Ambedkar Statue : దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.. ఎన్నో ప్రత్యేకలు.. మహనీయుని జీవిత విశేషాలు తెలిపేలా అరుదైన చిత్రాలు

సమానత్వ సారథి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహా ప్రతిష్టకు రంగం సిద్ధమైంది. దేశంలో కల్లా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం.

Ambedkar Statue : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారకం ఆవిష్కరణ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమాన్ని నిర్మించనుంది. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తో పాటు ముఖ్యఅతిథిగా బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

2016లో శంకుస్థాపన ..

సమానత్వ సారథి బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహా ప్రతిష్టకు రంగం సిద్ధమైంది. దేశంలో కల్లా అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్‌లో నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. హుస్సేన్‌సాగర్‌ తీరంలో 11 ఎకరాల 80 సెంట్ల స్థలంలో అంబేద్కర్‌ స్మృతివనాన్ని నిర్మించింది సర్కార్‌. 2016లో అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని నిర్మించాలని శంకుస్థాపన చేశారు. 2018 సంవత్సరంలో డీపీఆర్ రూపొందించడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2020 సెప్టెంబర్ 16న రూ. 146.50 కోట్లకు పరిపాలన ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. డిజైన్లు, కాంట్రాక్టు సంస్థ ఎంపిక, పాలన అనుమతులు ఇలా రకరకాల దశలు దాటుకుని 2021లో నిర్మాణ పనులు మొదలయ్యాయి. రెండేళ్ల వ్యవధిలో చురుగ్గా పనులు చేపట్టి పూర్తి చేశారు. అంబేద్కర్‌ 132వ జయంతి పురస్కరించుకుని విగ్రహా ఆవిష్కరణకు చేయనున్నారు.

Ambedkar Statue in Hyderabad

హైదరాబాద్‌కే ఐకానిక్‌ సింబల్‌గా నిలిచేలా ..

అంబేద్కర్‌ కీర్తిని దశదిశలూ చాటేలా విగ్రహాన్ని, స్మృతివనాన్ని తీర్చిదిద్దాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌కే ఐకానిక్‌ సింబల్‌గా నిలిచేలా మహనీయుని విగ్రహాన్ని నిర్మించారు. దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేద్కర్ విగ్రహాలు అన్నింటిలో కల్లా ఎత్తయినదిగా హైదరాబాద్‌లో నిర్మించిన ఈ స్మారకం నిలుస్తోంది. విగ్రహా ఆవిష్కరణ కోసమే తెలంగాణ ప్రభుత్వం 10 కోట్లు ఖర్చు చేస్తోంది.

 

లోపలంతా స్టీల్‌.. పైపూత మాత్రం కంచు ..

విగ్రహం అడుగు భాగంలో పార్లమెంటు ఆకారంలో మ్యూజియం, లైబ్రరీ ఏర్పాటు చేశారు. 50 అడుగుల వెడల్పు, 50 అడుగుల ఎత్తులో నిర్మించిన బేస్‌మెంట్‌ నుంచి విగ్రహం పాదాలకు వెళ్లేందుకు రెండు అధునాతన లిఫ్ట్‌ సౌకర్యం ఏర్పాటు చేశారు. అమెరికాలోని స్టాచ్యు ఆఫ్‌ లిబర్టీ తరహాలో నిర్మించిన అంబేద్కర్‌ విగ్రహం ఐకానిక్‌ సింబల్‌గా మారనుంది. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ విగ్రహ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. బేస్‌మెంట్‌గా నిర్మించిన పార్లమెంట్‌ నమూనా భవనం కోసం అగ్రా, నోయిడా, జైపూర్‌ నుంచి ఎరువు, గోధుమ రంగులో ఉన్న రాళ్లను ఉపయోగించారు. అంబేద్కర్ విగ్రహానికి బూట్లు, కాళ్లు, చేతులు, భారత రాజ్యాంగ పుస్తకం, భుజాలు, తల ఇలా విగ్రహ భాగాలను నోయిడాలో తయారు చేశారు. విగ్రహం లోపల అంతా స్టీల్‌ వాడగా, పైపూత మాత్రం కంచుతో తయారు చేశారు. ఏ కాలంలోనైనా విగ్రహం షైనింగ్‌ తగ్గకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పాలీ యూరేథీన్‌ కెమికల్స్‌తో కోటింగ్‌ వేసిన విగ్రహం ఏ వాతావరణాన్ని అయినా తట్టుకునేలా తీర్చిదిద్దారు.

Ambedkar Statue in Hyderabad

మహనీయుని జీవిత విశేషాలు తెలిపేలా..

125 అడుగుల భారీ విగ్రహం వెడల్పు 45 అడుగులు, బేస్‌మెంట్‌ ఎత్తు 50 అడుగులు. విగ్రహం‌కోసం 155 టన్నుల స్టీల్‌ వాడారు. 111 టన్నుల కంచుతో పైపూత తయారు చేశారు. బేస్‌మెంట్‌గా నిర్మించిన భవనంలో మ్యూజియం, లైబ్రరీ, కాన్ఫరెన్స్‌ హాలు నిర్మించారు. పార్లమెంట్‌ నమూనాలో ఉన్న ఈ భవనంలో మహనీయుని జీవిత విశేషాలు తెలియజేసే అరుదైన చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు. లైబ్రరీలో అంబేడ్కర్ రచనలు సహా ఆయన జీవితానికి సంబంధించిన పుస్తకాలు ఉంచనున్నారు.

పచ్చదనంకోసం మూడెకరాలు..

స్మృతివనం ఆవరణలో పచ్చదనం కోసం మూడు ఎకరాల ఖాళీ స్థలం కేటాయించారు. రాక్‌గార్డెన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, వాటర్‌ ఫౌంటేన్‌, శాండ్‌స్టోన్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 450 కార్లను పార్కింగ్‌కు స్థలం కేటాయించారు.

Ambedkar Statue in Hyderabad

వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత..

గుజరాత్‌లో సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ విగ్రహం తర్వాత అతిపెద్ద విగ్రహం హైదరాబాద్‌లో నిర్మించిన అంబేద్కర్‌ విగ్రహమే. ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీల్లో కూడా అతిపెద్ద అంబేద్కర్‌ విగ్రహాలు నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. మహారాష్ట్రలో నిర్మాణంలో ఉండగా, ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావిస్తోంది కేంద్ర ప్రభుత్వం. పద్మభూషన్‌ రాంవంజి సుతార్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అంబేద్కర్‌ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. రోజూ 450 కార్మికులు చమటోడ్చి అపురూపమైన రీతిలో విగ్రహాన్ని అందుబాటులోకి తెచ్చారు.

ట్రెండింగ్ వార్తలు