Gudem Mahipal Reddy: అనుకున్నది ఒక్కటి, అయిందొక్కటి..! ఎమ్మెల్యే గూడెంకు ఎంత కష్టమొచ్చే..! ఆయన కష్టాలకు కారణాలేంటి..?
ఇదంతా అధికారులే చేస్తున్నారా? లేదా వచ్చే మంత్రులే ఎమ్మెల్యే అవసరం లేదని చెపుతున్నారా? అధికారులపై లోకల్ లీడర్ల ప్రెజర్ ఏమైనా ఉందా?
Gudem Mahipal Reddy: ఒకప్పుడు ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. బీఆర్ఎస్ హయాంలో ఆ నియోజకవర్గంలో ఆయన హవానే వేరు. ఆయన ఎంత చెప్తే అంత అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడింది. తాను గెలిచినా తన పవర్ తగ్గినట్లు అర్థమైంది. దీంతో ఆ ఎమ్మెల్యే కారు దిగి హస్తం గూటికి చేరిపోయారు. అయితే తాను అనుకున్నది ఒక్కటి ..అయిందొక్కటి అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అటు కాంగ్రెస్ నేతలు పిలవరు. ఇటు బీఆర్ఎస్ నేతలతో కలిసి పనిచేయలేరు. చివరకు తన నియోజకవర్గానికి మంత్రులు వచ్చినా ఎమ్మెల్యేకు ఇన్విటేషన్ ఉండట్లేదట. ఇంతకు ఎవరా ఎమ్మెల్యే? ఆయన కష్టాలకు కారణాలేంటి?
కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్..
పటాన్ చెరు నియోజకవర్గంలో ప్రొటోకాల్ రగడ నడుస్తోంది. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారట. అధికారిక కార్యక్రమమైనా..కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ అయినా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని పట్టించుకునే వాళ్లే లేరట. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం..కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కారు దిగి హస్తం గూటికి చేరారు. అయితే గూడెం చేరికపై పటాన్ చెరు లోకల్ లీడర్లు, నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ముందు నుంచి తమ నిరసన గళం వినిపిస్తున్నారు. అటు ఓటమి చెందిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధుతోనూ బీఆర్ఎస్ లో ఉన్నప్పటి నుండే విబేధాలున్నాయి. దీంతో నియోజకవర్గంలో కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్ అన్నట్లుగా ఎమ్మెల్యే వర్గం, లోకల్ లీడర్లు చీలిపోయి రోడ్డెక్కి రచ్చ చేశారు. ఆ పంచాయితీ పార్టీ క్రమశిక్షణా కమిటీకి కూడా చేరింది. ఔట్ పుట్ ఏంటో ఇంకా తెలియదు కానీ.. పటాన్ చెరు కాంగ్రెస్ రచ్చ నడుస్తూనే ఉంది.
అయితే స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మంత్రులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారట. ఇటీవల కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో రూ.10 కోట్లతో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణానికి వీఎస్టీ అనే సంస్థ సీఎస్ఆర్ ప్రాజెక్టు కింద ముందుకు వచ్చింది. ఈ విషయంపై అధికారులు ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వలేదట. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యవేక్షణలో హౌసింగ్, మున్సిపల్, రెవెన్యూశాఖల అధికారులతో కలిసి నిర్మాణ పనులపై సమావేశాలు పెట్టారట. కలెక్టర్ ప్రావీణ్య, హౌసింగ్ ఎండీ గౌతమ్ కొల్లూరులో పర్యటించి ఈ పనులకు మంత్రులతో శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఆ సమయంలో కూడా అధికారులు ఎమ్మెల్యే గూడెంకు కనీస సమాచారం అందించలేదట.
ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్యేకి నో ఇన్విటేషన్..
ఇక ప్రారంభోత్సవానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, దామోదర్ రాజనర్సింహ వస్తున్నారంటూ అధికారులు ప్రకటించి ఆహ్వాన పత్రికలు పంచేశారు. ఇక చివరి క్షణంలో డీఈవో వెంకటేశ్వర్లు ద్వారా తనకు సమాచారం అందించారని ఎమ్మెల్యే గూడెం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. దీంతో మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారట ఎమ్మెల్యే. గతంలోనూ అమీన్ పూర్ మున్సిపల్ పరిధి కిష్టారెడ్డిపేటలో ఎక్సైజ్ కార్యాలయం శంకుస్థాపనకు మంత్రులు దామోదర్, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావును ఆహ్వానించగా ప్రొటోకాల్ పై ఎమ్మెల్యే నిలదీయడంతో అప్పటి కలెక్టర్ క్రాంతి కార్యక్రమాన్ని రద్దు చేశారు. సుల్తాన్ పూర్ మెడికల్ డివైజ్ పార్కు, రుద్రారం తోషిబా పరిశ్రమ ప్రారంభం వంటి సందర్భాల్లో కూడా ప్రోటోకాల్ పాటించకపోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారులే చేస్తున్నారా? మంత్రులే ఎమ్మెల్యే అవసరం లేదంటున్నారా?
వరుసగా ప్రభుత్వ కార్యక్రమాలకు తనకు ఇన్విటేషన్ లేకపోవడంపై ఎమ్మెల్యే గుర్రుగానే ఉన్నారట. తన నియోజకవర్గంలో పనులపై తనకు ఏ సమాచారం లేకుండా అన్నీ అధికారులే నిర్వహిస్తూ చివరి క్షణంలో తనను రమ్మంటూ ఆహ్వానం పంపడంపై రుసరుసలాడుతున్నారట. ఇదంతా అధికారులే చేస్తున్నారా? లేదా వచ్చే మంత్రులే ఎమ్మెల్యే అవసరం లేదని చెపుతున్నారా? అధికారులపై లోకల్ లీడర్ల ప్రెజర్ ఏమైనా ఉందా? అన్నదానిపై క్లారిటీ వచ్చాక మీడియా ముందుకు వస్తానని గూడెం ఊగిపోతున్నారట. తనను ఇంతగా అవమానించడం ఏంటని అనుచరుల దగ్గర గూడెం బాధపడ్డట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం ఎమ్మెల్యేకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నామని, ప్రోటోకాల్ ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా పటాన్ చెరులో ఎమ్మెల్యే ప్రోటోకాల్ రగడ చర్చనీయాంశంగా మారింది.
