Khammam Assembly Constituency: రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి.. ఆ ముగ్గురు పోటీ చేస్తే..?

Khammam Assembly Constituency: సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారా? లేక.. మారిన రాజకీయ సమీకరణాలతో.. ఖమ్మంలో కొత్త జెండా ఎగురుతుందా? విపక్ష పార్టీల నుంచి బరిలోకి దిగేదెవరు?

Khammam Assembly Constituency: 2018 ఎన్నికల్లో.. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ గెలిచిన ఏకైక అసెంబ్లీ సీటు అది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. జిల్లాలో ఎవరి నోటా విన్నా.. ఆ ఖమ్మం సెగ్మెంట్ గురించే చర్చ జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్.. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతారా? లేక.. మారిన రాజకీయ సమీకరణాలతో.. ఖమ్మంలో కొత్త జెండా ఎగురుతుందా? విపక్ష పార్టీల నుంచి బరిలోకి దిగేదెవరు? దిగినా.. అధికార పార్టీ అభ్యర్థిని ఎదుర్కోగల సత్తా వాళ్ల దగ్గరుందా? ఇదే.. ఖమ్మం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. మరి.. రాబోయే ఎన్నికల్లో.. ఖమ్మం గుమ్మంలో కనిపించబోయే సీనేంటి?

ఖమ్మం.. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గానికి.. 15 సార్లు ఎన్నికలు జరిగితే.. అందులో 10 సార్లు వామపక్షాలకు చెందిన అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అలాంటి ఖమ్మంలో.. 2009 నుంచి సీన్ మారింది. ఆ ఎన్నికల్లో.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో.. సిట్టింగ్ ఎమ్మెల్యే తుమ్మలపై.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పువ్వాడ అజయ్ కుమార్ గెలుపొందారు. తర్వాత.. తుమ్మల టీడీపీకి గుడ్ బై చెప్పి.. కారెక్కేశారు. ఆయనకు.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మరీ.. మంత్రి వర్గంలో చేర్చుకున్నారు సీఎం కేసీఆర్. తర్వాత.. తుమ్మల పాలేరు బైపోల్ బరిలో దిగి గెలిచారు. మారిన రాజకీయ పరిస్థితులతో.. ఖమ్మంలో గెలిచిన పువ్వాడ సైతం కాంగ్రెస్‌కు టాటా చెప్పి.. గులాబీ కండువా కప్పేసుకున్నారు.

Also Read: ఆసియాలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గంపై దేశమంతా ఆసక్తి.. మల్కాజ్ గిరిపై పట్టుకోసం రాజకీయపార్టీల ప్రయత్నాలు

ఇక.. 2018 ఎన్నికల విషయానికొస్తే.. రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ వేవ్ వీస్తే.. ఒక్క ఖమ్మం జిల్లాలో మాత్రమే విలక్షణమైన తీర్పు వచ్చింది. ముఖ్యంగా.. ఖమ్మంలో టీడీపీ నుంచి బరిలోకి దిగిన నామా నాగేశ్వరరావుపై.. పువ్వాడ అజయ్ గెలుపొందారు. జిల్లా మొత్తంలో.. బీఆర్ఎస్ గెలిచిన ఏకైక సీటు ఒక్క ఖమ్మం మాత్రమే. దాంతో.. పువ్వాడ అజయ్‌కి మంత్రి పదవి దక్కింది. ఆయన.. రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఇక.. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నదే.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం.. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో ఖమ్మం పట్టణం, అర్బన్ మండలంతో పాటు కొత్తగా ఏర్పాటైన రఘునాథపాలెం మండలం వచ్చి చేరింది. గతంలో బలంగా ఉన్న వామపక్షాలు.. నియోజకవర్గంలో బలహీనపడ్డాయ్. టీడీపీ అయితే.. ఉనికిలోనే లేకుండా పోయింది. దాంతో.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, రఘునాథపాలెం మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో.. గులాబీ పార్టీ తిరుగులేని విజయం సాధించింది.


పువ్వాడ అజయ్ చరిత్ర సృష్టిస్తారా?

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. ఖమ్మం నుంచి ఈసారి ఎవరెవరు బరిలో ఉండబోతున్నారన్న దానిపై లోకల్‌గా పెద్ద చర్చే నడుస్తోంది. ఇప్పటికే.. వరుసగా రెండుసార్లు గెలిచిన పువ్వాడ అజయ్‌కే.. బీఆర్ఎస్ టికెట్ ఇస్తుందని.. పార్టీ కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. స్థానికంగా ఆయనకు ఉన్న మంచిపేరు, ఖమ్మంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నీ.. పువ్వాడకు మంచిపేరును తెచ్చిపెట్టాయ్. దాంతో.. ఈసారి కూడా బరిలోకి దిగి.. ఖమ్మంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కొత్త రికార్డు సృష్టించాలని చూస్తున్నారు. ఎందుకంటే.. ఇప్పటివరకు ఖమ్మం నియోజకవర్గంలో వరుసగా 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒక్కరు కూడా లేరు. అందువల్ల.. ముచ్చటగా మూడోసారి కూడా గెలిచి.. ఖమ్మం నియోజకవర్గంలో చరిత్ర సృష్టించాలనే ధృడ నిశ్చయంతో ఉన్నారు పువ్వాడ అజయ్.

Also Read: హీటు రేపుతోన్న గుడివాడ అసెంబ్లీ సీటు.. కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్..


రేణుకా చౌదరి బరిలోకి దిగుతారా?

ఖమ్మంలో మిగతా పార్టీలతో పోలిస్తే.. కాస్తో, కూస్తో ప్రభావం చూపే పార్టీగా.. కాంగ్రెస్ కనిపిస్తోంది. అయితే.. హస్తం పార్టీ నుంచి పోటీ చేసేందుకు కూడా పోటీ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తరఫున ఖమ్మం అసెంబ్లీ బరిలోకి దిగేందుకు.. ముగ్గురు నేతలు రేసులో ఉన్నారు. వాళ్లలో.. ఎవరికి టికెట్ దక్కుతుంది? ఎన్నికల బరిలో ఎవరుంటారనేది.. ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే.. పోటీ పడుతున్న ముగ్గురిలో.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రధాన అనుచరుడు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జావీద్ ఉన్నారు. అలాగే.. కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత రేణుకా చౌదరి అనుచరుడు.. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్.. మానుకొండ రాధాకిశోర్ కూడా కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే.. రేణుకా చౌదరి ఖమ్మంలో క్యాంప్ ఆఫీసును కూడా ప్రారంభించారు. నియోజకవర్గంలో.. రేణుకకు బలమైన క్యాడర్ లేదనే చర్చ జరుగుతోంది. దీనికితోడు.. భట్టి విక్రమార్కకు, రేణుకా చౌదరికి మధ్య గ్రూపు తగాదాలున్నాయి. తాను గానీ తన అనుచరుడు రాధా కిశోర్‌ని గానీ బరిలోకి దించేందుకు.. రేణుకా చౌదరి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. తనను ఏపీలో పోటీ చేయాలని కోరారంటూ.. ఇటీవల ప్రకటించారు రేణుక. దాంతో.. ఆవిడ అసెంబ్లీ బరిలో దిగుతారా? లోక్‌సభకు పోటీ చేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. ఒకవేళ..ఎంపీగా పోటీ చేసినా.. ఏపీ నుంచి బరిలోకి దిగుతారా? లేక.. తెలంగాణ నుంచే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇక.. భట్టి విక్రమార్క అనుచరుడు మహ్మాద్ జావీద్ ఖమ్మంలో.. ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. జనంలో తిరుగుతున్నారు. క్యాడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. కానీ.. ఖమ్మం బరిలో కాంగ్రెస్ తరఫున రేణుకా చౌదరి బరిలోకి దిగితే మాత్రం.. ఈ సీటులో.. పొలిటికల్ హీటు అమాంతం పెరిగిపోతుంది.


యాక్టివ్‌గా కనిపిస్తోన్న బీజేపీ

ఈ మధ్యకాలంలో ఖమ్మంలో బీజేపీ కూడా ఫుల్ యాక్టివ్‌గా కనిపిస్తోంది. వరుస ఆందోళనలు, పోరాటాలతో.. జనంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు కాషాయం పార్టీ నేతలు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో తొలిసారి.. ఆ పార్టీ తరఫున ఓ కార్పొరేటర్ విజయం సాధించారు. అతను తప్ప.. నియోజకవర్గంలో బీజేపీకి ఒక్క ప్రజాప్రతినిధి కూడా లేరు. కేవలం.. ఖమ్మం జిల్లా కేంద్రంలో మాత్రమే బలం పెంచుకునేందుకు.. బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు గెల్లా సత్యనారాయణ బీజేపీ నుంచి ఖమ్మం బరిలో నిలిచే అవకాశం ఉంది. అయితే.. గతంలో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఉప్పల శారద కూడా మరోసారి టికెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీళ్లిద్దరిలో.. ఎవరికి టికెట్ దక్కుతుంది.. అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉంటాయన్నది.. ఆసక్తిగా మారింది.


ఖమ్మం బరిలో పొంగులేటి?

మరోవైపు.. బీఆర్ఎస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసిన.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం.. ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలుస్తారనే ప్రచారం జోరందుకుంది. అదే గనక నిజమైతే.. ఖమ్మంలో పొలిటికల్ టెంపరేచర్ అమాంతం పెరిగిపోతుంది. ఎందుకంటే.. ఖమ్మం జిల్లాలో కేవలం 3 నియోజకవర్గాలు మాత్రమే జనరల్ స్థానాలుగా ఉన్నాయి. ఇప్పటికే.. పాలేరు నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తానని ప్రకటించేశారు. దాంతో.. వైఎస్ కుటుంబంతో సన్నిహిత సంబంధాలున్న పొంగులేటి.. ఖమ్మం గానీ, కొత్తగూడెం నుంచి గానీ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న సమాచారం ఉంది. ఒకవేళ.. పొంగులేటి శ్రీనివాస రెడ్డి.. కొత్తగూడెం నుంచి బరిలోకి దిగితే.. ఖమ్మంలో ఆయన వర్గం నుంచి డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబును పోటీ చేయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.


ఆ ముగ్గురు పోటీ చేస్తే…

ఖమ్మం బరిలో గనక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున రేణుకా చౌదరి గనక బరిలోకి దిగితే.. మంత్రి పువ్వాడ అజయ్‌కి గట్టి పోటీ తప్పకపోవచ్చు. ఈ ముగ్గురు గనక ఖమ్మం పోటీలో ఉంటే.. జిల్లా మొత్తంలో.. అదే హాట్ సీటుగా మారుతుంది. రాష్ట్రం రాజకీయ వర్గాలన్నీ.. ఖమ్మం అసెంబ్లీపైనా ఓ కన్నేసి ఉంచుతాయి. ఒకవేళ.. పొంగులేటి, రేణుకా చౌదరి.. వేరే నియోజకవర్గాల్లో బరిలోకి దిగితే మాత్రం.. పువ్వాడ విజయానికి లైన్ క్లియర్ అయినట్లేననే టాక్ వినిపిస్తోంది. మిగతా పార్టీ నుంచి బరిలోకి దిగే వాళ్లకు.. పువ్వాడను ఎదుర్కొనేంత బలం లేదని.. స్థానికంగా చర్చ జరుగుతోంది.

ట్రెండింగ్ వార్తలు