కంచుకోటలో దయనీయంగా బీఆర్ఎస్.. ఎందుకీ దుస్థితి? తప్పు మీద తప్పులతో పార్టీని కష్టాల్లో నెట్టేస్తున్నదెవరు?

ఆ విషయంలో తమ మాటను అధిష్టానం వినకపోవడమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు.

Gossip Garage : పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థిత్వం ఆ పార్టీలో చిచ్చురేపింది… పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక అసంతృప్తిని బట్టబయలు చేసింది… వరుస తప్పులు చేస్తున్న అధిష్టానం వైఖరి క్యాడర్‌ను నిస్తేజంలోకి నెట్టేసింది. ఉరిమే ఉత్సాహంతో పనిచేసిన వారంతా తాజా రాజకీయాలతో గప్‌చుప్ అయిపోయారు. ఓ నేత డైరెక్షన్‌లోనే అధినేత నిర్ణయాలుంటున్నాయనే అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలను లైట్‌ తీసుకుంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌ కష్టమేనంటూ నిట్టూరుస్తున్నారు. ఒకప్పుడు బీఆర్‌ఎస్‌ కంచుకోటలో తాజా రాజకీయం గందరగోళంగా మారిందట… తప్పు మీద తప్పు చేస్తూ పార్టీని కష్టాల్లో నెట్టేస్తున్నదెవరు?

వరంగల్ జిల్లాలో సేనాధిపతి లేని సేనగా తయారైన బీఆర్ఎస్..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి పూర్తిగా తలకిందులవుతోంది. ఒకప్పుడు వరంగల్‌ను అడ్డాగా చేసుకుని పాలించిన బీఆర్‌ఎస్‌… అధికారం కోల్పోయాక తప్పుల మీద తప్పులు చేస్తోందని ఆ పార్టీ కార్యకర్తలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన నేతలు… అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొందరు కనుమరుగైతే… పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరికొందరు కనిపించకుండా పోయారు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీ సేనాధిపతి లేని సేనగా తయారైందంటున్నారు.

ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి…
ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ లీడర్లు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండటం చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు… ఎన్నికల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొందరు ఇళ్లను విడిచి బయటకు రాకపోగా… మరికొందరు టూర్ల పేరుతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లిపోయారు. దీనితో వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా తయారైంది. తాము అభివృద్ధి చేసినా ఓడిపోయామనే బాధతో కొందరు… తాము చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదనే కోపంతో మరికొందరు బీఆర్‌ఎస్‌ రాజకీయాలకు దూరమవుతున్నట్లు చెబుతున్నారు. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికలకు రాముడెవ్వడో రాకాసుడెవ్వరో తెలియని దానికి ఇప్పటి నుంచి కష్టపడటం ఎందుకన్నట్లు ఉంది బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి…

ఓటమి తర్వాత కనిపించకుండాపోయారు..
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు. ములుగు మినహా జిల్లా అంతా బీఆర్‌ఎస్‌దే ఆధిపత్యం. జిల్లా నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మంత్రులుగా వ్యవహరించారు. వీరికి తోడు పలువురు ఎమ్మెల్సీలుగా జిల్లా నుంచి చెలామణి అయిన నేతలు పార్టీ వైభవాన్ని ఆకాశానికెత్తారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయ పరిణామాలు తలకిందులయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. స్టేషన్ ఘన్ పూర్, జనగామలో మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో జనగామ మినహా మిగిలిన 11 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఇక ఓడిన బీఆర్ఎస్ నేతలు ఎన్నికల తర్వాత నుంచి కనిపించకుండా పోయారు.

గెలవాల్సిన సీటు కోల్పోయామని కేడర్ ఆవేదన..
మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి పట్టు నిలుపుకుందామని కసిగా రెఢీ అయ్యింది క్యాడర్‌. అయితే స్థానిక నేతల అభిప్రాయానికి భిన్నంగా తొలుత కడియం కావ్యకు టికెట్‌ ఇవ్వడం, టికెట్‌ ప్రకటన తర్వాత ఆమె పార్టీ మారడం క్యాడర్‌ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసింది. ఈ విషయంలో తమ మాటను అధిష్టానం వినకపోవడమే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటున్నారు. ఇక కడియం కావ్య హ్యాండిచ్చాక.. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్నకు టికెట్ ఇవ్వాలని కేడర్ కోరినా అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలవాల్సిన సీటు కోల్పోయామని బీఆర్‌ఎస్‌ కేడర్‌ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

రాకేశ్ కి టికెట్ ఇవ్వడంతో షాక్..
ఇదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ అభ్యర్థి ఎంపికలో పార్టీ సరైన నిర్ణయం తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఉద్యమకారులు, కేయూ నేపథ్యం ఉన్న నేతలకు టికెట్‌ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వేర్వేరు అభ్యర్థులను సూచించారు. కానీ, అధినేత ఇటీవల పార్టీలో చేరిన ఏనుగుల రాకేశ్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వడం అందరినీ షాక్‌ గురిచేసింది.

ఓటమికి కేసీఆర్, పల్లా తప్పిదమే కారణం..!
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అనుచరుడైన రాకేశ్‌రెడ్డి ఇటీవలే పార్టీలో చేరారు. ఆయనకు టికెట్‌ ఇస్తున్నట్లు అధిష్టానం ప్రకటన ఇచ్చేంతవరకు జిల్లా నేతలెవరికీ ఆ విషయం తెలియదు. దీంతో ఎవరికి వారు ఎమ్మెల్సీ ఎన్నికను లైట్‌గా తీసుకోవడంతో పార్టీ దెబ్బతిన్నది. పార్టీలో కీలక నేతలెవరికీ రాకేశ్‌రెడ్డితో ప్రత్యక్ష పరిచయం లేదు. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం లేదు. దీనితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. సిట్టింగ్ స్థానం చేజారడంలో కేసీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన తప్పిదమేనని అంటున్నారు బీఆర్‌ఎస్‌ నేతలు. పల్లాకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆగ్రహంతో ఉన్న మిగిలిన సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలను లైట్‌ తీసుకుంటుండటం… రోజురోజుకు బీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ను దిగజార్చుతుందంటున్నారు.

Also Read : టాలీవుడ్‌పై సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్‌.. ఆ అనుమానమే కారణమా?

ట్రెండింగ్ వార్తలు