ఆపరేషన్ ద్వారంపూడి..! మాజీ ఎమ్మెల్యే చుట్టూ ఉచ్చు బిగుస్తున్న పవన్ కల్యాణ్..!

జనసేనకు మూడు మంత్రి పదవులిస్తే... ఏరికోరి సివిల్ సప్లై శాఖను తీసుకోవడం వెనుక మాఫియా ఆటకట్టించాలనే బీమ్లానాయక్ వార్నింగే ప్రధానంగా గుర్తు చేస్తున్నారు జన సైనికులు.

Operation Dwarampudi : కాకినాడ తీరంలో రాజకీయ తుఫాన్ దుమ్మురేపుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే అలుముకున్న బియ్యం గుండం… మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటనతో పెను తుఫాన్‌గా మారింది. భారీ సుడిగాలి కమ్ముకొస్తుండటంతో ఎవరికో మూడిందనే టాక్ వినిపిస్తోంది. పవన్ వేగంతో దూసుకొస్తున్న తుఫాన్… రైస్ మిల్లులు, బియ్యం గిడ్డంగుల్లో పేరుకుపోయిన అక్రమాలపై విరుచుకుపడుతోంది. రాజకీయ వాతావరణంలో జరిగిన ఈ మార్పు ఆకస్మికంగా జరిగిందా…? దీనికి వెనుక ఇంకేమైనా స్టోరీ ఉందా?

కాకినాడపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్..
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మార్కు రాజకీయం గోదావరి తీరంలో హాట్‌టాపిక్‌గా మారింది. తాను అధికారంలోకి రాగానే కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దందాలకు చెక్ చెబుతానని, అక్రమ సామ్రాజ్యాన్ని పెకిలిస్తానన్న వార్నింగ్‌కు వాస్తవ రూపమిస్తున్నారు డిప్యూటీ సీఎం. కాకినాడలో ప్రముఖ రైస్ మిల్లులు, బియ్యం గిడ్డంగులపై ఆకస్మిక తనిఖీలకు ఆదేశించి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తి కాకుండానే కాకినాడపై పవన్ ప్రత్యేకంగా ఫోకస్ చేయడానికి కారణాలపై పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ డిబేట్ జరుగుతోంది. ఎన్నికలకు ముందు కాకినాడ వచ్చిన పవన్‌ను పరుష పదజాలంతో దూషించడంతోపాటు, జనసేన మహిళా నేతలపై ద్వారంపూడి దాడి చేయడాన్ని సీరియస్‌గా పరిగణించిన డిప్యూటీ సీఎం… అంతకంతకూ పనిష్మెంట్ అనుభవించాలనే ప్లాన్‌నే అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అయ్యారంటున్నారు.

ద్వారంపూడి టార్గెట్‌గా ప్రభుత్వం పావులు..
ముఖ్యంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి టార్గెట్‌గా పావులు కదుపుతోన్న ప్రభుత్వం… ద్వారంపూడి చుట్టూ ఉచ్చు బిగించాలనే స్కెచ్ వేసినట్లు సమాచారం. కాకినాడ కేంద్రంగా బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టి… ఆ దందా నడుపుతున్న నేతల నడ్డి విరవాలని ప్లాన్ వేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. గత వారం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత ద్వారంపూడి అనుచరులు, కుటుంబ సభ్యుల రైస్ మిల్లులు, గొడౌన్లలో తనిఖీలు చేసి సీజ్ చేయడంతో డిప్యూటీ సీఎం పవన్ గతంలో చేసిన బీమ్లానాయక్ ట్రీట్‌మెంట్‌ హెచ్చరికను అంతా గుర్తు చేసుకుంటున్నారు.

బియ్యం దందాకు బ్రేక్ వేస్తానన్న పవన్..
కాకినాడలో ద్వారంపూడి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలోనే బియ్యం అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారని గతంలోనే ఆరోపించారు పవన్. తాము అధికారంలోకి రాగానే బియ్యం దందాకు బ్రేక్ వేయకపోతే తన పేరు కూడా మార్చుకుంటానని సవాల్ చేశారు పవన్. ఇప్పుడు తాను హెచ్చరించినట్లే… బియ్యం అక్రమాల గుట్టు రట్టు చేసేలా ఒక్కో అడుగు వేస్తున్నారు జనసేనాని పవన్. పౌరసరఫరాల మంత్రి నాదెండ్లను కాకినాడ పంపి, బియ్యం అక్రమాలను తవ్వితీయించారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలిసారిగా పిఠాపురం వచ్చిన డిప్యూటీ సీఎం పవన్… కాకినాడలో బియ్యం స్కామ్‌పై మరోసారి స్పందించడం పరిశీలిస్తే… అక్రమార్కుల భరతం పట్టేంతవరకు వదిలే ప్రసక్తేలేదన్న సంకేతాలిచ్చినట్లు భావిస్తున్నారు పరిశీలకులు.

ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూల్చేస్తానని పవన్ ప్రతిన…
గత ప్రభుత్వంలో రేషన్‌ బియ్యం పక్కదారి పట్టించారని, ఈ మాఫియాకు కాకినాడ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని గతంలోనే పవన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ ఆరోపణలతో ఏకీభవించారు. కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డే ఈ అక్రమాల దందాకు కొమ్ముకాస్తున్నట్లు విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక బియ్యం అక్రమ రవాణాకు పాల్పడిన ద్వారంపూడి సామ్రాజ్యాన్ని కూల్చేస్తానని ప్రతిన బూనారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బియ్యం అక్రమ నిల్వలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. మరీ ముఖ్యంగా పౌరసరఫరాల శాఖను జనసేన తీసుకోవడానికి కూడా కాకినాడలో బియ్యం మాఫియాను తామే అణిచివేయాలనే బలమైన కోరిక జనసేనానిలో నాటుకుపోవడమే కారణమంటున్నారు.

కాకినాడ కేంద్రంగా విదేశాలకు ఎగుమతి..
కాకినాడ కేంద్రంగా బియ్యం, నూకలు పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతవుతున్నాయి. దీనివెనుక వైసీపీ నేతల పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ద్వారంపూడి ఫ్యామిలీకి బియ్యం మిల్లులు ఉన్నాయి. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి గతంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉండేవారు. ద్వారంపూడి సోదరుడు వీరభద్రరెడ్డి రాష్ట్ర మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. దీంతో కాకినాడలో బియ్యం అక్రమ ఎగుమతులపై అధికారులు పెద్దగా యాక్షన్ తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారడం, బియ్యం మాఫియాపై డిప్యూటీ సీఎం పవన్‌కు ఫిర్యాదులు చేరడంతో సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటోంది ప్రభుత్వం.

ఆకస్మిక తనిఖీల్లో బయటపడ్డ బియ్యం గుట్టలు..
ఇటీవల కాకినాడలో పర్యటించిన సివిల్‌ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన ఆకస్మిక తనిఖీల్లో బియ్యం అక్రమ నిల్వలు బయటపడ్డాయి. కాకినాడ యాంకరేజి పోర్టు పరిధిలో విశ్వప్రియ ఎక్స్‌పోర్ట్స్, బీచ్‌ రోడ్డులోని సార్టెక్స్ ఇండియా, మానస ఎక్స్‌పోర్ట్స్‌ డీఎన్‌ఎస్‌లలో మంత్రి తనిఖీలు చేయగా, విశ్వప్రియ గొడౌన్‌లో నిల్వ చేసిన 4 వేల 700 టన్నుల రేషన్‌ బియ్యం గుట్టురట్టైంది. ఇక మిగిలిన మిల్లులు, గొడౌన్లలోనూ బియ్యం గుట్టలు కనిపించడంతో వాటిని సీజ్‌ చేశారు.

ఏరికోరి సివిల్ సప్లయ్ శాఖను తీసుకుంది అందుకేనా..
ఈ మొత్తం ఎపిసోడ్ ను పరిశీలిస్తే.. బియ్యం మాఫియాను ఫిక్స్ చేయాలని జనసేనాని పవన్ డిసైడ్ అయినట్లు క్లియర్‌కట్‌గా తెలుస్తోంది. జనసేనకు మూడు మంత్రి పదవులిస్తే… ఏరికోరి సివిల్ సప్లై శాఖను తీసుకోవడం వెనుక మాఫియా ఆటకట్టించాలనే బీమ్లానాయక్ వార్నింగే ప్రధానంగా గుర్తు చేస్తున్నారు జన సైనికులు. ఒకప్పుడు ఐపీఎస్ అధికారి డీటీ నాయక్ కాకినాడలో నేతల అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. ఇప్పుడు అదే స్టైల్లో బీమ్లానాయక్ ట్రీట్మెంట్‌ ఉంటుందా? అన్న చర్చ మొదలైంది.

Also Read : వాళ్లకి.. జగన్ లాంటి నాయకుడే కరెక్ట్..!- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు