Tummala Nageswara Rao: కాంగ్రెస్‌లోకి తుమ్మల..! సెప్టెంబర్ రెండోవారంలో రాహుల్ సమక్షంలో చేరే అవకాశం ..

సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ లేదా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి

Tummala: తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే అధికార బీఆర్‌ఎస్ పార్టీ 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులనుసైతం ప్రకటించింది. ఈ క్రమంలో టికెట్ దక్కని ఆశావహులు పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. అయితే, పార్టీ అధిష్టానం వీరిని బుజ్జగించే పనిలో నిమగ్నమైంది. కానీ, కొందరు బీఆర్‌ఎస్‌ను వీడగా.. మరికొందరు పార్టీ మారేయోచనలో ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా నేత తుమ్మల నాగేశ్వరరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మల పాలేరు నియోజకవర్గం టికెట్‌ను ఆశించారు. కానీ, తుమ్మలకు కాకుండా గతం ఎన్నికల్లో పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించి, ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీలో చేరిన కందాల ఉపేందర్ రెడ్డికే సీఎం కేసీఆర్ పాలేరు టికెట్ కేటాయించారు. దీంతో తుమ్మల, ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Thummanala Nageswaro : బీఆర్ఎస్ అధిష్టానంపై తుమ్మల సీరియస్

బీఆర్ఎస్ పార్టీ తరపున పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేసేందుకు అవకాశం దక్కకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారుతారని ప్రచారం జరుగుతుంది. గత మూడు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ఖమ్మంకు చేరిన తుమ్మలకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. పాలేరు నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని చెప్పారు. అయితే, తుమ్మల ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? వేరే పార్టీ నుంచి బరిలోకి దిగుతారా? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీ నుంచి పాలేరు అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

Tummala Nageswararao : ఖమ్మం జిల్లాతో రాజకీయ అనుబంధాన్ని తెంచుకోవాలనుకున్నా.. కానీ, ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తా : తుమ్మల

తుమ్మలతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు మంతనాలు జరిపినట్లు తెలిసింది. తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలను రాహుల్ గాంధీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రేకి అప్పగించినట్లు సమాచారం. దీంతో తుమ్మలను కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తుమ్మల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే రాష్ట్రంలో దాదాపు 30 నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి తుమ్మలను బరిలోకి దింపాలనే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. తుమ్మల మాత్రం పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసినట్లు సమాచారం.

మరోవైపు ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న తుమ్మల.. పార్టీ మార్పు విషయంపై ప్రస్తావిస్తున్నట్లు తెలిసింది. సెప్టెంబర్ రెండో వారంలో రాహుల్ గాంధీ లేదా మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయి

ట్రెండింగ్ వార్తలు