దానం నాగేందర్‌‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? ఇంతకీ బీజేపీ వ్యూహం ఏంటి?

ఆపరేషన్‌ ఖైరతాబాద్‌ పేరిట బీజేపీ పావులు కదుపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీయగా, స్పీకర్‌ నిర్ణయం ఎలా ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది.

Gossip Garage : తెలంగాణలో అధికారమే అజెండాగా పావులు కదుపుతున్న బీజేపీ… ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్‌ఎస్‌ స్థానాన్ని ఆక్రమించాలని చూస్తోందా? అందుకే బీఆర్‌ఎస్‌ చేయాల్సిన పనులను కూడా కమలం నేతలు తమ బాధ్యతగా భావిస్తున్నారా? ఖైరతాదాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటే బీజేపీకి అభ్యంతరం ఎందుకు? దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా బీజేపీ ఫిర్యాదు చేయడంలో మతలబు ఏంటి? బీజేపీ టార్గెట్‌ ఖైరతాబాద్‌ నియోజకవర్గమా? లేక అంతకు మించిన ప్లాన్‌ ఏమైనా ఉందా?

ఒక్క ఖైరతాబాద్‌ ఎమ్మెల్యేపైనే ఫిర్యాదు ఎందుకు?
ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాల్సిందిగా బీజేపీ ఫిర్యాదు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్‌లో చేరి… సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయనపై అనర్హత వేటు వేయాల్సిందిగా ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది బీఆర్‌ఎస్‌. మరోవైపు కోర్టులో కేసు కూడా దాఖలు చేసింది. ఈ ఫిర్యాదు పెండింగ్‌లో ఉండగానే బీజేపీ కూడా అనర్హత పిటిషన్‌ దాఖలు చేయడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరితే… ఒక్క ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానంపైనే చర్యలకు బీజేపీ డిమాండ్‌ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. దానంపై బీజేపీ ఫిర్యాదు చేయడానికి అసలు కారణమేంటి? అన్న చర్చ మొదలైంది.

పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాన్ని రిపీట్‌ చేయొచ్చని అంచనా..
బీజేపీ నేతలు ఖైరతాబాద్‌పై దృష్టి సారించడానికి ప్రధాన కారణం ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు…. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో రెండో స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ…. పార్లమెంట్‌ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీ సాధించి తొలి స్థానానికి చేరుకుంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోటీ చేసినప్పటికీ ప్రజలు తమ పార్టీ అభ్యర్థి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి అత్యధిక మెజార్టీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు కమలం నేతలు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయడం ద్వారా ఉప ఎన్నిక జరిగితే… పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాన్ని రిపీట్‌ చేయొచ్చని అంచనా వేస్తున్నారు కమలం నేతలు.

ఇంకో పార్టీ తరఫున ఎలా పోటీ చేస్తారు?
గత ఏడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసిన దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.. ఐతే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడంతో… ఈ ఏడాది మార్చిలో పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరారు.. అంతేకాకుండా కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో బరిలోదిగారు.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచిన దానం.. ఆ పదవిలో కొనసాగుతుండగానే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇంకో పార్టీ తరఫున ఎలా పోటీ చేస్తారని ప్రశ్నిస్తోంది బీజేపీ. దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారనటానికి ఎన్నికల కమిషన్‌నే సాక్ష్యంగా చూపుతూ…. అనర్హత పిటిషన్‌ దాఖలు చేసింది.

ఉప ఎన్నిక జరిగితే.. తమకే ప్రయోజనం అనే భావన..
మరోవైపు ఇప్పటికే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కూడా స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. అయితే బీజేపీ మాత్రం స్పీకర్‌పై ఒత్తిడి పెంచడంతోపాటు తగిన సాక్ష్యాలు ఉన్నందున దానంపై అనర్హత వేటు వేయాల్సిందేనన్న డిమాండ్‌తో ఒక్క దానంపైనే ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్‌ సాక్ష్యం బలమైనది కనుక దానంపై అనర్హత వేటు పడితే.. ఉప ఎన్నికల జరుగుతుందని.. తమకు ప్రయోజనం ఉంటుందని ఆశిస్తోంది బీజేపీ.

లోక్‌సభ ఎన్నికల నాటికి మారిన సీన్..
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున దానం 67 వేల 363 ఓట్లు సాధించారు.. అదే సమయంలో ఇక్కడ బీజేపీ 45 వేల 358 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక కాంగ్రెస్‌ 38 వేల 94 ఓట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల నాటికి సీన్ మారింది. దానం నాగేందర్ కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తే.. 57 వేల 124 ఓట్లతో రెండో స్థానానికి పడిపోయారు. కాంగ్రెస్‌కు ఓట్లు పెరిగినా, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే భారీగా ఓట్లు తగ్గి వ్యక్తిగతంగా నష్టపోయారు దానం. ఇదే సమయంలో బీజేపీ ఏకంగా 73 వేల 663 ఓట్లను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికలకన్నా 35 వేల 570 ఓట్లను అధికంగా సాధించి దానంను ఖంగు తినిపించింది.

సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామంటున్న బీజేపీ..
దీంతో ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక జరిగితే కాషాయ జెండా ఎగరవేస్తామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఉప ఎన్నిక జరగాలంటే దానంపై అనర్హత వేటు పడాలని ఆశిస్తున్న కమలనాథులు… స్పీకర్‌పై ఒత్తిడి పెంచేందుకు బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుకు అదనంగా పిటిషన్‌ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌ జాప్యం చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లైనా సరే… తమకు అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకోవాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఆపరేషన్‌ ఖైరతాబాద్‌ పేరిట బీజేపీ పావులు కదుపుతుండటం రాష్ట్ర రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీయగా, స్పీకర్‌ నిర్ణయం ఎలా ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది.

Also Read : కంచుకోటలో దయనీయంగా బీఆర్ఎస్.. ఎందుకీ దుస్థితి? తప్పు మీద తప్పులతో పార్టీని కష్టాల్లో నెట్టేస్తున్నదెవరు?

ట్రెండింగ్ వార్తలు