Bodhan Constituency: బోధన్ సిటింగ్ ఎమ్మెల్యేకు కఠిన పరీక్ష.. బీఆర్‌ఎస్‌కు సవాళ్లు ఎన్నో.. హ్యట్రిక్ సాధిస్తారా?

Bodhan Assembly Constituency Ground Report

Bodhan Assembly Constituency: బోధన్ నియోజకవర్గం ఒకపుడు టిడిపి కంచుకోట కాగా ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి కంచుకొటగా మారింది.. కాని కాలం మారిన సందర్బంగా ప్రస్తుతం మాత్రం బీఆర్ఎస్ (BRS Party) తన ఖాతాలొ వేసుకుంది..అటు మహరాష్ట్రకు ఎక్కువగా సరిహద్దు ప్రాంతం ఉండటంతొ ఎక్కువగా వలసవాసులు అంతే కాకుండా ఆంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఈ సెగ్మెంటులో ఉన్నారు.. ప్రస్తుతం మాత్రం బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ (MLA Shakil Aamir) రెండు సార్లు గెలుపొందగా హ్యట్రిక్ సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాగా హ్యట్రిక్(Hattrick) సాధిస్తారా లేదా అన్నది చూడాలి మరీ..

బోధన్ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. బోధన్, రెంజల్, నవీపేట, ఎడపల్లి, సాలురా మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం రెండు లక్షల 4 వేల రెండు వందల ఓట్లు ఉండగా.. ఇందులో పురుషు ఓటర్లు 97 వేల 975 మంది. లక్షా ఆరు వేల 222 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. బోధన్‌లో మూడు సార్లు స్వతంత్రులు గెలవగా, 1983 నుంచి 99 వరకు తెలుగుదేశం పార్టీ హవా నడిచింది. 1999 నుంచి వరుసగా నాలుగు సార్లు కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్‌రెడ్డి (Sudarshan Reddy) ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు.

ఎమ్మెల్యే షకీల్ ఆమీర్ (photo: facebook)

ప్రస్తుతం బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు షకీల్ అమీర్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డిని ఓడించిన షకీల్.. రెండోసారి 2018లోనూ ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఏకైక మైనార్టీ ఎమ్మెల్యే షకీల్. గత ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఈ సారి సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. క్యాడర్ బలం పెరిగినా.. బలమైన నాయకుడు లేకపోవడం ఉన్న లీడర్ల మధ్య ఆధిపత్య పోరు ఆ పార్టీకి మైనస్‌గా మారాయి.

బోధన్‌లో ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ కనిపిస్తోంది. అయితే ఎమ్మెల్యే షకీల్ ప్రత్యర్థి పార్టీ కన్నా సొంతపార్టీ నుంచి ఎక్కువగా సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలు అధికార పార్టీలో ఆధిపత్యపోరును కళ్లకు కడుతున్నాయి. ప్రభుత్వ పథకాలు… మైనార్టీ వర్గీయుల ఓట్ బ్యాంక్ సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్ అమేర్‌కు ప్లస్ పాయింట్స్‌గా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో పెద్దగా వ్యతిరేకత లేకున్నా.. అంతర్గత సమస్యలే ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే బోధన్ పట్టణ అభివృద్ధిపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎమ్మెల్యే సోదరుడు షాడో నేతగా వ్యవహరించటం.. మున్సిపల్ చైర్మన్ తూము పద్మతో విభేదాలు కొంత ఇబ్బంది కలిగించేలా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యే అనుచరులు, చైర్‌పర్సన్ తూము పద్మ అనుచరులకు అస్సలు పొసగడం లేదు. ఒకేపార్టీలో ఉన్నా.. పరస్పరం దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లడం, పోలీసు కేసులు పెట్టుకునేవరకు పరిస్థితి దిగజారిపోవడం ఎమ్మెల్యేకు మైనస్‌గా చెబుతున్నారు.

Also Read: ఆందోల్ కోటలో పాగా వేసేదెవరు.. ప్రధాన పార్టీల్లో పెరిగిపోతున్నఆశావాహులు!

బోధన్ లో శివాజీ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జరిగిన అల్లర్లు మాయని మచ్చగా నిలిచిపోయాయి. ఈ అల్లర్లు ఓ వర్గం ప్రజల్లో వ్యతిరేకత పెంచాయి. అంతేకాదు తెలంగాణా దశాబ్ది ఉత్సవాల విషయంలో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్‌పర్సన్ మధ్య వివాదం జరిగింది. చైర్‌పర్సన్‌ను ఎమ్మెల్యే ఆహ్వానించలేదని కనీసం ప్లెక్సీలో ఫొటో వేయలేదని ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు దగ్గరపడినా.. పార్టీలో అంతర్గత కలహాలకు పుల్‌స్టాప్ పెట్టేలా ఏ చర్యలు తీసుకోవపోవడంతో క్యాడర్ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చైర్‌పర్సన్ పద్మ సొంతంగా దశాబ్ది వేడుకలు నిర్వహించడం గందరగోళం సృష్టించింది. అయితే పార్టీలో పోరు ఎలా ఉన్నా.. ప్రజల్లో పట్టుకోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే. మన ఊరు – మన ఎమ్మెల్యే పేరుతో డోర్ టూ డోర్ పాదయాత్ర పూర్తి చేశారు. తాను చేపట్టిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే షకీల్.

ఎమ్మెల్సీ కవిత (photo: instagram)

మరోవైపు బోధన్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేస్తారనే టాక్ బీఆర్‌ఎస్ వర్గాలను ఆకర్షిస్తోంది. ప్రత్యేక పరిస్థితులు ఉండటంతో బోధన్‌లో కవిత అయితే గెలుపు ఈజీ అని బీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తోందని టాక్ నడుస్తోంది. కవిత అత్తవారి గ్రామం కూడా బోధన్ పక్కనే ఉండటం.. వారి బంధువర్గం ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండటంతో ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతోంది.

సుదర్శన్‌రెడ్డి (photo: facebook)

బీఆర్‌ఎస్‌లో పరిస్థితి ఇలా ఉండగా.. ఈ సారి ఎలాగైనా గెలవాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్‌ రెడ్డి ఫోకస్ పెట్టారు. వరుసగా నాలుగు సార్లు గెలిచిన సుదర్శన్‌రెడ్డి రెండు సార్లు ఓటమి చెందారు. అయినా నిరుత్సాహం చెందకుండా ఈ సారి కాంగ్రెస్ గాలి వీస్తోందని ప్రచారం చేస్తూ ముందడుగు వేస్తున్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉండటంతో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ జరిగేలా కనిపిస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉంటూ అన్నీతానై నడిపిస్తున్న సుదర్శన్ రెడ్డి.. నియోజకవర్గంలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఆయనకు పోటీగా పార్టీలో మరేవరూ లేఖపోవడంతో టికెట్ గ్యారెంటీగా వస్తుందనే ధీమాలో ఉన్నారు. తమ అభ్యర్థి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డేనని.. బీఆర్‌ఎస్ హయాంలో నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేయనందున తామే గెలుస్తామని అంటున్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి. బోధన్‌ను మళ్లీ హస్తగతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మేడపాటి ప్రకాష్ రెడ్డి (photo: facebook)

శివాజీ విగ్రహ ప్రతిష్ట సమయంలో జరిగిన అల్లర్ల నుంచి ఇక్కడ బలం పెంచుకోవాలని చూస్తోంది బీజేపీ. రాష్ట్రంలో ఈ సారి ఎలాగైనా గెలవాని కోరుకుంటున్న బీజేపీ… బోధన్‌పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సంజయ్ చేసిన పాదయాత్రకు బోధన్ నియోజకవర్గంలో మంచి ఆదరణ లభించింది. బీజేపి నుంచి ఇద్దరు నేతలు టిక్కెట్ ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో పట్టు ఉన్న మేడపాటి ప్రకాష్ రెడ్డి (Medapati Prakash Reddy)తో పాటు రైస్ మిల్లర్ల అసోసియేషన్ నేత మోహన్ రెడ్డి కమలం పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరు కూడా ఎన్నికల దిశగా ఇప్పటికే కార్యక్రమాలు మొదలు పెట్టారు. బోధన్ వంటి సున్నితమైన ప్రాంతంలో బీజేపి ఎలాంటి అడుగులు వేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోదీ ఇమేజ్‌తో బోధన్‌లో బీజేపీ బోణీ కొడుతుందని ఆశలు పెట్టుకుంటున్నారు కమలం నేతలు.

Also Read: కామారెడ్డిలో గంప గోవర్దన్‌కు టికెట్ దక్కుతుందా.. బీఆర్ఎస్ టిక్కెట్ పైనే గెలుపోటములు!

మరోవైపు బోధన్ నుంచి ఈ సారి ఎంఐఎం కూడా పోటీచేస్తుందనే టాక్ నడుస్తోంది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న నియోజవర్గంలో వారి ఓట్లు చీలిపోతే విజేతల జాతకాలు మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉన్న మైనార్టీలు.. ఎంఐఎం పోటీ చేస్తే ఎటువైపు మొగ్గుతారో చెప్పడం కష్టమే.. ఎంఐఎం చీల్చే ఓట్లే విజేతను నిర్దేశిస్తాయి. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో నెగ్గిన సిటింగ్ ఎమ్మెల్యే షకీల్‌కు ఇది కఠిన పరీక్షగా చెబుతున్నారు పరిశీలకులు.

Also Read: బాన్సువాడలో ప్రచారంలోకి దిగిపోయిన పోచారం.. ఆ సెంటిమెంట్ నుంచి గట్టెక్కుతారా?

మొత్తానికి ఈ సారి ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌కు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. గెలిచిన 100 రోజుల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. బోధన్-బీదర్ రైల్వే లైన్ ప్రతిపాదన కూడా ముందుకు కదల్లేదు. అక్రమ ఇసుక, ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. సంక్షేమ పథకాలు, కేసీఆర్ చరిష్మాతో గట్టెక్కుతామని ఆశిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే.. మిగిలిన సమయంలోనైనా అంతర్గత సమస్యలకు చెక్ చెప్పాలని సూచిస్తున్నారు పరిశీలకులు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు