోంది.

15 ఓవర్లలో పాకిస్థాన్ 78/3
పాకిస్థాన్ తొలి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(23), సౌద్ షకీల్(21) క్రీజ్ లో ఉన్నారు. ఇమామ్-ఉల్-హక్(15), బాబర్ ఆజం(5), ఫఖర్‌ జమాన్(12) అవుటయ్యారు.

నిరాశపరిచిన బాబర్ ఆజం
పాకిస్థాన్ కు బిగ్ షాక్ తగిలింది. తక్కువ స్కోరుకే 3 వికెట్లు కోల్పోయింది. పాకిస్థాన్ తొలి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 43 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజం 5 పరుగులు చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఓపెనర్లు ఇమామ్-ఉల్-హక్ 15, ఫఖర్‌ జమాన్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

5 ఓవర్లలో పాకిస్థాన్ 18/1
పాకిస్థాన్ తొలి 5 ఓవర్లలో వికెట్ నష్టానికి 18 పరుగులు చేసింది. ఇమామ్-ఉల్-హక్ (4), బాబర్ ఆజం(2) ఆడుతున్నారు. ఓపెనర్ ఫఖర్‌ జమాన్ 12 పరుగులు చేసి తొలి వికెట్ గా అవుటయ్యాడు.

తొలి వికెట్ కోల్పోయిన పాకిస్థాన్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఫఖర్‌ జమాన్ స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. 15 బంతుల్లో 3 ఫోర్లతో 12 పరుగులు చేసి లోగాన్ వాన్ బీక్ బౌలింగ్ లో పెలివియన్ కు చేరాడు.

బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్
నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ ప్రారంభించింది. ఇమామ్-ఉల్-హక్, ఫఖర్‌ జమాన్ ఓపెనర్లుగా వచ్చారు.

 

World Cup 2023 PAK vs NED : వన్డే ప్రపంచకప్ లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్ లో పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్ లోని ఉప్పల్ మైదానంలో శుక్రవారం జరుగుతున్న ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

కాగా, తమ తొలి మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని పాకిస్థాన్ భావిస్తోంది. వామప్ మ్యాచ్ ల్లో ఓడినా అసలు పోరులో తమ పోరాట పటిమ చూపాలని బరిలోకి దిగుతోంది. ”బ్యాట్‌తో ఎక్కువ పరుగులు చేయడానికి ప్రయత్నిస్తాం. 290 నుంచి 300 ప్లస్ స్కోరు చేయాలని భావిస్తున్నాం. మా ఓపెనర్లు ఇమామ్, ఫఖర్‌లపై మాకు పూర్తి నమ్మకం ఉంద”ని టాస్ సందర్భంగా పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం అన్నాడు.

తుది జట్లు
పాకిస్థాన్: ఇమామ్-ఉల్-హక్, ఫఖర్ జమాన్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్

నెదర్లాండ్స్ : విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, కోలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), బాస్ డి లీడే, తేజా నిడమనూరు, సాకిబ్ జుల్ఫికర్, లోగాన్ వాన్ బీక్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్

ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
మధ్యహ్నం 12 గంటల నుంచి అభిమానులను స్టేడియంలోకి అనుమతించారు. ఉప్పల్ మ్యాచ్ కి 1200 మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరా లతో నిఘా ఏర్పాటు చేశారు. ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అర్దరాత్రి వరకు మెట్రో రైల్వే సేవలు అందుబాటులో ఉంటాయి. ఎలాంటి రెచ్చగొట్టే వాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పావని, ప్రశాంతంగా మ్యాచ్ ను ఎంజాయ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

ట్రెండింగ్ వార్తలు