Khanapur Constituency: ఖానాపూర్ బీఆర్ఎస్ టిక్కెట్ కు బహుముఖ పోటీ.. ఎవరికి దక్కేనో?

ఖానాపూర్ రాజకీయం హాట్‌హాట్‌గా మారుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ పోటీ పీక్స్‌కు చేరుతుండటం.. ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో బీఆర్‌ఎస్ అధిష్టానం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది.

Khanapur Assembly Constituency Ground Report

Khanapur Assembly Constituency: ఎన్నికలు దగ్గరవుతున్న వేళ.. ఖానాపూర్ రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్‌ (Rekha Nayak)కు వ్యతిరేకంగా ఏకంగా ఆరుగురు నేతలు టిక్కట్ కోసం ట్రై చేస్తుండటం హీట్ పెంచుతోంది. కాంగ్రెస్‌లోనూ దాదాపు అంతే సంఖ్యలో నేతలు పోటీకి తహతహలాడుతున్నారు. బీజేపీలో మాత్రం రాథోడ్ రమేశ్ (Ramesh Rathod) ఒక్కరే మళ్లీ పోటీకి రెడీ అవుతున్నారు. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య లోకల్.. నాన్‌లోకల్ పోటీ పెరిగిపోతోంది.. ఈ పోటీలో నెగ్గేదెవరు? టిక్కెట్ దక్కించుకుని తుది పోరుకు రెడీ అయ్యేదెవరు? ఖానాపూర్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

నిర్మల్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం మూడు జిల్లాల పరిధిలోకి వస్తోంది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఏడు మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 లక్షల ఓటర్లు ఉండగా.. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ భారీ మెజార్జీతో గెలిచింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గానికి 11 సార్లు ఎన్నికలు జరగగా.. 4 సార్లు టీడీపీ గెలిచింది. మూడుసార్లు బీఆర్ఎస్, మరో 3 సార్లు కాంగ్రెస్, ఒకసారి ఇండిపెండెంట్ గెలిచారు.

Ajmeera Rekha Nayak

ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ఈ సారి ఆమెకు పరిస్థితులు అంత సానుకూలంగా కనిపిండం లేదు. క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే.. ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ, ఆమెపై వ్యతిరేకత మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేపై ఆరోపణలు చేస్తుండటం మైనస్‌గా మారుతోంది. అంతేకాకుండా పార్టీలో ముఖ్య నాయకులు రేఖానాయక్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంతసేపూ కమీషన్లపై ఫోకస్ పెట్టే ఎమ్మెల్యే అభివృద్ధిపై అస్సలు దృష్టిపెట్టడం లేదని బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. కమీషన్లు లేనిదే కొబ్బరికాయలు కూడా కొట్టరనే అపవాదు మూటగట్టుకున్నారు ఎమ్మెల్యే. దీంతో ఆమెకు ప్రత్యమ్నాయాలను అన్వేషిస్తోంది బీఆర్‌ఎస్. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈ సారి టికెట్ ఇవ్వబోమని సీఎం కేసీఆర్ ఇటీవల స్పష్టం చేయడంతో.. రేఖానాయక్‌ను తప్పిస్తారనే టాక్ మరింత పెరిగిపోయింది. అయినప్పటికీ గత రెండు సార్లు ఘన విజయం సాధించిన తాను కచ్చితంగా టిక్కెట్ తెచ్చుకుంటానని.. హ్యాట్రిక్ కొడతానని ధీమాగా ఉన్నారు ఎమ్మెల్యే..

టిక్కెట్ వస్తుందన్న ధీమాగా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యేకు లోలోన మాత్రం గుబులు ఎక్కువైందని చెబుతున్నాయి బీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు.. ఎమ్మెల్యే, ఆమె భర్త రిటైర్డ్ రవాణా అధికారి శ్యామ్‌నాయక్‌పై తీవ్ర ఆరోపణలు ఉండటంతో.. ఈ సారి రేఖానాయక్‌ను తప్పించాలనే నిర్ణాయానికి అధిష్టానం వచ్చిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడి నుంచి పోటీకి ఏకంగా ఐదుగురు కొత్తవారు ప్రయత్నిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మంత్రి కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయనతోపాటు ఎంపీ సంతోష్ సన్నిహితుడు పూర్ణ చందర్, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యే రేఖానాయక్ భర్త శ్యాంనాయక్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మన్ నాయక్ బీఆర్‌ఎస్ నుంచి పోటీకి తహతహలాడుతున్నారు. ఎవరికి వారే టిక్కెట్ కోసం ప్రయత్నించడంతోపాటు నియోజకవర్గంలోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు.

Bhukya Johnson Nayak

అయితే ఆశావహుల్లో ఎక్కువగా జాన్సన్ నాయక్‌ (Johnson Nayak)కే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ క్లాస్‌మేట్ అయిన జాన్సన్ ఆర్థికంగా కూడా స్థితిమంతుడు. అమెరికాలో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉన్న జాన్సన్.. గతంలో ఆదిలాబాద్ ఎంపీగా పోటీకి ప్రయత్నించారు. చివరి నిమిషంలో చాన్స్ మిస్ అవ్వడంతో ఈ సారి ఖానాపూర్ నుంచి బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఆర్నెళ్లుగా ఖానాపూర్లో పర్యటిస్తూ క్యాడర్‌కు టచ్‌లో ఉంటున్నారు. ఎమ్మెల్యే రేఖానాయక్ సైతం జాన్సన్‌కు ఉన్న అవకాశాలను సందేహిస్తూ.. ఆయనతో సత్ససంబంధాలే కొనసాగిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యే రేఖానాయక్, జాన్సన్ ఓ కార్యక్రమంలో ఎదురుపడిన సందర్భంలో జాన్సన్ వేరే దగ్గర నుంచి పోటీ చేస్తారని ఎమ్మెల్యే చెప్పడం.. ఆమెలో భయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. ఆర్థిక అంగబాలాలు సమృద్ధిగా ఉన్న జాన్సన్‌పై క్యాడర్ కూడా సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇక గ్రీన్ ఇండియా చాలెంజ్ డైరెక్టర్ పూర్ణచందర్ ఎంపీ సంతోష్‌కు సన్నిహితుడుగా చెబుతున్నారు. ఖానాపూర్, ఉట్నూర్, ఇంద్రవెళ్లిలో కార్యాలయాలు ప్రారంభించి.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. హైదరబాద్ రిటైర్డ్ కలెక్టర్ శర్మన్ నాయక్, ఎమ్మెల్యే భర్త శ్యాంనాయక్ కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. మరోవైపు నుంచి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ సైతం ఖానాపూర్ టికెట్ పై కన్నేశారు. సమయం దొరికినప్పుడల్లా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు జనార్దన్ రాథోడ్. ఎన్నికల్లో ఎలా పోటీ ఇస్తారోగాని ప్రస్తుతానికైతే టిక్కెట్ కోసం మాత్రం చాలా పోటీ పడుతున్నారు బీఆర్‌ఎస్ నేతలు.

Ramesh Rathod

అధికార బీఆర్‌ఎస్‌లో రాజకీయం ఇలా హాట్‌హాట్‌గా ఉంటే.. ప్రతిపక్షం నుంచి బీజేపీ నేత రమేశ్ రాథోడ్ గట్టిపోటీ ఇచ్చే చాన్స్ కనిపిస్తోంది. రమేశ్ రాథోడ్ బీజేపీలో చేరకముందు వరకు ఈ నియోజవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండేది కానీ.. రమేశ్ రాథోడ్ కమలం గూటికి చేరడం.. ఆయనకు నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఉండటంతో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. గడపగడపకు బీజేపీ కార్యక్రమంతో నియోజకవర్గాన్ని చుట్టేశారు రమేశ్ రాథోడ్. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి చేయలేదని.. ఈసారి తనకు అవకాశం ఇస్తే ఖానాపూర్ రూపురేఖలు మార్చేస్తానని చెబుతున్నారు.

Also Read: యువనేత వ్యూహాలతో మెదక్ ఎమ్మెల్యే పద్మకు నిద్ర కరవు.. ఎవరా యంగ్ లీడర్?

ఒకప్పుడు బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్ ఈ మధ్య కొద్దిగా వెనుకబడినట్లు కనిపిస్తున్నా.. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలతో మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. సంప్రదాయ ఓటు బ్యాంకుతో మళ్లీ ఖానాపూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెబుతున్నారు హస్తం పార్టీ నేతలు.. ఇక్కడి నుంచి పోటీకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఐదుగురు నేతలు టిక్కెట్ ఆశిస్తున్నారు. ప్రధానంగా వెడమ బొజ్జు (Vedama Bojju) అనే నేత టిక్కెట్‌పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గాన్ని తెగ చుట్టేస్టున్న బొజ్జు బీఆర్‌ఎస్‌ను ఓడిస్తామని శపథం చేస్తున్నారు. అయితే ఈయనకు చారులతా రాథోడ్, భరత్ చౌహాన్, పెందూర్ ప్రభాకర్, పుర్క బాపురావ్ నుంచి పోటీ ఎదురవుతోంది.

Also Read: హాట్ హాట్‌గా జుక్కల్ పాలిటిక్స్.. ట్రయాంగిల్ ఫైట్ లో నిలిచేదెవరు.. పైచేయి ఎవరిది?

ఇలా ఖానాపూర్ రాజకీయం హాట్‌హాట్‌గా మారుతోంది. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో టిక్కెట్ పోటీ పీక్స్‌కు చేరుతుండటం.. ఎమ్మెల్యేపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండటంతో బీఆర్‌ఎస్ అధిష్టానం ఏం చేస్తుందనేది ఉత్కంఠగా మారింది. అధికార బీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేది బీజేపీయా లేక కాంగ్రెస్సా అన్న చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. బీజేపీ నేత రాథోడ్ రమేశ్‌కు వ్యక్తిగత ఇమేజ్ ఉండటం.. గతంలో ఎంపీగా.. జడ్‌పీ చైర్మన్‌గా ఆయన పనిచేసి ఉండటంతో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని చెబుతున్నారు పరిశీలకులు.

ట్రెండింగ్ వార్తలు