తండ్రికి పూర్తి భిన్నంగా సాహస రాజకీయం.. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న మహారాణి..!

వాస్తవానికి పాలనలో ఇంత స్పీడ్‌ చూపిస్తారని ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు. అదితి తండ్రి అశోక్‌ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు.

Aditi Vijayalakshmi Gajapathi Raju Pusapati : ఇప్పటివరకు ఒక లెక్క… ఇప్పటినుంచి మరోలెక్క… పని ఏదైనా చకచకా జరిగిపోవాల్సిందే… మాటలే కాదు.. చేతలు కూడా యమా స్పీడు… రాజకీయంగా ఓనమాలు దిద్దుతూనే… దూకుడూ చూపుతున్నారు ఆ ఎమ్మెల్యే… రాచరికంలో పుట్టి… కార్లు, బంగ్లాల్లో తిరిగి… ప్రజాసేవ కోసం పరితపించి… ఐదేళ్లుగా ఎన్నో కష్టాలు అనుభవించిన మహారాణి ఆమె… అధికారం వచ్చింది కదా అని రిలాక్స్‌ అవ్వలేదు. బంపర్‌ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూనే తన మార్కు పాలిటిక్స్‌తో ప్రత్యర్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు విజయనగర మహారాణి.. ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు.

ఎమ్మెల్యే దూకుడుకు ఉలిక్కిపడ్డ సీనియర్ నేత..
విజయనగరం ఎమ్మెల్యేగా 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన విజయనగరం మహారాణి అదితి గజపతిరాజు పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. తండ్రి అశోక్‌గజపతిరాజు వారసత్వంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టినా, పాలనాపరంగా ఎటువంటి సంకోచం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి దూకుడు చూపుతున్న అదితి… ప్రత్యర్థులు, అక్రమార్కులకు సింహస్వప్నంగా మారిపోయారు. ఆక్రమణలపై ఉక్కుపాదం మోపాలనే ఉద్దేశంతో… పేదల ఇళ్లు ముంపునకు కారణమైన భవనాన్ని 24 గంటల్లో కూల్చేలా చేశారు అదితి. ఇక వైసీపీ జిల్లా కార్యాలయాన్ని పరిశీలించి రాష్ట్రంలో రాజకీయ సంచలనంగా మారారు. ఎమ్మెల్యేగా అదితి చూపుతున్న దూకుడుకు సీనియర్‌ నేత బొత్స కూడా ఉలిక్కిపడ్డారు. తమ ప్రైవేటు ఆస్తిలోకి ఎమ్మెల్యే ప్రవేశించడాన్ని ప్రశ్నించిన బొత్స… అశోక్‌ కుమార్తె ఇంత స్పీడ్‌గా ఉంటారని అస్సలు ఊహించలేదని సన్నిహితులతో చెబుతున్నారట.

ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు..
ప్రతిపక్షంలో ఉండగా, మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, ఆయన అనుచరులు భూ దందాలు చేస్తున్నారని ఆరోపించిన అదితి… గెలిచిన వెంటనే తన ఆరోపణలకు బలం చేకూర్చే ఆధారాలను తవ్వి తీస్తున్నారు. తన పూర్వీకులైన విజయనగరం రాజులు దానం చేసిన మాన్సాస్‌ భూములతోపాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా అడుగులు వేస్తూ ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు అదితి గజపతిరాజు. వాస్తవానికి అదితి పాలనలో ఇంత స్పీడ్‌ చూపిస్తారని ప్రతిపక్షంతోపాటు స్వపక్షంలోనూ ఎవరూ ఊహించలేదు. అదితి తండ్రి అశోక్‌ గజపతిరాజు 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి దూకుడు చూపించలేదు. సౌమ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్‌ పెద్దల తరహాలోనే రాజకీయం చేసేవారు. ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన అదితి తన తండ్రిలా స్మూత్‌గా హ్యాండిల్‌ చేస్తే ఈ రోజుల్లో రాజకీయాలు చేయలేమని చాలా త్వరగా అర్థం చేసుకున్నారు. దీంతో అశోక్‌కు భిన్నమైన రీతిలో పావులు కదుపుతూ… మహారాణి దెబ్బ ఎలా వుంటుందో ప్రత్యర్థులకు రుచిచూపిస్తున్నారు.

బంగ్లా దాటి బయటకు రారనే అపవాదును చెరిపేశారు…
అదితి స్పీడ్‌తో గత ఐదేళ్లుగా ఇష్టానుసారం భూకబ్జాలకు పాల్పడిన వారు బెంబేలెత్తిపోతున్నారు. వాస్తవానికి విజయనగరం టీడీపీకి కంచుకోట. కానీ, ఎప్పుడూ ఈ తరహా స్పీడ్‌ పాలిటిక్స్‌ను ఆ పార్టీ కార్యకర్తలు చూడలేదు. ఇలా అయితే కష్టమే అంటూ ఆ పార్టీ నేతలు నిట్టూరుస్తుండేవారు. ఐతే ఇప్పుడు అదితి వారి అంచనాలకు తగ్గట్టు దూకుడు చూపుతుండటంతో… ఇన్నాళ్లకు సరైన ఎమ్మెల్యే దొరికారంటూ ఖుషీ అవుతున్నారు. అదితి గెలిస్తే… బంగ్లా దాటి బయటకు రారనే అపవాదును తొలి వారంలోనే చెరిపేశారు.. సమస్య ఎక్కడుంటే అక్కడ క్షణాల్లో వాలిపోతున్నారు.

రాష్ట్రంలో వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయాలపై ఎన్నో ఫిర్యాదులు వచ్చినా… ఏ ఎమ్మెల్యే కూడా అదితి గజపతిలా ఆయా కార్యాలయాలను పరిశీలించలేదు. కానీ, ఆ సాహసం చేసిన తనలోని రాజ ఠీవిని ఆవిష్కరించారు అదితి. ఇలాంటి పరిణామాలు ఎవరూ ఊహించకపోవడం…. అందరి ఊహలకు అతీతంగా అదితి పనితీరు ఉండటం జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read : పవన్ కల్యాణ్ ఆపరేషన్ ద్వారంపూడి స్టార్ట్ చేసేశారా? మాజీ ఎమ్మెల్యే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు..!

ట్రెండింగ్ వార్తలు