Hyderabad Traffic Police: ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఈసారి ఎవరి పని పడుతున్నారంటే..

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి రంగంలోకి దిగారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ అక్రమార్కుల పనిపడుతున్నారు.

Hyderabad Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మరోసారి కొరడా ఝుళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత వాహనాల్లో సైరన్లు వినియోగిస్తున్న అక్రమార్కుల భరతం పట్టేందుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అంతేకాదు కార్ల అద్దాలకు టిల్ట్ తెరలు వాడుతున్న వారిపైనా చర్యలు చేపడుతున్నారు. సైరన్లు మోగిస్తూ దర్జాగా తిరిగే వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత వాహనాల్లో రహస్యంగా సైరన్లు పెట్టుకుని రోడ్లపై హల్ చల్ చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.


ట్విటర్ లో ఫిర్యాదు.. స్పందించిన సీపీ

సైరన్ల వ్యవహారంపై నెటిజన్ ఒకరు ట్విటర్ లో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన.. నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు వినియోగిస్తున్న వారి పని పట్టాలని
ట్రాఫిక్ పోలీసు యంత్రాగానికి ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు గత రెండు రోజుల నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. అక్రమంగా వినియోగిస్తున్న సైరన్లను తొలగించి వాహన యజమానులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. మరోసారి సైరన్లు వినియోగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.


420 మందికి నోటీసులు

జంట నగరాల్లో ఇప్పటివరకు దాదాపు 450 వాహనాల్లో సైర్లను పోలీసులు తొలగించారు. నిబంధనల ప్రకారం అత్యవసర సైరన్లు.. ప్రోటోకాల్, అంబులెన్స్, అత్యవసర సేవల వాహనాల్లో మాత్రమే వినియోగించేందుకు అనుమతి ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు, వాడుతున్న వారిలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, నామినేటెడ్ పదవులు పొందిన నేతల అనుచరులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. నగర ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు కొంతమంది వాహనదారులు కూడా రహస్యంగా తమ కార్లలో సైరన్లు వాడుతున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా తమ వాహనాల్లో సైరన్లు, మైక్రోఫోన్లు, ఇతర పరికరాలను అమర్చుకున్న దాదాపు 420 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.


బ్లాక్ ఫిల్మ్ లు, సైరన్లు విక్కయించొద్దు

మరోవైపు కార్ డెకర్స్ దుకాణాల యాజమానులకూ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. మోటారు వాహన చట్టం నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిల్మ్, సైరన్లు విక్రయించవద్దని వారికి సూచించారు. కొంతమంది కార్ డెకర్స్ దుకాణదారులు నిబంధనల గురించి తెలిసినా.. కార్లకు బ్లాక్ ఫిల్మ్ లు, సైరన్లు విక్రయిస్తున్నట్టు పోలీసులకు తెలియడంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు, బ్లాక్ ఫిల్మ్ లు, అత్యధిక సౌండ్ తో కూడిన హారన్లు, సైలెన్సర్లు వాడుతున్న వాహనదారులు వెంటనే తొలగించాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు