రైతు రుణమాఫీ ఎలా? సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్, ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?

చెప్పిన ప్రకారం ఇచ్చిన హామీలు అమలు చేయగలరా? రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?

Crop Loan Waiver : తానిచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ చేయాలని భావిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుమారు 40వేల కోట్ల రుపాయల రుణాలను ఏక కాలంలో రద్దు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. ఇన్నాళ్లు ఎన్నికల ప్రహసనంలో బిజీబిజీగా గడిపిన సీఎం.. ఇప్పుడు రైతు రుణమాఫీ అనే బిగ్ టాస్క్ పై ఫోకస్ పెట్టారు. చెప్పిన ప్రకారం ఇచ్చిన హామీలు అమలు చేయగలరా? రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?

రైతు రుణమాఫీపై ప్రత్యేక దృష్టి..
రైతు రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలనే ఉద్దేశంతో ఆగస్టు 15లోగా 100శాతం రైతు రుణమాఫీని చేయాలనే పట్టుదలతో ఉన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇందుకోసం సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అధికారులతో ఓ అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే రుణమాఫీపై ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 15లోగా రెండు ల‌క్షలలోపు ఉన్న రైతు రుణాల‌ను మాఫీ చేయాల‌ని.. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

రుణ‌మాఫీ.. బెట‌ర్ ఆప్షన్ ఏంటి?
రైతుల‌కిచ్చిన హామీ మేర‌కు రెండు ల‌క్షల వ‌ర‌కు ఉన్న రుణాల‌ను ఏక కాలంలో మాఫీ చేయాల‌ని చూస్తోంది ప్రభుత్వం. పార్లమెంట్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జరిగిన ఎన్నికల ప్రచార స‌భ‌ల్లో రుణ‌మాఫీ చేసి తీరుతామ‌ని దేవుళ్లపై ప్రమాణాలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నిక‌లు ముగియ‌డంతో సీఎం రేవంత్ పూర్తిగా ప‌రిపాల‌న‌పై ఫోక‌స్ పెట్టారు. ముందుగా రైతు రుణమాఫీపై ప్రభుత్వం ముందున్న అవకాశాలను వెతుకుతున్నారు. రుణ‌మాఫీ విష‌యంలో బెట‌ర్ ఆప్షన్ ఏంట‌నే దానిపై అధికారుల‌తో సీఎం స‌మీక్షించారు.

లక్ష రూపాయల రుణమాఫీ చేసిన కేసీఆర్..
గ‌తంలో రుణమాఫీపై అవలంబించిన విధానాలపై అధ్యయనం చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హ‌యాంలో ఏకకాలంలో రైతురుణాల‌ను మాఫీ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వమే రుణాల‌ను మాఫీ చేయ‌డంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం ప‌డ‌లేదు. రెగ్యుల‌ర్‌ రుణాల‌ను రెన్యువ‌ల్ చేసిన రైతుల‌కు ప్రొత్సాహ‌కంగా రాష్ట్ర ప్రభుత్వం స‌హాయం చేసింది. ఇక రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ల‌క్ష రూపాలయ‌ల రుణ‌మాఫీని కేసీఆర్ ప్రభుత్వం మొద‌టి ట‌ర్మ్‌లో అమ‌లు చేసింది.

ల‌క్ష రూపాయ‌ల రుణాల‌ను నాలుగు భాగాలుగా విభజన..
ల‌క్ష రూపాయ‌ల రుణాల‌ను నాలుగు భాగాలుగా విభ‌జించి ప్రతి ఏటా 25 వేల రుణాల‌ను ప్రభుత్వం మాఫీ చేసింది. మొద‌టి ట‌ర్మ్‌లో తెలంగాణ‌లో 35.31 ల‌క్షల మంది రైతుల‌కు 16 వేల 144 కోట్ల రూపాయ‌లు మాఫీ అయ్యాయి. ఇక రెండో ట‌ర్మ్‌లో కేసీఆర్ ప్రభుత్వం ల‌క్ష రూపాయ‌ల హామీ ఇచ్చినా.. పూర్తిస్థాయిలో అమ‌లు కాలేదు. రెండో ట‌ర్మ్‌లో 22 ల‌క్షల 98 వేల మంది రైతుల‌కు 13 వేల కోట్ల రూపాయ‌లు మాఫీ అయ్యాయి. ఇంకా 19 వేల 440 కోట్ల రూపాయ‌లు పెండింగ్‌లోనే ఉండిపోయింది.

ప్రభుత్వానికి ఆర్థికవేత్తల వార్నింగ్..
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2ల‌క్షల వ‌ర‌కు రుణాల‌ను మాఫీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. రెండు ల‌క్షల వ‌ర‌కు రుణాలు మాఫీ చేయాలంటే దాదాపు 40 వేల కోట్ల రూపాయలు నిధులు సమీకరించాల్సి వుంటుంది. ఇంత భారీ ఎత్తున రుణం మాఫీ చేయాలంటే అనేక చిక్కులు, మరెన్నో స‌వాళ్లను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఇచ్చిన మాట ప్రకారం రుణాల‌న్నింటిని ఏకకాలంలోనే మాఫీ చేయాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి, ప్రభుత్వం నుంచి ప్రతి నెల ఈఎంఐ ప‌ద్ధతిలో బ్యాంకుల‌కు చెల్లించాల‌నే ఆలోచ‌న చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్ కు సహకరిస్తుందా?
ఐతే కార్పొరేష‌న్ ద్వారా రుణాలను మాఫీ చేయాలంటే స‌ద‌రు సంస్థకు ఆదాయ మార్గం చూపించాల్సి వుంటుంది. ఆదాయం ఉన్న సంస్థలకే రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు కాళేశ్వరం వంటి ప్రాజెక్టుకు బ్యాంకులు 60 వేల కోట్ల రుణాలు ఇచ్చాయంటే.. స‌ద‌రు ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం ఆదాయం చూప‌గ‌లిగింది. పంట‌ల‌కు నీరు ఇవ్వడంతో పాటు ప‌రిశ్రమ‌ల‌కు.. మిష‌న్ భ‌గీర‌థ ద్వారా తాగునీటి వంటి అంశాల‌ను ప్రస్తావించింది. ఇప్పుడు రుణాల కోసం ఏర్పాటు చేసే కార్పొరేష‌న్ నుంచి ఎలాంటి ఆదాయం వస్తుందని చూపుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీట‌న్నింటికి తోడు భారీ మొత్తంలో రుణాలు మాఫీ చేయాలంటే రిజ‌ర్వు బ్యాంకుతో పాటు కేంద్ర ఆర్థికశాఖ అనుమతి పొందాల్సి వుంటుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

 

ట్రెండింగ్ వార్తలు