Nominated Posts : జూన్ 4 తర్వాత.. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు..!

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.

Nominated Posts : సార్వత్రిక సమరం ముగియడంతో ఇప్పుడు అంతా స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవులపై ఫోకస్‌ పెడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిమందికి నామినేటేడ్‌ పదవులు వరించినా, ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులు చాలానే ఉండటం.. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ద్వితీయ, తృతీయశ్రేణి నేతలు పదవుల కోసం తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు..
పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలామంది గ్రామ, మండలస్థాయి నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లగా, పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కూడా రాజకీయ వలసలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య ముక్కోణ పోటీ జరుగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాల తర్వాత ఏవైనా రెండు పార్టీల మధ్యే ఆధిపత్య పోరు కొనసాగనున్నందనే విశ్లేషణలు ఉన్నాయి.

రాజకీయ భవిష్యత్‌ కోసం బలమైన పార్టీలోకి వలసలు..
దీంతో గ్రామ, మండల స్థాయి నేతలు తమ రాజకీయ భవిష్యత్‌ కోసం బలమైన పార్టీని ఎంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో ఆ పార్టీ నుంచి ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్‌, బీజేపీల్లో అత్యధిక స్థానాలు దక్కించుకునే పార్టీలోకి మిగిలిన పార్టీ నుంచి వలస పెరిగే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ భిన్నమే..
తెలంగాణలో గ్రామ పంచాయతీల పదవీకాలం నాలుగు నెలల క్రితమే పూర్తయింది. వచ్చే నెలలో మండల, జిల్లా పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం పూర్తికానుంది. దీంతో కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో గెలుపు అవకాశాలు ఉన్న పార్టీలను ఎంచుకుని ఆయా పార్టీల్లోకి వలస వెళ్లేందుకు గ్రామ, మండలస్థాయి లీడర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి స్థానిక సంస్థల్లో గెలిచే అవకాశాలు కాస్త మెండుగా ఉంటాయి. కానీ, తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయని గత ఫలితాలు తెలియజేస్తున్నాయి.

ఆసక్తి రేపుతున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు..
రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నా, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. దీంతో మూడు పార్టీల లీడర్లు పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేని వారు, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీకి అవకాశం దక్కని వారు నామినేటెడ్‌ పదవులపై ఆశలు పెట్టుకుంటున్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో చాంపియన్‌గా నిలిచే పార్టీకే ఎక్కువ మంది జైకొట్టే పరిస్థితి..
మొత్తానికి తెలంగాణలో రాజకీయ వలసకు ఇప్పుడప్పుడే బ్రేక్‌ పడేలా కనిపించడం లేదు. స్థానిక ఎన్నికలు ముగిసేవరకు నేతల జంపింగ్‌లు కొనసాగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఐతే లోక్‌సభ ఎన్నికల్లో చాంపియన్‌గా నిలిచే పార్టీకే ఎక్కువ మంది నేతలు జైకొట్టే పరిస్థితి ఉన్నందున… జూన్‌ 4 తర్వాత రాష్ట్రంలో ఏం జరగనుందనే ఉత్కంఠ రోజురోజుకు ఎక్కువవుతోంది.

Also Read : రైతు రుణమాఫీ ఎలా? సీఎం రేవంత్ ముందు బిగ్ టాస్క్, ప్రభుత్వం ముందున్న ఆప్షన్స్ ఏంటి?

ట్రెండింగ్ వార్తలు