Governor Tamilisai : గౌరవం లేదు, కనీసం పలకరింపూ లేదు.. కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళిసై షాకింగ్ కామెంట్స్

మరోసారి తెలంగాణ సర్కార్ పై మాటల యుద్ధం మొదలుపెట్టారు గవర్నర్ తమిళిసై. ప్రొటోకాల్ పాటించకపోవడం నుంచి అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా చేయడం వరకు ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

Governor Tamilisai : మరోసారి తెలంగాణ సర్కార్ పై మాటల యుద్ధం మొదలుపెట్టారు గవర్నర్ తమిళిసై. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు తీసుకుని మూడేళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్ భవన్ లో ప్రత్యేకంగా మాట్లాడిన తమిళిసై.. మళ్లీ కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ప్రొటోకాల్ పాటించకపోవడం నుంచి అసెంబ్లీలో తన ప్రసంగం లేకుండా చేయడం వరకు ప్రతీ అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మేడారం జాతరకు వెళ్లేందుకు ప్రభుత్వాన్ని హెలికాప్టర్ కోరితే చివరి నిమిషం వరకు స్పందించలేదని, చివరికి తాను కారులో వెళ్లి సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్నానని గవర్నర్ తమిళిసై గుర్తు చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు తాను ఎక్కడికైనా వెళితే కనీసం కలెక్టర్లు కూడా వచ్చి పలకరించడం లేదని గవర్నర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాల పట్ల తాను వ్యక్తిగతంగా బాధపడను అన్న గవర్నర్… కానీ, గవర్నర్ వ్యవస్థను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్ గా తమిళిసై బాధ్యతలు తీసుకున్నారు. నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు.

”రాజ్ భవన్ కు ఉన్న పరిమితులు ఏంటో నాకు తెలుసు. ప్రజలకు మంచి చేసేందుకు చిన్న మార్పు జరిగినా నాకు సంతోషమే. నాకు గౌరవం ఇచ్చినా, ఇవ్వకున్నా.. నా జీవితం ప్రజల కోసమే. ప్రజలకు సేవ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి రాజ్ భవన్ తలుపులు తెరిచాం. కొన్ని విషయాలు నేను బయటకు చెప్పలేను. ప్రజా సమస్యలు తెలుసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా. వివక్షను ఎట్టి పరిస్థితుల్లో సహించను.

మేడారం వెళ్లేందుకు హెలికాప్టర్ అడిగితే చివరి నిమిషం వరకు ప్రభుత్వం స్పందించలేదు. ప్రభుత్వం స్పందించకపోవడంతో 8గంటలు ప్రయాణించి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. ఎవరినీ వేలెత్తి చూపేందుకు నేను ఇవన్నీ చెప్పడం లేదు. ప్రభుత్వం ఏమనుకుంటుందో కనీసం సమాచారమైనా ఇవ్వాలి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగమే లేకుండా చేశారు. రిపబ్లిక్ డే రోజు జెండా వందనం లేకుండా చేశారు. నేను ఎక్కడికి వెళ్లినా అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదు. నేను వెళ్లిన చోటకు కనీసం కలెక్టర్ వచ్చి పలకరించడం లేదు.

వ్యక్తిగతంగా నేనేమీ బాధపడటం లేదు. కానీ, రాజ్ భవన్ ను గౌరవించాలి కదా? గవర్నర్ ను గౌరవించనట్లు తెలంగాణ చరిత్రలో లిఖించడం నాకు ఇష్ట లేదు. మహిళా గవర్నర్ గా నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. ఏ ఒక్కరూ నా శక్తిని, ధైర్యాన్ని అడ్డుకోలేరు” అని కేసీఆర్ సర్కార్ ను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

ట్రెండింగ్ వార్తలు