టీడీపీకి బిగ్ షాక్.. మాజీ ఎంపీ మాగంటి బాబు గుడ్ బై?

టీడీపీ నుండి ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు మాగంటి బాబు.

Maganti Babu : ఏలూరు జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఏలూరు ఎంపీ టికెట్ ఆశించి భంగపడిన మాగంటి బాబు టీడీపీని వీడనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనతో వైసీపీ, కాంగ్రెస్ పెద్దలు టచ్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. మాగంటి బాబు తన పుట్టిల్లు కాంగ్రెస్ లోకి వెళ్తారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ నుండి మాగంటి బాబుకు ఆహ్వానం అందినట్లు సమాచారం. ఏలూరు ఎంపీ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ఆయనకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

కాగా, మాగంటి బాబు వైసీపీలో చేరతారంటూ మరో ప్రచారం జరుగుతోంది. మాగంటి బాబు సన్నిహితుడు ముద్రగడ పద్మనాభంతో వైసీపీలోకి రావాలని చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అన్ని కుదిరితే మాగంటి బాబు రెండు రోజుల్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి మాగంటి బాబు ఏ నిర్ణయం తీసుకుంటారు? అనేది ఉత్కంఠగా మారింది.

మాగంటి బాబు టీడీపీలో సీనియర్ నేత. 2009 వరకు కాంగ్రెస్ లో కొనసాగారు. రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. ఇంతలో అనూహ్యంగా టీడీపీలోకి వచ్చారు. అప్పుడే ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ, 2014లో ఏలూరు ఎంపీగా గెలిచారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక వర్గం అంటూ మాగంటి బాబుకి ఉందని చెప్పొచ్చు. మాగంటి బాబుకు కుటుంబ నేపథ్యం కూడా ఉంది. మాగంటి బాబు తండ్రి మాగంటి రవీంద్రనాథ్ చౌదరి కాంగ్రెస్ లో చాలా సీనియర్ గా ఉన్నారు. జిల్లా మొత్తం కూడా వీరి వర్గం ఉంది. ఆనాడు ఎన్టీఆర్ హవాలోనూ మాగంటి బాబు తండ్రి జెడ్పీ ఛైర్మన్ గా గెలిచిన పరిస్థితి ఉంది. జిల్లా మొత్తం పట్టు కలిగిన నేతగా మాగంటి బాబుకు పేరుంది.

2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత మాగంటి బాబు కుటుంబంలో జరిగిన విషాదకర సంఘటనల నేపథ్యంలో ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే, గతేడాది నుంచి తిరిగి ఆసక్తి చూపించారు. తనకు ఏలూరు పార్లమెంటు స్థానం ఇవ్వాలని చంద్రబాబును అడుగుతూ వచ్చారు. కానీ, బలహీన వర్గాలకు బీసీలకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాగంటి బాబు అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు పక్కన పెట్టారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడిని ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించారు. టికెట్ దక్కకపోవడంతో మనస్తాపం చెందిన మాగంటి బాబు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Also Read : అన్నదమ్ముల యుద్ధంలో గెలుపెవరిది? ఉత్కంఠ రేపుతున్న విజయవాడ పార్లమెంట్‌ సీటు

 

ట్రెండింగ్ వార్తలు