బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేకే కీలక నిర్ణయం.. ఆ పదవికి రాజీనామా

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కే.కేశవరావు బీఆర్ఎస్ నుంచి నిన్న కాంగ్రెస్ లో చేరారు.

KK Resign : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కే.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు రాజ్యసభ్య ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ కు లేఖ అందజేశారు.

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కే.కేశవరావు బీఆర్ఎస్ నుంచి నిన్న కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారాలని ఆయన భావించారు. అయితే, నిన్న సాధ్యం కాలేదు.

ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ కు లేఖ రాశారు కేకే. పార్టీ ఫిరాయింపుల వివాదం నేపథ్యంలో జాతీయ స్థాయిలో అలాంటి పరిస్థితికి తావు ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ మొదటి నుంచి చెబుతున్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చే వారు తమ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు కేశవరావు తన పదవికి రిజైన్ చేశారు.

రాజీనామాపై కేకే ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ నుండి వైదొలిగానని తెలిపారు. బీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యానని.. సభలో నా స్థానాన్ని ఖాళీ చేయడానికి నేను నైతికంగా/చట్టబద్ధంగా కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు. రాజ్యసభ పదవికి ఇంకా రెండేళ్ల సమయం ఉందన్నారు. కనీస విలువలను కాపాడుతూ ఈరోజు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా పత్రాన్ని చైర్మన్‌కి సమర్పించానని కేకే వెల్లడించారు.

Also Read : కంచుకోటలో దయనీయంగా బీఆర్ఎస్.. ఎందుకీ దుస్థితి? తప్పు మీద తప్పులతో పార్టీని కష్టాల్లో నెట్టేస్తున్నదెవరు?

ట్రెండింగ్ వార్తలు