Queen Elizabeth : రాణి ఎలిజబెత్ మరణం అన్నదమ్ములిద్దరినీ ఒక్కటి చేస్తుందా? ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హ్యారీ తిరిగి కలిసిపోతారా?

రాణి ఎలిజబెత్ మరణం అన్నదమ్ములిద్దరినీ ఒక్కటి చేస్తుందా? ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హ్యారీ తిరిగి కలిసిపోతారా? బ్రిటన్ మీడియా ఏమంటోంది?

Queen Elizabeth : బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్ కుటుంబంలో కొన్నేళ్లగా ఉన్న విభేదాలకు తెరపడనుందా..? రాచరికాన్ని వదులుకుని రెండేళ్ల క్రితం బకింగ్ హామ్ ప్యాలెస్ వదిలి వెళ్లిన ప్రిన్స్ హ్యారీ దంపతులు మళ్లీ రాజకుటుంబంతో కలిసిపోనున్నారా..? అవుననే అంటోంది బ్రిటన్ మీడియా. బాధ, ఆవేదన ఉన్న సమయంలో సాధారణ ప్రజల కుటుంబసభ్యులు, బంధువులు విభేదాలు మరిచి ఎలా ఒక్కటవుతారో..రాచకుటుంబమూ అలాగే ఒక్కటయ్యే అవకాశం కనిపిస్తోంది. రాణి ఎలిజజెత్ మరణం అన్నదమ్ములిద్దరినీ మళ్లీ దగ్గర చేస్తోంది.

ప్రిన్సెస్ డయానా మరణం తర్వాత బ్రిటన్ రాజకుటుంబంలో మళ్లీ అంత అలజడి చెలరేగింది….రెండేళ్ల క్రితం ప్రస్తుత రాజు ప్రిన్స్ చార్లెస్ చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ..బకింగ్ హామ్ ప్యాలెస్ ను వదిలి వెళ్లినప్పుడు. రాచరికాన్ని వదులుకుని ప్రిన్స్ హ్యారీ…భార్య మేఘన్ మార్కెల్‌తో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఓఫ్రా విన్‌ఫ్రే షోలో రాచకుటుంబం గురించి సంచలన ఆరోపణలు చేశారు హ్యారీ దంపతులు. ప్యాలెస్‌లో వర్ణవివక్ష ఉందని, తామెన్నో బాధలు, అవమానాలు పడ్డామని ఆవేదన వ్యక్తంచేశారు. మేఘన్ తన తోటి కోడలు, ప్రిన్స్ విలియమ్స్ భార్య కేథరిన్‌పైనా విమయర్శలు చేశారు. డయానా 1997లో కారు ప్రమాదంలో చనిపోవడానికి ముందు…డయానా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఎంత సంచలనం సృష్టించిందో హ్యారీ, మేఘన్ చెప్పిన విషయాలు కూడా ప్రపంచ వ్యాప్తంగా అంతే సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత హ్యారీ, మేఘన్‌కు రాచకుటుంబంతో సంబంధాలు మరింత బలహీనపడ్డాయి.

Queen Elizabeth final journey : రాణి ఎలిజబెత్ అంతిమయాత్రలో మొదటిదశ పూర్తి .. బల్మోరల్ ప్యాలెస్ నుంచి .. ఎడిన్‌బర్గ్‌కు రాణీ పార్థివదేహం తరలింపు..

సాధారణ కుటుంబాల్లోలానే రాచకుటుంబంలోనూ అన్నదమ్ములకు అస్సలు పొసగడం లేదని, ఇందుకు భార్యలే కారణమనీ వార్తలొచ్చాయి. ఆ తర్వాత ప్రిన్స్ హ్యారీ బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు ఎప్పుడూ తిరిగిరాలేదు. రాణి ఎలిజబెత్ చివరిక్షణాల్లో ఉన్నప్పుడు…కుటుంబ సభ్యులంతా బల్మోరల్ ప్యాలెస్‌కు చేరుకున్నారు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్‌కూడా బల్మోలర్ బయలుదేరినట్టు వార్తలొచ్చాయి. కానీ హ్యారీ ఒక్కడే ప్యాలెస్‌కు వెళ్లాడు. బల్మోరల్‌కు బయలుదేరిన మేఘన్‌ను చివరిక్షణాల్లో ఉన్న రాణి దగ్గరకు తీసుకురావొద్దని ప్రస్తుత రాజు చార్లెస్ చెప్పినట్టు ఆ తర్వాత కథనాలు వెలువడ్డాయి. ఎలిజబెత్ మరణం సాక్షిగా మరోసారి రాచకుటుంబం విభేదాలు బయటికొచ్చాయని అంతా భావించారు. కానీ రాణి మరణించిన రెండు రోజుల తర్వాత అనూహ్య పరిణామం జరిగింది.

రాణి మరణం తర్వాత సంతాపం తెలిపేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పెద్ద ఎత్తున పుష్పగుచ్ఛాలు పంపిస్తున్నారు. ఆ ప్రజలతో మాట్లాడేందుకు, సంతాప సందేశాలు పరిశీలించేందుకు ప్రిన్స్ విలియమ్ దంపతులు, ప్రిన్స్ హ్యారీ దంపతులు తొలిసారి కలిసికట్టుగా విండ్సర్ క్యాజిల్ బయటకు వచ్చారు. క్యాజిల్ గేట్ల దగ్గరకు ఒకే కారులో వచ్చిన విలియమ్, కేట్, హ్యారీ, మేఘన్ కాసేపు ప్రజలతో మాట్లాడారు. విలియమ్, కేట్ పక్కపక్కన నడడగా..హ్యారీ, మేఘన్ ఒకరుచేయి ఒకరు పట్టుకుని నడిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియమ్స్…తమ్ముడుతోనూ, మరదలితోనూ మాట్లాడారు. కేట్, మేఘన్ మాత్రం మాట్లాడుకోలేదు.

కాసేపు క్యాజిల్ గేట్ దగ్గర గడిపిన వారంతా తిరిగి అదే కారులో వెనక్కి వెళ్లిపోయారు. ప్రిన్స్ విలియమ్స్, ప్రిన్స్ హారీని ఇలా ఒకచోట చూసిన బ్రిటన్ ప్రజలు సంతోషపడుతున్నారు. ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. బ్రిటన్ రాజు హోదాలో చేసిన తొలి ప్రసంగంలో కూడా చార్లెస్..చిన్న కుమారుడు హ్యారీ, మేఘన్ గురించి మాట్లాడారు. హ్యారీ, మేఘన్‌పై తనకెంతో ప్రేమ ఉందని, వారు హాయిగా జీవించాలని ఆకాంక్షించారు.

అటు రాణి మరణంతో ప్రిన్స్ చార్లెస్ రాజు కావడంతో…ఇప్పటిదాకా ఆయన నిర్వహించిన ప్రిన్స్ ఆఫ్ వేల్స్ విలియమ్స్‌కు దక్కింది. విలియమ్స్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్‌గా, కేథరిన్ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్‌గా నియమితులయ్యారు. డయానా తర్వాత కేథరిన్‌ ప్రిన్సెస్‌ ఆఫ్ వేల్స్ అయ్యారు. చార్లెస్ రెండో భార్య ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ చేపట్టలేదు. ప్రిన్స్ ఆఫ్ వేల్స్, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్…రాణి ఎలిజబెత్ మరణంపై సంతాప సందేశం విడుదల చేశారు. సంతోష సమయాల్లోనూ, బాధల్లోనూ నాయనమ్మ తన వెంట ఉన్నారని..ఆమె లేని జీవితం ఊహించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి ఒకరోజు వస్తుందని తెలిసినప్పోటికీ…ఈ వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి మరింత సమయం పడుతుందన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు