Tandur Politics: ఆసక్తికరంగా తాండూరు రాజకీయం.. ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు!

పదేళ్ల క్రితం ఒకే గొడుగు కింద ఉన్న ముగ్గురు.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున ప్రత్యర్థులుగా మారతారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది.

Tandur Leaders

Tandur Politics: ఆ ముగ్గురు ఒకప్పుడు మిత్రులు.. ఒకే పార్టీలో దోస్త్ మేరా దోస్త్ అంటూ రాజకీయం నెరిపారు.. కట్ చేస్తే ఇప్పుడు బద్ధ శత్రువులు.. ఒకరంటే ఒకరికి గిట్టదు.. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు. శత్రువులుగా మారిన ఒకనాటి స్నేహితుల మధ్య రాజకీయం ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇంతకీ ఎవరా స్నేహితులు.. ఎందుకీ శత్రుత్వం.. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారు?

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తాండూరు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో ముగ్గురు ముఖ్యమైన నేతల మధ్య పోటీ జరగనుందనే అంచనాలు పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) మరోసారి బీఆర్‌ఎస్ (BRS Party) అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమని చెబుతుండగా.. ఆయనపై ప్రత్యర్థులుగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy), మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (Konda Vishweshwar Reddy) పోటీ చేయనున్నారనే సమాచారం హీట్ పుట్టిస్తుంది. ప్రస్తుతానికి రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి ఒకే పార్టీలో ఉన్నా.. ఎన్నికల నాటికి ఇద్దరూ ప్రత్యర్థులుగా మారతారని పరిశీలకుల అంచనా.

ఉమ్మడి జిల్లాలో కీలక నేతలుగా ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి రాజకీయం నడిపారు. ఈ ఇద్దరికి అత్యంత సన్నిహితుడిగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కొనసాగారు. 2014లో వీరు ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి బీఆర్‌ఎస్ త‌ర‌ఫున తాండూరులో పోటీ చేసి గెలుపొందారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆ ఎన్నికల్లో చేవళ్ల పార్లమెంట్‌ సభ్యునిగా విజయం సాధించారు. ఈ ఇద్దరు నేతలకు అండగా నిలిచిన పైలెట్ రోహిత్ రెడ్డి.. వారి గెలుపులో కీలకపాత్ర పోషించారు. అయితే ఎన్నికల తర్వాత మహేందర్‌రెడ్డితో రోహిత్‌రెడ్డికి విభేదాలు తలెత్తడంతో ఆయనకు దూరంగా జరిగారు. అప్పట్లో మంత్రిగా మహేందర్‌రెడ్డి చక్రం తిప్పడంతో రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోయారు. అదేసమయంలో అప్పటి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కూడా బీఆర్‌ఎస్‌తో తగవు తెచ్చుకోని రోహిత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరిపోయారు.

Also Read: బీఆర్‌ఎస్‌లో హీట్ పుట్టిస్తున్న తాండూరు పాలిటిక్స్.. కాంగ్రెస్, బీజేపీ ప్లానేంటి?

ఇలా విశ్వేశ్వర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి గులాబీ పార్టీని వీడగా, రోహిత్‌రెడ్డి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీచేసిన విశ్వేశ్వర్‌రెడ్డి ఓటమి చవిచూశారు. ఆ తర్వాత రోహిత్‌రెడ్డి మళ్లీ బీఆర్‌ఎస్‌లో చేరిపోగా, విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీ బాట పట్టారు. ఇలా ఒకప్పుడు ఒకే పార్టీలో ఉన్న ముగ్గురు నేతలు.. 2019 ఎన్నికల తర్వాత విడిపోగా.. రోహిత్‌రెడ్డి పునరాగమనాన్ని జీర్ణించుకోలేని మహేందర్‌రెడ్డి అప్పటి నుంచి గ్యాప్ మెంటైయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపించడంతో తన భవిష్యత్ ఏమిటో తేల్చుకోవాలని నిర్ణయానికి వచ్చారు మహేందర్‌రెడ్డి.

Also Read: బీఆర్‌ఎస్‌లో వారసుల సందడి.. విశ్రాంతి తీసుకుంటామంటున్న సీనియర్లు.. కుదరదంటున్న కేసీఆర్

బీఆర్‌ఎస్ టిక్కెట్ దక్కకపోతే ప్రత్యామ్నాయం చూసుకోడానికి రెడీ అంటూ ఆ మధ్య లీకులు ఇచ్చారు మహేందర్‌రెడ్డి. కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారం చాలా ఉధృతంగా జరిగినా.. మహేందర్‌రెడ్డి ఖండించకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ చాలా మందిలో అవే అనుమనాలు ఉన్నాయి. బీఆర్‌ఎస్ నుంచి పైలట్ బరిలో దిగితే.. ఆయనకు ప్రత్యర్థిగా మహేందర్‌రెడ్డి హస్తం తరఫున రంగంలోకి దిగుతారని అంటున్నారు. ఇదేసమయంలో వీరిద్దరిపై బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డిని పోటీకి నిలుపుతారనే సమాచారం ఆసక్తి రేకెత్తిస్తోంది.

Also Read: హైదరాబాద్ మెట్రో విస్తరణతో అందుబాటు ధరల్లో ఇళ్లు.. అదెలాగంటే!

పదేళ్ల క్రితం ఒకే గొడుగు కింద ఉన్న ముగ్గురు.. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున ప్రత్యర్థులుగా మారతారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అడుగులు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా రాజకీయాలను శాసించిన మహేందర్‌రెడ్డి.. టిక్కెట్ కోసం వేరే పార్టీలోకి వెళ్లనున్నారనే ప్రచారం హీట్‌పుట్టిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు